చంద్రబాబుతో భేటీ.. తమ సామాజికవర్గానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలోని కాపు సామాజికవర్గ నేతలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వకపోవటంపట్ల రాష్ట్ర కాపునాడు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. పార్టీ తీరు ఇలానే ఉంటే తమ మద్దతుపై పునరాలోచించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాపునాడు రాష్ర్ట అధ్యక్షుడు నారాయణ స్వామి రాయలు నేతృత్వంలో పలువురు నేతలు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో మంగళవారం భేటీ అయ్యారు. కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కాకుండా తక్కువ ఓటర్లు ఉన్న స్థానాల్లో టికెట్లిచ్చారని, ఏదో నామమాత్రంగా సీట్లిచ్చామంటే సరిపోదని, అది పద్ధతి కూడా కాదని అభ్యంతరం వ్యక్తంచేశారు. గతంలో గుంటూరు జిల్లాలో రెండు ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కాపులకు కేటాయిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు తమ సామాజికవర్గ ఓటర్లు తక్కువగా ఉన్న బాపట్లను ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.
తాము టికెట్లు కోరితే.. బాపట్ల ఇచ్చాం కదా అని చెప్పటం సరికాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబితాలో ఐదు లోక్‌సభ స్థానాల్లో, 30 వరకూ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాపు సామాజికవర్గానికి చెందిన వారున్నారని తెలిపారు. టీడీపీలో తమకు ఏమాత్రం ప్రాధాన్యత లభించడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాపులను బీసీ జాబితాలో చేర్చే విషయంలోనూ స్పష్టమైన హామీ ఇవ్వలేదని, ఎన్నికల ప్రణాళికలో కూడా స్పష్టత లోపించిందని చెప్పారు. తమకు తగిన ప్రాధాన్యతనివ్వాలని కోరారు. గుంటూరు తూర్పు, కృష్ణా జిల్లా కైకలూరు టికెట్లను ఎంతో కాలం నుంచి పార్టీ కోసం పని చేస్తున్న దాసరి రాజా మాస్టారు, చలమలశెట్టి రామానుజయకు ఇవ్వాలని కోరారు.
టీడీపీపై కాపునాడు నేతల అసంతృప్తి
Published Wed, Apr 16 2014 2:05 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement