ఖర్చు బారెడు.. లెక్కమూరెడు!
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఏప్రిల్ 12వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. టీడీపీ అధినేత ఇప్పటికే చాలా చోట్ల పార్టీ అభ్యర్థులను ఖరారు చేశారు. దీంతో ఆ పార్టీ నేతలు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు రూ.28 లక్షలకు మించి ఖర్చు చేయరాదు. అయితే ఈ లెక్కను వీరు ఎప్పుడో దాటిపోయినట్లు తెలుస్తోంది. డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తున్న వీరు ఎన్నికల సంఘానికి లెక్క చూపిస్తారా అనే అనుమానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వీరు చూపిన లెక్కలు చూస్తే కాదనే జవాబు వస్తుంది. ప్రస్తుతం తెలుగుదేశం అభ్యర్థులుగా ఉన్నవారిలో కొందరు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. వారితో పాటు 2009లో తెలుగుదేశం అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన వారు ఆ ఎన్నికల్లో ఒక్కొక్కరు కనీసం రూ.10 నుంచి రూ.20 కోట్ల వరకు ఖర్చు చేశారు.
అయితే వారు ఎన్నికల సంఘానికి చూపిన ఖర్చు రూ.10 లక్షలలోపే. బనగానపల్లె నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చల్లా రామక్రిష్ణారెడ్డి రూ.6.98 లక్షలు ఖర్చు చేసినట్లు లెక్క చూపారు. 2009లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన టీజీ వెంకటేష్(ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి) కేవలం రూ.4.86 లక్షలు మాత్రమే ఖర్చు చూపారు. ఆలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నీరజారెడ్డి రూ.5.05 లక్షలు ఖర్చు చూపారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు చూపిన ఖర్చు, వాహనాల డ్రైవర్ల బత్తాకు కూడా సరిపోదు. 2009 ఎన్నికల్లో ఈ నేతలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. మద్యం పారింపజేశారు. వివిధ రూపాల్లో ప్రలోభపెట్టారు. నాయకులకు గుడ్‌విల్ ఇచ్చుకున్నారు.
హోల్‌సేల్‌గా ఓటర్లను కొనుగోలు చేశారు. ఇంత భారీగా ఖర్చు చేసినా అప్పటి ఎన్నికల వ్యయ పరిశీలకులు వారు చూపిన ఖర్చులను ఆమోదం తెలిపారు. గెలుపొందేందుకు కొండంత ఖర్చు చేసి చూపిన ఖర్చు మాత్రం నామమాత్రంగా ఖర్చు చూపించారు. ఈసారి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం నామమాత్రంగా ఉంది. విభజన పాపంతో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఛీ కొట్టారు. ప్రధానంగా అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్సార్సీపీ-తెలుగుదేశం పార్టీల మధ్యనే ఉంది. రోజు రోజుకు వైఎస్సార్సీపీకి ఆదరణ పెరుగుతుండటంతో తెలుగుదేశం అభ్యర్థులు మరింత అడ్డుగోలుగా నిధులు ఖర్చు చేస్తున్నారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి అయినా సరే గెలవాలనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు తూట్లు పొడుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు తీవ్ర సమస్యాత్మకమైనవి ఎన్నికల సంఘం గుర్తించింది. ఎన్నికల వ్యయాన్ని అదుపు చేసేందుకు ఈసారి ఎన్నికల్లో నిఘాను తీవ్రం చేసింది. నిబంధనలు కట్టుదిట్టం చేసింది. ఈసీ మార్గదర్శకాలు టీడీపీ నేతల అడ్డుగోలు ఖర్చును ఆపుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.