చేతులెత్తేశారు..!
కుదిరిన బేరం.. టీడీపీలో హైడ్రామా
తమ్ముళ్ల నమ్మకాన్ని వమ్ముచేశారు
ఎమ్మెల్సీ పదవి కోసం ఆర్‌పీఎస్ అభ్యర్థి విత్‌డ్రా
ఉవ్వెత్తున ఎగిసిపడి బాబుకు లొంగిన కేఈ ప్రభాకర్
కర్నూలు పార్లమెంట్ బరి నుంచి తప్పుకున్న వైనం
సాక్షిప్రతినిధి, కర్నూలు: ‘నాకు టికెట్ ఇవ్వని టీడీపీలో ఉండలేను. ఎన్నికల్లో టీడీపీని మట్టికరిపిస్తాను. రెబల్‌గా బరిలో దిగుతాను. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తాను’ అంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ టీడీపీ అధినేత చంద్రబాబుపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అదేవిధంగా నందికొట్కూరు టీడీపీ నాయకుడు విక్టర్ కూడా అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ ఇద్దరు తీసుకున్న నిర్ణయంపై జిల్లా టీడీపీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్యాకేజీల కోసం కాంగ్రెస్ నేతలతో టీడీపీని నింపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆ ఇద్దరు తీసుకున్న నిర్ణయం సరైందనేని మద్దతు తెలియజేశారు.
చివరకు ఆ ఇద్దరు తుస్సుమనిపించారు. కర్నూలు పార్లమెంట్ కోసం కేఈ ప్రభాకర్, నందికొట్కూరు అసెంబ్లీ టికెట్‌ను విక్టర్ ఆశించిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరినీ కాదని కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన లబ్బి వెంకటస్వామికి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన విక్టర్ టీడీపీ తీరుపై ఎర్రజెండా ఎగురవేశారు. కేఈ ప్రభాకర్ అయితే అధినేత చంద్రబాబు, సోదరుడు కేఈ కృష్ణమూర్తిపైనా మండిపడ్డారు.
టీడీపీ నాయకులు.. బంధువులు కొందరు రకరకాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారు. కేఈ ప్రభాకర్ తీసుకున్న నిర్ణయానికి కొందరు సన్నిహితులు సైతం పూర్తి మద్దతు పలికారు. దీంతో కేఈ ప్రభాకర్ స్వతంత్ర అభ్యర్థిగా.. ఎస్పీ అభ్యర్థిగా వేరువేరుగా కర్నూలు పార్లమెంట్ నుంచి నామినేషన్‌లు దాఖలు చేశారు.
ఇదే సమయంలో నందికొట్కూరు అసెంబ్లీ అభ్యర్థిగా విక్టర్ నామినేషన్ వేశారు. ఈ ఇద్దరు నిర్ణయంపై జిల్లాలో టీడీపీ నేతలంతా హడలిపోయారు. చివరకు ఆ ఇద్దరూ చేతులెత్తేశారు. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు వీరు నామినేషన్లు ఉప సంహరించుకోవటంతో మద్దతిచ్చిన వారంతా గుర్రుమంటున్నారు.
ఎమ్మెల్సీ పదవి ఎవరికి?
కేఈ ప్రభాకర్, విక్టర్ తిరుగుబావుటా ఎగురవేయడంతో టీడీపీ నేతలు కొందరు అధినేత చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టారు. హైదరాబాద్‌లో మంగళవారం రాత్రంతా జరిగిన చర్చల్లో కేఈ ప్రభాకర్, విక్టర్‌ను ఒప్పించినట్లు సమాచారం.
ఆ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఇద్దరిలో ఎవరికి ఇస్తారనేది స్పష్టత లేదు. అదేవిధంగా నందికొట్కూరులో బెరైడ్డి రాయలసీమ పరిరక్షణ సమితి(ఆర్‌పీఎస్) అభ్యర్థిగా డాక్టర్ శేషన్న నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.
ఈయన కూడా బుధవారం నామినేషన్ ఉపసంహరించుకున్నారు. శేషన్న ఉపసంహరించుకోవడానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అధినేత చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం.