written exams
-
TSPSC: పరీక్షల రీషెడ్యూల్ ప్రకటించిన టీఎస్పీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: కొలువుల భర్తీ పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్TSPSC. ఈ మేరకు ఐదు నిమాయక పరీక్షలకు శనివారం సాయంత్రం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 23వ తేదీన జరగాల్సిన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ పరీక్షను జూన్ 28వ తేదీకి వాయిదా వేసింది. అలాగే ఈ నెల 25వ తేదీన జరగాల్సిన అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్షను జూన్ 16వ తేదీకి వాయిదా వేసింది. మే 7వ తేదీన జరగాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్ రాత పరీక్షను మే 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 26, 27 తేదీల్లో జరగాల్సిన గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ గెజిటెడ్ కేటగిరీల పరీక్షను జులై 18వ తేదీకి వాయిదా వేసింది. అలాగే మే 15, 16వ తేదీల్లో జరగాల్సిన గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నాన్ గెజిటెడ్ కేటగిరీల పరీక్షను జులై 20వ తేదీకి రీషెడ్యూల్ చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
‘కానిస్టేబుల్’ మెయిన్ పరీక్షకు 95,208 మందికి అర్హత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ రాతపరీక్షలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. గత నెల 22న నిర్వహించిన పరీక్షల ఫలితాలను ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. 35 ప్రాంతాల్లోని 997 కేంద్రాల్లో నిర్వహించిన ప్రిలిమినరీ రాతపరీక్షకు 4,59,182 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 95,208 మంది అర్హత సాధించారు. పరీక్ష రాసిన 3,63,432 మంది పురుషుల్లో 77,876 మంది క్వాలిఫైకాగా.. 95,750 మంది మహిళల్లో 17,332 మంది క్వాలిఫై అయ్యారు. అర్హత సాధించిన వారి వివరాలు slprb. ap.gov.in వెబ్సైట్లో ఉంచారు. ప్రిలిమినరీ రాతపరీక్ష జవాబు పత్రాల కీ గతనెల 22న సాయంత్రం విడుదల చేశారు. దానిపై వచ్చిన 2,261 అభ్యంతరాలను పరిశీలించిన సబ్జెక్ట్ నిపుణులు.. ఆ కీలోని మూడు ప్రశ్నలకు జవాబులు మార్చి తుది కీ విడుదల చేశారు. స్కాన్చేసిన ఓఎంఆర్ షీట్లను మూడురోజలపాటు డౌన్లోడ్ చేసుకునేలా అందుబాటులో ఉంచారు. ఈ నెల 7వ తేదీ (మంగళవారం) సాయంత్రం 5 గంటల వరకు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తదుపరి సమాచారం కోసం ఈ వెబ్‌సైట్‌ను తరచు పరిశీలించాలని సూచించారు. మెయిన్ పరీక్షకు దరఖాస్తులు ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాలకు హెల్ప్‌లైన్ నంబరు 9441450639కి కాల్ చేయవచ్చు. 9100203323 నంబరులో సంప్రదించవచ్చు. mail-slprb@ap.gov.inకి మెయిల్ చేయవచ్చు. కటాఫ్ మార్కుల వివరాలు 200 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో కటాఫ్ ఓసీలకు 40 శాతం (200కు 80 మార్కులు), బీసీలకు 35 శాతం (200కు 70 మార్కులు), ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 30 శాతం (200కు 60 మార్కులు)గా నిర్ణయించారు. కులాలవారీగా పరీక్ష రాసిన, క్వాలిఫై అయిన పురుషులు, మహిళల సంఖ్య -
TS: ‘పోలీస్’ తుది పరీక్షల షెడ్యూల్ ఖరారు
సాక్షి, హైదరాబాద్: యూనిఫామ్ సర్వీసెస్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో కీలకమైన తుది రాత పరీక్ష తేదీల షెడ్యూల్ ఖరారైంది. మార్చి 12 నుంచి పలు విభాగాల్లోని 17,560 పోస్టుల భర్తీకి తుది రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియలో పోలీస్ ఉద్యోగార్థులు తీవ్రంగా శ్రమించే సివిల్ ఎస్సై పోస్టులకు రాత పరీక్షను ఏప్రిల్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ప్రకటించారు. సివిల్ కానిస్టేబుల్ తుది రాత పరీక్షను ఏప్రిల్ 23న నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు పరీక్షల తేదీలను వెల్లడిస్తూ ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేహదారుఢ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు తుది రాతపరీక్షకు సన్నద్ధం కావాలని సూచించారు. ఈనెల 5తో ముగియనున్న దేహదారుఢ్య పరీక్షలు పలు విభాగాల్లోని ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి దేహదారుఢ్య పరీక్షలు డిసెంబర్ 8న ప్రారంభించారు. ఈ ప్రక్రియ జనవరి 5తో ముగియనుంది. హైదరాబాద్‌సహా తెలంగాణ వ్యాప్తంగా 11 ప్రాంతాల్లో ఫిజికల్ ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నారు. దేహదారుఢ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు తుది రాత పరీక్ష హాల్‌టికెట్లను త్వరలోనే జారీ చేయనున్నట్టు బోర్డు అధికారులు తెలిపారు. డ్రైవర్, డ్రైవర్ ఆపరేటర్స్, మెకానిక్ పోస్టులకు పోటీపడుతున్న అభ్యర్థులకు డ్రైవింగ్ టెస్ట్ తేదీలను త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలిపారు. -
పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ రాత పరీక్షల షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: వివిధ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షల షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ గురువారం ప్రకటించింది. ఈ పరీక్షల హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించింది. ఈ షెడ్యూల్ లోని పోస్టులన్నింటికీ జనరల్ స్టడీస్ మెంటల్ ఏబిలిటీ పరీక్ష నవంబర్ 7న జరగనుంది. అన్ని పోస్టులకు ఇది కామన్ పేపర్. దేవదాయ శాఖ ఈవో స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు దేవదాయ శాఖ ఈవో స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. పరీక్ష రాసిన మొత్తం 52,915 మందికి గాను 1,278 మంది మెయిన్ పరీక్షకు ఎంపికయ్యారు. -
గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు ప్రారంభం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 26 వరకూ పరీక్షలు కొనసాగనున్నాయి. 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ఆదివారం ఉదయం నుంచి రాతపరీక్షలు ఆరంభం అయ్యాయి. అధికారం చేపట్టిన ఆరు నెలల్లోపే గతేడాది దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఒకేసారి 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరో ఏడాది కూడా పూర్తికాక ముందే మరోసారి భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. అందులోనూ కరోనాతో ఆర్థికంగా మందగమన పరిస్థితులు ఉన్నప్పటికీ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలతో పటిష్ట ఏర్పాట్లు చేసింది. దీంతో రాష్ట్రంలో నిరుద్యోగ యువత ముఖాల్లో ఇప్పుడు వెలుగులు కాంతులీనుతున్నాయి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక వరుసగా వేలాది ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తుండటమే ఇందుకు కారణం. భర్తీ ప్రక్రియలోనూ వేగమే.. ► గతేడాది గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసిన 35 రోజులకే రాతపరీక్షలు నిర్వహించడంతోపాటు 11 రోజులకే ఫలితాలను కూడా ప్రకటించింది. అంతేకాకుండా మరో పది రోజుల్లోనే ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేసింది. ► రెండు విడతల్లో భర్తీ చేసిన/చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్తగా సృష్టించి, మం జూరు చేసినవే కావడం గమనార్హం. ► అధికారిక లెక్కల ప్రకారం.. స్వాతంత్య్రం వచ్చాక గత 72 ఏళ్లలో జరిగిన నియామకాల ద్వారా రాష్ట్రంలో ఇప్పుడున్న మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య సుమారు ఐదు లక్షలు కాగా ఇందులో నాలుగో వంతుకు సమానమైన ప్రభుత్వ ఉద్యోగాలను వైఎస్ జగన్ ప్రభుత్వమే సృష్టించడం విశేషం. పూర్తి పారదర్శకంగా.. ► ప్రభుత్వం కొత్త ఉద్యోగాలను సృష్టించడంతోపాటు వాటిని అత్యంత వేగంగా, ఎ లాంటి వివాదాలకు, దళారులకు ఆస్కా రం లేకుండా పారదర్శకంగా భర్తీ చేస్తోంది. ► దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఉద్యోగ నియామక ప్రక్రియలో ప్రభుత్వం ఇంటర్వ్యూలు లేకుండా చేసింది. ► కేవలం రాతపరీక్షల్లో అభ్యర్థులకు వచ్చే మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటూ, రిజర్వేషన్లను పాటిస్తూ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ► గతేడాది 1.34 లక్షల ఉద్యోగాలకు 21.69 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఇప్పు డు 16,208 పోస్టులకు మొత్తం 10,56,931 మంది దరఖాస్తు చేసుకున్నారు. నేటి నుంచి 26 వరకు రాతపరీక్షలు ► రాష్ట్రంలో ఆదివారం నుంచి ఈ నెల 26 వరకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి రాతపరీక్షలు జరుగుతాయి. ► 19 కేటగిరీల్లో రోజుకు రెండు పరీక్షల చొప్పున నిర్వహిస్తారు. ► మొత్తం 2,221 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ► కరోనా నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో ఒకరికొకరి మధ్య ఆరడుగుల దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. ► బెంచ్‌కు ఒకరి చొప్పున ప్రతి పరీక్ష గదిలో 16 మంది అభ్యర్థులను మాత్రమే ఉంచుతారు. ► రాతపరీక్షకు ముందు, పరీక్ష అనంతరం అన్ని పరీక్ష కేంద్రాలను సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శానిటైజ్ చేయిస్తున్నా మని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. ► ప్రతి పరీక్ష గది ముందు శానిటైజర్ స్టాండ్లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. కరోనా అనుమానిత లక్షణాలున్నవారికి ప్రత్యేక ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేశామని చెప్పారు. ► రోజూ ఉదయం జరిగే పరీక్ష పది గంటలకు, సాయంత్రం పరీక్ష మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ► నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యం అయినా రాతపరీక్షకు అనుమతించబోమని చెప్పారు. -
సచివాలయ పరీక్షల నిర్వహణపై సర్వత్రా ప్రశంసలు
సాక్షి, అమరావతి : ప్రతిపక్షాల ప్రచారం నమ్మి ‘సచివాలయ’ ఉద్యోగాలంటే ఏవేవో అనుమానాలు వ్యక్తం చేసిన అభ్యర్థులు సైతం రాత పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని చూసి శభాష్ అంటున్నారు. ఒక రాష్ట్రంలో 1,34,524 ఉద్యోగాలకు ఏకంగా 19,49,218 మంది హాజరవ్వడం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించడం రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలోనే రికార్డు అని అధికారులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆదివారంతో ఉద్యోగాల రాత పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. ఈ నెల 1వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య ఆరు రోజుల పాటు జరిగిన పరీక్షలకు ఏకంగా 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రశ్నాపత్రం రూపకల్పన, పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లు సివిల్స్ రాతపరీక్షలు నిర్వహించే యూపీఎస్సీ స్థాయిలో ఉన్నాయని అటు పరీక్ష రాసిన అభ్యర్థులు, ఇటు మేధావులు ప్రశంసలు కురిపిస్తున్నారు. లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎగతాళి చేశారు.. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశంలోని మరే రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ఒకే విడత 1,34,524 ఉద్యోగాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జూలై నెలలో నోటిఫికేషన్లు జారీ చేసింది. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు కలిపి 1,26,728 ఉద్యోగాలకు, విద్యుత్ సంస్థలు మరో 7,796 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. స్వాతంత్య్రం వచ్చాక గత 72 ఏళ్లలో జరిగిన నియామకాల ద్వారా రాష్ట్రంలో ఇప్పుడున్న మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 4.61 లక్షలుగా ఉంది. ఆ సంఖ్యలో దాదాపు మూడో వంతు ప్రభుత్వ ఉద్యోగాలను ఒకే విడతలో భర్తీ చేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున వైఎస్ జగన్ లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేస్తే.. అవన్నీ వాళ్ల పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకుంటారులే అంటూ ప్రతిపక్ష నాయకులు విమర్శించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసేందుకు 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తే 21,69,589 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రతిపక్షాలు చేసే ప్రచారం నమ్మి దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు ఈ ఉద్యోగాలు మెరిట్ ఆధారంగా జరగుతాయా లేదా అని అనుమానం వ్యక్తం చేశారు. అలా అనుమానం వ్యక్తం చేసిన వారు సైతం రాత పరీక్షలు ముగిశాక ప్రభుత్వ చిత్తశుద్ధిని కొనియాడుతున్నారు. అతి తక్కువ సమయంలో నిర్వహణ రాష్ట్రంలో ఇదివరకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడ్డాక భర్తీ ప్రక్రియ పూర్తవ్వడానికి ఏడాదో, రెండేళ్లో, కొన్ని సార్లు మూడు నాలుగేళ్లు పట్టిన ఉదంతాలున్నాయి. కానీ ‘సచివాలయ’ ఉద్యోగ నియామకాల ప్రక్రియ అంతా రెండున్నర నెలల్లోనే ముగియనుంది. 1,26,728 ఉద్యోగాలకు జూలై 26న నోటిఫికేషన్ విడుదల అయింది. సెప్టెంబర్ 8వ తేదీ నాటికి అన్ని ఉద్యోగాలకు రాత పరీక్షలు మగిశాయి. జవాబు పత్రాల స్కానింగ్ ప్రక్రియ కూడా ఇప్పటికే చాలా వరకు పూర్తయినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నాటికి నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు ఉద్యోగ నియామకాల పత్రాలు అందజేసి, వారు విధుల్లో కూడా చేరిపోతారని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 125 రోజుల్లో.. నోటిఫికేషన్ జారీ చేశాక కేవలం 65 – 70 రోజుల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని అధికారులు కంకణం కట్టుకొని పని చేస్తున్నారు. యూపీఎస్సీ పరీక్షల స్థాయిలో ఏర్పాట్లు ఉద్యోగ నియామక ప్రక్రియలో కీలకమైన రాత పరీక్షల నిర్వహణ కూడా జాతీయ స్థాయి పోటీ పరీక్షలను నిర్వహించే యూపీఎస్సీ స్థాయికి ఏ మాత్రం తక్కువగా లేదని పరీక్ష రాసిన అభ్యర్థులు చెబుతున్నారు. ఒకేసారి దరఖాస్తు చేసుకున్న 21.69 లక్షల మంది అభ్యర్థులకు సాధ్యమైనంత మేర అతి తక్కువ దూరంలో పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నెల 1వ తేదీ ఉదయం జరిగిన రాత పరీక్షకు ఒక్కదానికే 12.54 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడంతో రాష్ట్రంలోని మారు మూల మండల కేంద్రాల్లో సైతం కేంద్రాలను ఏర్పాటు చేసింది. 4,465 కేంద్రాల్లో పరీక్షలు జరపడంతో ఆ పరీక్షకు ఏకంగా 92.77 శాతం మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రంలో ప్రతి 24 మంది అభ్యర్థులకు ఒక గది కేటాయించారు. సమగ్ర పర్యవేక్షణకు ఒక పరీక్షా కేంద్రంలో పది గదులు మించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు మంచి నీటి పేరుతో తమ సీటు నుంచి కదలకుండా కూర్చున్న చోటుకే అందజేసేలా ముందుస్తు ఏర్పాటు చేశారు. మెటీరియల్ తరలింపులో పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకండా పట్టణాల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పరీక్షా కేంద్రాల పరిధిలో వంద మీటర్ల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు ముందస్తుగా మూసి వేశారు. ఏర్పాట్ల విషయంలో ప్రతి చోటా యూపీఎస్సీ ప్రమాణాలను పాటించినట్టు అభ్యర్థులు చెబుతున్నారు. పొరపాట్లకు తావేలేదు ప్రశ్నాపత్రాలు లీకు చేస్తారని ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండే వారు కొందరు సోషల్ మీడియాలో పనిగట్టుకొని ప్రచారం చేశారు. ఆరు రోజుల పాటు 5,314 పరీక్షా కేంద్రాల్లో.. తొలిరోజు మూరుమూల మండల కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినా ప్రశ్నాపత్రాల భద్రత విషయంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మూరు మూల ప్రాంతంలో ఉండే పరీక్షా కేంద్రానికి చేరాల్సిన ప్రశ్నాపత్రాలను ఒక్క రోజు ముందు దానికి దగ్గరలోని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ రూం నుంచి వాటిని పర్యవేక్షించారు. ప్రభుత్వం ముందస్తుగా తీసుకున్న జాగత్రలతో ఆరు రోజుల పాటు ఎక్కడా చిన్న పొరపాటు చోటు చేసుకోలేదు. ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఉన్న ఏపీపీఎస్సీ ద్వారా జరిగే పరీక్షలో ప్రశ్నాపత్రాల్లో పెద్ద ఎత్తున తప్పులు దొర్లడం అనేది పోటీ పరీక్ష రాసే అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఏపీపీఎస్సీ ద్వారా కాకుండా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించినప్పటికీ, ప్రశ్నాపత్రాల రూపకల్పన సైతం అభ్యర్థులను మెప్పించింది. ప్రశ్నపత్రాలలో నామమాత్రపు పొరపాట్లు కూడా జరగలేదని అభ్యర్థులు చెబుతున్నారు. పరీక్ష జరిగిన రోజు ప్రాథమిక ‘కీ’ని అధికారికంగా విడుదల చేశారు. నాలుగు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం తుది ‘కీ’ విడుదల చేశారు. ఇంత పకడ్బందీ ప్రణాళిక ఇటీవల కాలంలో ఏ పోటీ పరీక్షలలోనూ చూడలేదని అభ్యర్థులు వ్యాఖ్యానించారు. ఇంటర్వ్యూ రద్దుతో దళారులకూ చెక్ పకడ్బందీ పరీక్ష నిర్వహణే కాదు.. పారదర్శకంగా ఈ ప్రక్రియ ఉండాలని అధికారులు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో దళారుల వ్యవస్థకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ఇంటర్వ్యూ అన్నది లేకుండా ఉండాలని, కేవలం రాత పరీక్షల్లో అభ్యర్థులకు వచ్చే మార్కుల ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. పారదర్శకతగా పరీక్షలు నిర్వహిస్తూనే.. పోటీ పడుతున్న అభ్యర్థులు దళారులను నమ్మవద్దని ప్రభుత్వం విస్త్ర్తతంగా ప్రచారం చేసింది. ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల మేరకు కొన్ని జిల్లాల్లో దళారులపై కేసులు నమోదు చేయడం గమనార్హం. అధికారుల పాత్ర కీలకం.. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రత్యేక వ్యవస్థ ఉన్న ఏపీపీఎస్సీనే ఒకే విడతలో 1,26,728 ఉద్యోగాలను నిర్ణీత సమయంలో ఎప్పుడూ భర్తీ చేయలేదు. ఈ పరిస్థితుల్లో జిల్లా సెలక్షన్ కమిటీల ద్వారా ఉద్యోగ భర్తీ ప్రక్రియను చేపట్టారు. ఈ పోస్టుల భర్తీని చాలా పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టి పట్టుదలతో ఎప్పటికప్పుడు మంత్రులకు, సంబంధిత అధికారులకు సూచనలతో పాటు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎంవో కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్, మున్సిపల్ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, మున్సిపల్ కమిషనర్ విజయకుమార్‌లు ఒక జట్టుగా ఏర్పడి సంబంధిత అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ ఈ నియామక ప్రక్రియలో కీలకమై పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించారు. పరీక్షల రాష్ట్ర కమిటీ కన్వీనర్‌గా గిరిజా శంకర్ ప్రతి అంశం దగ్గర ఉండి పర్యవేక్షించారు. దీంతో పాటు జిల్లా కలెక్టరు, ఎస్పీలు, జిల్లా అధికార యంత్రాంగం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ శాఖ సిబ్బంది పరీక్షల నిర్వహణలో చిత్తశుద్ధితో పని చేశారు. చరిత్రాత్మకం మొత్తం 19 రకాల ఉద్యోగాలకు 21.69 లక్షల మంది పరీక్షలు రాశారు. తప్పన్నదానికి తావులేకుండా పరీక్షలు నిర్వహించాం. ఇదొ చరిత్రాత్మక ఘటన. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయి నియామకాలు, ఇన్ని లక్షల మందికి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం జరగలేదు. పక్కా ప్రణాళికతో సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించిన పంచాయతీరాజ్ కమిషనర్, రాష్ట్ర స్థాయి సిబ్బంది, జిల్లా కలెక్టర్లు, సిబ్బందికి అభినందనలు. – గోపాలకృష్ణ ద్వివేది, పరీక్ష నిర్వహణ కమిటీ చైర్మన్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి. అందరికీ అభినందనలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఉద్యోగ నియామకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ మేరకు ఆయన అధికారులందరినీ అప్రమత్తం చేశారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా అందరం పనిచేశాం. ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల మేరకు జిల్లాల్లో పరీక్షల నిర్వహణను విజయవంతం చేసిన జిల్లా కలెక్టర్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర, జిల్లా స్థాయి సిబ్బందికి అభినందనలు. – గిరిజా శంకర్, పంచాయతీరాజ్ కమిషనర్, రాష్ట్ర స్థాయి పరీక్షల కమిటీ కన్వీనర్ సీఎం అరుదైన అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికార యంత్రాంగానికి అరుదైన అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పారదర్శకంగా, ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించి ప్రభుత్వం çపట్ల తమ చిత్తశుద్ధిని ప్రదర్శించింది. జిల్లా కలెక్టర్లు, అధికారులు పరీక్షల నిర్వహణకు రేయింబవళ్లు పనిచేశారు. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు. చిన్నపాటి విమర్శలకు తావులేకుండా పరీక్షలు నిర్వహించేందుకు సహకరించిన అన్ని వర్గాల వారికి కృతజ్ఞతలు. – విజయకుమార్, మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ -
సచివాలయ పరీక్షలు.. క్షణం ఆలస్యమైనా నో ఎంట్రీ
సాక్షి, కర్నూలు: గ్రామ/వార్డు సచివాలయ పరీక్షలకు ఒక్క క్షణం ఆలస్యమైనా అనుమతించబోమని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. అభ్యర్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ కె.ఫక్కీరప్ప, ట్రైనీ కలెక్టర్ విధేకరే, డీఆర్వో వెంకటేశంతో కలసి ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉదయం 10 నుంచి 12.30 గంటల మధ్య, మధ్యాహ్నం 2.30 నుంచి 5గంటల మధ్య ప్రతీ రోజూ రెండు పరీక్షలు ఉంటాయన్నారు. జిల్లాలో 881 గ్రామ, 300 వార్డు సచివాలయాల్లో 9,597 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసిందన్నారు. మొత్తం 19 రకాల పోస్టుల కోసం 2,01,886 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరందరికీ సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీవరకు 444 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లాను 12 క్లస్టర్లుగా ఏర్పాటు చేసుకొని, ఒక్కోదానికి ఒక్కో జిల్లా అధికారికి బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. మొత్తం 12,104 మంది సిబ్బందిని పరీక్షల నిర్వహణ కోసం నియమించినట్లు వివరించారు. 25 నుంచి హాల్ టిక్కెట్ల డౌన్లోడ్ అభ్యర్థులు ఆగస్టు 25వ తేదీ అర్ధరాత్రి నుంచి హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. హాల్‌టిక్కెట్‌లో ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి కలెక్టరేట్లో ఏర్పాటు చేసే కమాండ్ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేసి సరి చేసుకోవచ్చని సూచించారు. అలా కానిపక్షంలో తెల్ల కాగితంపై హాల్ టిక్కెట్లో ఉండే వివరాలు రాసుకొని మూడు ఫొటోలు తీసుకొని వాటిపై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించుకొని తీసుకొని రావచ్చని సూచించారు. మొదటి రోజు పరీక్షకే అధిక సంఖ్యలో హాజరు.. సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే పరీక్షల్లో మొదటి రోజు నిర్వహించే పరీక్షనే కీలకమని, ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 44 మండలాల్లో 444 కేంద్రాల్లో 1.15 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు కలెక్టర్ తెలిపారు. మిగిలిన పరీక్షలను కేవలం కర్నూలులో మాత్రమే నిర్వహిస్తామని, అయితే ఆయా పరీక్షలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు లేరన్నారు. మూడో తేదీ పరీక్షకు 18 వేలు, 4వ తేదీ పరీక్షకు 4,631 మంది, ఆరో తేదీ పరీక్షకు 1,574, ఏడో తేదీ పరీక్షకు 10,638 మంది, 8వ తేదీ పరీక్షకు21,856 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్ష పూర్తి అయిన తరువాత అభ్యర్థులకు కార్బన్‌తో కూడిన ఓఎంఆర్ సీటులో కార్బన్ పేపర్‌ను అభ్యర్థులకే ఇస్తారని తెలిపారు. పరీక్షలు ముగిసిన తరువాత జిల్లా వ్యాప్తంగా ఉన్న స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి అన్సర్ షీట్లు, ఓఎంఆర్ షీట్లను జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో ఉంచనున్నట్లు తెలిపారు. మూడంచెల భద్రత.. గ్రామ/వార్డు సచివాలయ పరీక్షలకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. అడిషినల్ ఎస్పీ ఆధ్వర్యంలో ముగ్గురు డీఎస్పీలు, 44 మంది సీఐలు, 109 మంది ఎస్ఐలు, 1334 మంది పోలీసు కానిస్టేబుళ్లుతో కలసి మొత్తం 1500 మంది సిబ్బంది భద్రత సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. వీరంతా రూట్లతోపాటు పరీక్ష కేంద్రం, స్ట్రాంగ్ రూమ్‌లు, వాహనాల తరలింపు విభాగాల్లో ఉంటారన్నారు. కర్నూలులో అభ్యర్థులకు రూట్లు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఆరు డెస్కులను ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు వెళ్లడానికి ఆర్టీసీ తగిన బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దళారులను నమ్మి మోసపోవద్దు... సచివాలయ ఉద్యోగాలను పూర్తిగా రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే భర్తీ చేస్తారని, ఇందులో ఎలాంటి మోసాలకు తావులేదని జిల్లా కలెక్టర్, ఎస్పీ అన్నారు. ఈ పోస్టులు ఇప్పిస్తామని కొందరు దళారులు రంగ ప్రవేశం చేసినట్లు తమకు సమాచారం వస్తోందని, అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు సూచించారు. ఎక్కడైనా దళారులు డబ్బులు డిమాండ్ చేసి పోస్టులు ఇప్పిస్తామని చెప్పితే కమాండ్ కంట్రోల్ రూమ్/ స్థానిక పోలీసు స్టేషన్, తహసీల్దార్, ఎంపీడీఓలకు ఫిర్యాదు చేయాలని వారు సూచించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. గ్రామ/వార్డు సచివాలయ పరీక్షలపై ఉన్న సందేహాలకు కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. నేరుగావచ్చి లేదా 08518–277305/9059477167 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాక rtfrkurnool@fmail.com మెయిల్ చేసినా కూడా సందేహాలను నివృత్తి చేస్తారని వివరించారు. -
ఆ ఆరు ప్రశ్నలు తొలగించండి
సాక్షి, హైదరాబాద్: ఎస్సై పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో పేపర్ బుక్లెట్ కోడ్–బిలోని ఆరు ప్రశ్నలను తొలగించాలని రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. 117, 138, 172, 181, 185, 189 ప్రశ్నలను తొలగించాలని బోర్డుకు స్పష్టం చేసింది. ఈ ఆరు ప్రశ్నల నిర్మాణం సక్రమంగా లేదని, అలాగే వాటికి ఇచ్చిన సమాధానాలు కూడా సక్రమంగా లేవని హైకోర్టు అభిప్రాయపడింది. ఆరు ప్రశ్నలు తొలగించాక తిరిగి అర్హుల జాబితా రూపొందించాలని ఆదేశించింది. తిరిగి అర్హుల జాబితా రూపొందించేటప్పుడు, ఇప్పటికే అర్హత సాధించిన వారిని మినహాయించాలని పేర్కొంది. తాజా జాబితాలో హాల్ టికెట్ నంబర్ ఎదురుగా అభ్యర్థి మార్కులు పొందుపరచాలని స్పష్టం చేసింది. ఆ తర్వాతే శారీరక దారుఢ్య పరీక్ష నిర్వహించాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు, జైళ్లు, అగ్నిమాపక శాఖల్లో 1,217 ఎస్సై పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ బోర్డు గతేడాది మే 31న నోటిఫికేషన్ జారీ చేసింది. గతేడాది ఆగస్టు 26న రాతపరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించిన పేపర్ బుక్లెట్–బి కోడ్‌లోని ఆరు ప్రశ్నలు తప్పని, వాటి సమాధానాలు కూడా తప్పని, వాటిపై అభ్యంతరాలను వ్యక్తం చేసినా పట్టించుకోలేదని, దీని వల్ల తమకు నష్టం కలిగిందంటూ నల్లగొండకు చెందిన డి.ఉపేందర్‌రెడ్డి, మరో 14 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారణ జరిపారు. అభ్యర్థులకు లబ్ధి.. పిటిషనర్ల తరఫు న్యాయవాది చిల్లా రమేశ్ వాదనలు వినిపిస్తూ, 117, 138, 172, 181, 185, 189 ప్రశ్నలు తప్పని, అలాగే వీటికి ఇచ్చిన సమాధానాలు కూడా తప్పని, అందువల్ల వాటిని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. అభ్యర్థుల హాల్ టికెట్నంబర్ల ఎదురుగా మార్కులు పొందుపరచాల్సి ఉన్నా, అది కూడా చేయలేదని తెలిపారు. మార్కులు ప్రచురించి ఉంటే, తుది కీ అందుబాటులో ఉన్న నేపథ్యంలో వాటిని ఓఎంఆర్ కాపీతో పోల్చిచూసుకునే అవకాశం అభ్యర్థులకు ఉండేదని కోర్టుకు నివేదించారు. దీని వల్ల అభ్యర్థులకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. అభ్యర్థులు నిర్ణయించజాలరు.. ఈ వాదనలను రిక్రూట్మెంట్ బోర్డు తరఫున స్పెషల్ జీపీ ఎస్.శరత్‌కుమార్ తోసిపుచ్చారు. ఏ అభ్యర్థి కూడా ఎలాంటి అభ్యంతరాలను లేవనెత్తలేదన్నారు. జేఎన్టీయూ నిపుణుల ద్వారా ప్రశ్న పత్రం రూపొందించామని తెలిపారు. ఆ ఆరు ప్రశ్నలు, సమాధానాల్లో ఎలాంటి తప్పులు, సందిగ్ధత లేదన్నారు. ఏది తప్పో, ఏది ఒప్పో అభ్యర్థులు నిర్ణయించజాలరన్నారు. హాల్ టికెట్ ఎదురుగా మార్కులు పొందుపరచడం సాధ్యం కాదని, యూపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీలు కూడా ఈ విధానాన్ని అనుసరించట్లేదని చెప్పారు. పారదర్శకతకు ఆస్కారం ఉంటుంది.. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే హక్కు అభ్యర్థులకు లేదన్న బోర్డు వాదనను తోసిపుచ్చారు. మార్కులు ప్రచురించడం ద్వారా మరింత పారదర్శకతకు ఆస్కారం ఉంటుందన్నారు. దీని వల్ల అభ్యర్థులకు కూడా మార్కుల విషయంలో స్పష్టత వస్తుందని తెలిపారు. సమాచార హక్కు చట్టం అమలవుతున్న కాలంలో ప్రతీది పారదర్శకంగా ఉండాల్సిన అవసరముందని వివరించారు. ఓఎంఆర్ షీట్లను కంప్యూటర్ల ద్వారా మూల్యాంకనం చేయిస్తున్నప్పుడు, మార్కులను వెల్లడించడం కష్టసాధ్యమేమీ కాదని అభిప్రాయపడ్డారు. ఈ ఆరు ప్రశ్నలు ఏ రకంగా తప్పో పిటిషనర్లు స్పష్టంగా వివరణ ఇచ్చారని, ఆ వివరణలతో ఏకీభవిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. -
ఎస్ఐ రాత పరీక్షలకు సర్వం సిద్ధం
గుంటూరు: పోలీస్ రిక్రూట్మెంట్ బోర్టు నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం ఎస్ఐ పోస్టులకు నిర్వహిస్తున్న రాత పరీక్షలకు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన మొత్తం 26,846 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పోలీస్‌శాఖలో ఎస్ఐ, జైళ్లు, అగ్నిమాపక శాఖల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 16న గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పరీక్షా కేంద్రాల్లో ఒకేరోజున రెండు పేపర్లలో పరీక్ష జరుగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మొదటి పేపరు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు రెండవ పేపరులో పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 30 ప్రాంతాల్లో 48 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి అవసరమైన ఏర్పాట్లు చేసి పరీక్ష నిర్వహణకు సిద్ధం చేశారు. మొత్తం 10 రూట్లుగా విభజించి ప్రతి రూట్‌కు ఓ డీఎస్పీని ఇన్చార్జిగా కేటాయించారు. స్థానిక పోలీసులకు సూచనలు ఇస్తూ అభ్యర్థుల రాకపోకల సమయంలో ఎలాంటి అసౌకర్యం లేకుండా పర్యవేక్షిస్తారు. అభ్యర్థులు విధిగా ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఐజీ ఇప్పటికే సూచించారు. పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇలా... ఉదయం 9 గంటలకు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకుంటే ముందుగా వారి చేత కొన్ని ధ్రువపత్రాలను పూర్తి చేయిస్తారు. వారి వద్ద బాల్‌పెన్, హాల్‌టిక్కెట్, గుర్తింపు(ఆధార్, రేషన్, ఓటరు కార్డులలో ఏదైనా ఒకటి) కార్డులను తనిఖీ చేస్తారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులను గుర్తించేందుకు మెటల్ డిటెక్టర్ ద్వారా పురుష, మహిళ అభ్యర్థులను విడివిడిగా తనిఖీ చేస్తారు.పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఉండే జిరాక్స్ సెంటర్లను మూపివేయిస్తారు. బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలను స్వీకరించిన అనంతరం లోపలకు అనుమతిస్తారు. ఈ తతంగం పూర్తి కావడానికి అరగంట సమయం పడుతుంది. పరీక్షా కేంద్రంలోకి వెళ్లాక ఓఎంఆర్ షీట్లో వివరాలను తప్పనిసరిగా అభ్యర్ధులు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి పరీక్షా కేంద్రంలోకి వెళ్లాక మళ్లీ సమయం పూర్తయిన తర్వాతనే బయటకు పంపుతారు. అభ్యర్ధుల సౌకర్యం కోసం హాల్ టికెట్లు అందనివారు ఈనెల 14వ తేదీ సాయంత్రం లోపుగా ఠీఠీఠీ. ట pటb. ్చp. జౌఠి. జీn వెబ్సైట్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లంచ్ అవర్‌లో... మధ్యాహ్నం ఒంటిగంటకు పరీక్ష పూర్తయిన అనంతరం బయటకు వచ్చేందుకు అనుమతిస్తారు. పరీక్షా కేంద్రంలో క్యాంటిన్ ఉంటే అక్కడ భోజనం చేసే అవకాశం ఉంటుంది. క్యాంటిన్ లేని పరీక్షా కేంద్రం సమీపంలో ఉంటే బయటకు వచ్చి భోజనం చేయవచ్చు. లేకుంటే అభ్యర్థుల వెంట వచ్చే వారు విధిగా భోజనం తీసుకువచ్చి సిద్ధంగా ఉంచితే సమయం వృథా కాకుండా మధ్యాహ్నం జరిగే పరీక్షకు సిద్ధం కావడానికి సమయం ఉంటుంది. బస్టాండ్, రైల్వే స్టేషన్లో... గుంటూరు జిల్లాకు చెందిన వారే కాకుండా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన అభ్యర్థులు కూడా ఎస్ఐ రాత పరీక్షలకు హాజరుకానున్న నేపథ్యంలో ఆయా జిల్లాల అభ్యర్థులు ఇబ్బంది పడకుండా వారికి కళాశాల అడ్రస్‌లు, అటువైపు వెళ్లే బస్సుల వివరాలు, పరీక్షా కేంద్రానికి చేరుకునే విధానం తెలియచేసేందుకు ప్రత్యేకంగా హెల్ప్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అక్కడ విధుల్లో ఉండే సిబ్బంది సహాయం తీసుకోవచ్చు. ఆయా మార్గాల్లో రోడ్డుపై విధుల్లో ఉండే సిబ్బంది, అధికారుల సలహాలు తీసుకుని గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అదే రోజున హడావుడిగా రిస్క్ తీసుకునేకంటే ముందు రోజే కేటాయించిన పరీక్షా కేంద్రం ఎక్కడ ఉందీ, అక్కడకు చేరుకునే విధానం, తదితర విషయాలను తెలుసుకుంటే ఉదయాన్నే సునాయాసంగా వెళ్లవచ్చని ఐజీ కేవీవీ గోపాలరావు సూచిస్తున్నారు. విలువైన వస్తువులు లేకుండా... పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వారి వెంట మరో వ్యక్తిని వెంట తీసుకురావడం మంచిది. లేకుంటే విలువైన వస్తువులను ఇంటివద్దనే పెట్టి రావాలి. క్యాలిక్యులేటర్, డిజిటల్ వాచ్, నోటు పుస్తకాలు, బ్యాగులు లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలకు అనుమతించరు. -
పరిశోధనలే ప్రామాణికం!
వర్సిటీలు, డిగ్రీ అధ్యాపకుల నియామక, పదోన్నతుల విధానాల్లో మార్పులు సవరణ మార్గదర్శకాలు జారీ చేసిన యూజీసీ స్ర్కీనింగ్ టెస్టులో పరిశోధనలు, పరిశోధన వ్యాసాలకు ప్రాధాన్యం కో-కరిక్యులర్ యాక్టివిటీస్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి అధ్యాపకుల నియామకాల్లో అభ్యర్థుల పరిశోధనా సామర్థ్యమే ప్రామాణికం కానుంది. వారి విజ్ఞానానికి, బోధనా సామర్థ్యానికి తోడు సహ పాఠ్య కార్యక్రమాలు కూడా నియామకాల్లో కీలకం కానున్నాయి. అభ్యర్థుల అకడమిక్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (ఏపీఐ)కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ మేరకు డిగ్రీ కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నియామకానికి అనుసరించే విధానాల్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పలు మార్పులు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. వివిధ వర్సిటీలు, డి గ్రీ కాలేజీల్లో అధ్యాపకుల నియామకాల్లో నిబంధనలను తుంగలో తొక్కుతున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో సరైన సామర్థ్యం లేనివారు అధ్యాపకులుగా నియమితులవుతున్నారని.. విద్యార్థులకు ప్రమాణాల మేరకు బోధన జరగడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూజీసీ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం అధ్యాపకుల నియామకానికి సంబంధించి స్క్రీనింగ్ టెస్టులో పరిశోధనలు, పరిశోధన పేపర్లు, ప్రాజెక్టులు, శిక్షణ, కో-కరిక్యులర్ యాక్టివిటీస్‌ను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇకపై అధ్యాపకుల నియామకంలో అన్ని రాష్ట్రాల్లోని వర్సిటీలు, నియామక సంస్థలు వీటిని తప్పనిసరిగా పాటించాల్సిందేనని యూజీసీ ఆదేశించింది. నియామకాల్లోనే కాదు పదోన్నతుల్లోనూ ఈ నిబంధనలను పాటించాలంటూ యూజీసీ జాయింట్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు. పరిగణనలోకి తీసుకునే అంశాలు.. అధ్యాపకుల నియామకాల్లో రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూలను కూడా నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూలో అకడమిక్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలని యూజీసీ స్పష్టం చేసింది. ఇందులో ముఖ్యంగా పరిశోధన పత్రాలకు (జర్నల్స్ తదితరాలు) 30 శాతం, పరిశోధనల ప్రచురణకు (పుస్తకాలు తదితరాలు) 25 శాతం, పరిశోధన ప్రాజెక్టులకు 20 శాతం, రీసెర్చ్ గెడైన్స్‌కు 10 శాతం, శిక్షణ కోర్సులు, సదస్సులు/సమావేశాలకు 15 శాతం స్కోర్ నిర్ధారించాలని పేర్కొంది. అభ్యర్థుల విజ్ఞానం, పరీక్షలు, మూల్యాంకనంలో భాగస్వామ్యం, బోధనా సామర్థ్యం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వంటి సహ పాఠ్య కార్యక్రమాలకు 50 శాతం స్కోర్ నిర్ధారించాలని... ఇందులో కనీసం 15 శాతం స్కోర్ సాధించాలని స్పష్టం చేసింది. పదోన్నతుల్లోనూ.. అధ్యాపకుల పదోన్నతుల్లోనూ ఇదే విధానాన్ని పాటించాలని యూజీసీ పేర్కొంది. పదోన్నతులకు సంబంధించి... లెక్చర్లు తదితరాలకు 50 పాయింట్లు, ఇతర బోధన పనులకు 10 పాయింట్లు, సిలబస్‌కు సంబంధించి వినూత్న కార్యక్రమాలు, జ్ఞానానికి 20 పాయింట్లు, బోధన, నేర్చుకునే విధానాలకు 20 పాయింట్లు, పరీక్ష విధులు, మూల్యాంకన విధుల్లో పనితీరుకు 25 పాయింట్లు.. మొత్తంగా 125 పాయింట్లు ఉంటాయి. అభ్యర్థులు కనీసం 75 శాతం స్కోర్ సాధించాల్సి ఉంటుంది.