ఎలక్షన్ స్టంట్.....
ఎలక్షన్ స్టంట్.....
సాక్షి ప్రతినిధి, గుంటూరు
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ నేతలు ప్రజల్ని మభ్యపెట్టే యత్నాలు చేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకపోయినా, టెండర్లు ఖరారుకాకపోయినా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. మీ కోసమే ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రచార మాధ్యమాల ద్వారా విస్త్రత ప్రచారం చేసుకుంటున్నారు.
గత నెలలో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు సంపత్‌నగర్‌లోని పార్కు స్థలంలో షాదీఖానా నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపనకు సిద్దమయ్యారు. ఒక సామాజికవర్గం ఓట్లు పొందేందుకు ఈ ప్రయత్నం. పార్కు స్థలాన్ని షాదీఖానా నిర్మాణానికి ఉపయోగించరాదని మంత్రి వర్యులకు జిల్లా అధికారులు చెప్పలేక శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారు.‘ సాక్షి’ దినపత్రిక దీనిని వెలుగులోకి తీసుకువచ్చిన తరువాత జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ శంకుస్థాపనను వాయిదా వేయించారు. ఈ విషయాన్ని ప్రజలు మరిచిపోకముందే చిలకలూరిపేటలో మరో ఎన్నికల స్టంట్‌కు అక్కడి టీడీపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తెరతీస్తే, అధికారులు మద్దతు పలికారు. సుప్రీంకోర్టు ఉత్తుర్వుల మేరకు వాగు పోరంబోకులు, చెరువుల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు. ఈ నిబంధన తెలిసినప్పటికీ అధికారులు చిలకలూరిపేటలోని వాగుపోరంబోకులో ఆటోనగర్ నిర్మాణానికి ఫైళ్లను చకచకా నడిపిస్తున్నారు. ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు రాకపోయినా ప్రజాప్రతినిధులు మరో అడుగు ముందుకు వేసి ఈ నెల 19న శంకుస్థాపన జరగనున్నట్లు, మంత్రి కాసు కృష్ణారెడ్డి దీనికి హాజరుకానున్నట్లు ప్రకటించారు.
ఎన్ని‘కల’వేళ గుర్తుకు వచ్చిన ఆటోనగర్
ఐదేళ్ల క్రితం అప్పటి టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు తాను అధికారంలోకి వస్తే ఆటోనగర్ ఏర్పాటు చేస్తామని హామీఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఈ ఐదేళ్ల కాలంలో పుల్లారావు ఆటోనగర్ ఏర్పాటుకు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. మరో పదిహేను రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఆయనకు ఆటోనగర్ గుర్తుకు వచ్చింది. అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఆగమేఘాలపై ప్రతిపాదనలు తయారుచేయించారు.