పరిశోధనలే ప్రామాణికం! | Research is the mandatory to Candidates | Sakshi
Sakshi News home page

పరిశోధనలే ప్రామాణికం!

Published Sat, Sep 6 2014 3:54 AM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM

Research is the mandatory to Candidates

వర్సిటీలు, డిగ్రీ అధ్యాపకుల నియామక, పదోన్నతుల విధానాల్లో మార్పులు
సవరణ మార్గదర్శకాలు జారీ చేసిన యూజీసీ
స్ర్కీనింగ్ టెస్టులో పరిశోధనలు, పరిశోధన వ్యాసాలకు ప్రాధాన్యం
కో-కరిక్యులర్ యాక్టివిటీస్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశం

 
 సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి అధ్యాపకుల నియామకాల్లో అభ్యర్థుల పరిశోధనా సామర్థ్యమే ప్రామాణికం కానుంది. వారి విజ్ఞానానికి, బోధనా సామర్థ్యానికి తోడు సహ పాఠ్య కార్యక్రమాలు కూడా నియామకాల్లో కీలకం కానున్నాయి. అభ్యర్థుల అకడమిక్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (ఏపీఐ)కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ మేరకు డిగ్రీ కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నియామకానికి అనుసరించే విధానాల్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పలు మార్పులు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది.
 
 వివిధ వర్సిటీలు, డి గ్రీ కాలేజీల్లో అధ్యాపకుల నియామకాల్లో నిబంధనలను తుంగలో తొక్కుతున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో సరైన సామర్థ్యం లేనివారు అధ్యాపకులుగా నియమితులవుతున్నారని.. విద్యార్థులకు ప్రమాణాల మేరకు బోధన జరగడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూజీసీ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం అధ్యాపకుల నియామకానికి సంబంధించి స్క్రీనింగ్ టెస్టులో పరిశోధనలు, పరిశోధన పేపర్లు, ప్రాజెక్టులు, శిక్షణ, కో-కరిక్యులర్ యాక్టివిటీస్‌ను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇకపై అధ్యాపకుల నియామకంలో అన్ని రాష్ట్రాల్లోని వర్సిటీలు, నియామక సంస్థలు వీటిని తప్పనిసరిగా పాటించాల్సిందేనని యూజీసీ ఆదేశించింది. నియామకాల్లోనే కాదు పదోన్నతుల్లోనూ ఈ నిబంధనలను పాటించాలంటూ యూజీసీ జాయింట్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు.
 
 పరిగణనలోకి తీసుకునే అంశాలు..
 అధ్యాపకుల నియామకాల్లో రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూలను కూడా నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూలో అకడమిక్ పెర్‌ఫార్మెన్స్ ఇండికేటర్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలని యూజీసీ స్పష్టం చేసింది. ఇందులో ముఖ్యంగా పరిశోధన పత్రాలకు (జర్నల్స్ తదితరాలు) 30 శాతం, పరిశోధనల ప్రచురణకు (పుస్తకాలు తదితరాలు) 25 శాతం, పరిశోధన ప్రాజెక్టులకు 20 శాతం, రీసెర్చ్ గెడైన్స్‌కు 10 శాతం, శిక్షణ కోర్సులు, సదస్సులు/సమావేశాలకు 15 శాతం స్కోర్ నిర్ధారించాలని పేర్కొంది. అభ్యర్థుల విజ్ఞానం, పరీక్షలు, మూల్యాంకనంలో భాగస్వామ్యం, బోధనా సామర్థ్యం, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వంటి సహ పాఠ్య కార్యక్రమాలకు 50 శాతం స్కోర్ నిర్ధారించాలని... ఇందులో కనీసం 15 శాతం స్కోర్ సాధించాలని స్పష్టం చేసింది.
 
 పదోన్నతుల్లోనూ..
 అధ్యాపకుల పదోన్నతుల్లోనూ ఇదే విధానాన్ని పాటించాలని యూజీసీ పేర్కొంది. పదోన్నతులకు సంబంధించి... లెక్చర్లు తదితరాలకు 50 పాయింట్లు, ఇతర బోధన పనులకు 10 పాయింట్లు, సిలబస్‌కు సంబంధించి వినూత్న కార్యక్రమాలు, జ్ఞానానికి 20 పాయింట్లు, బోధన, నేర్చుకునే విధానాలకు 20 పాయింట్లు, పరీక్ష విధులు, మూల్యాంకన విధుల్లో పనితీరుకు 25 పాయింట్లు.. మొత్తంగా 125 పాయింట్లు ఉంటాయి. అభ్యర్థులు కనీసం 75 శాతం స్కోర్ సాధించాల్సి ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement