KE prabhakar
-
చంద్రబాబుపై కేఈ ధిక్కార స్వరం
డోన్: తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ధిక్కార స్వరం వినిపించారు. డోన్ టీడీపీ అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థిని ప్రభాకర్ తిరస్కరించారు. డోన్ నియోజకవర్గంలో కేఈ కుటుంబం కచ్చితంగా పోటీ చేస్తుందని బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు టీడీపీలో దుమారం రేపుతున్నాయి. డోన్ టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని చంద్రబాబు గతంలోనే ప్రకటించారు. ఈ నిర్ణయంపై కేఈ ప్రభాకర్ అసంతృప్తితో ఉన్నారు. తన జన్మదిన వేడుక సందర్భంగా బుధవారం డోన్‌లో ఓ ఫంక్షన్ హాలులో సభ నిర్వహించి, తన నిర్ణయాన్ని ప్రకటించారు. ‘40 ఏళ్లుగా కేఈ కుటుంబానికి డోన్ కంచుకోట. నేను జెడ్పీటీసీ నుంచి అంచెలంచెలుగా జనామోదంతో రాష్ట్ర మంత్రి వరకు ఎదిగాను. ఇప్పుడు ఎలాంటి అనుభవం, జనామోదం లేని వ్యక్తికి నియోజకవర్గ ఇన్చార్జి ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు’ అని చెప్పారు. తమకు జన బలం, ధన బలం కూడా ఉందనే సంగతి ఎవ్వరూ మర్చిపోవద్దని అన్నారు. ఒంట్లో శక్తి కూడా తగ్గలేదని అన్నారు. కచ్చితంగా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తామని, ఈ విషయంలో కార్యకర్తలు సందేహించాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. టిక్కెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతామని నేరుగా చంద్రబాబుకే స్పష్టం చేసినట్లు కేఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇదిలా ఉండగా కేఈ జన్మదిన వేడుకకు హాజరుకాకుండా ఉండేందుకు సుబ్బారెడ్డి బుధవారమే నంద్యాలలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. -
టీడీపీలో కల్లోలం రేపిన కేఈ రాజీనామా
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్.. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి రాజీనామా లేఖను ఫ్యాక్స్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కేఈ ప్రభాకర్ రాజీనామా టీడీపీలో కల్లోలం రేపింది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లుతోందని, ప్రజాదరణ చూరగొంటోన్న ప్రభుత్వానికి సహకరించకుండా, అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకునేలా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని.. రాజీనామా చేసిన నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కేఈ రాజీనామాతో కర్నూలు టీడీపీ కేడర్ ఆలోచనలో పడింది. టీడీపీకి బలమైన నేతలు కేఈ సోదరులు.. జిల్లాలో టీడీపీ అత్యంత బలహీనమైన పార్టీ. గత 20 ఏళ్లలో ఆ పార్టీ అత్యధికంగా గెలిచిన అసెంబ్లీ స్థానాలు నాలుగు మాత్రమే. ఈ దఫా ఎన్నికల్లో కనీసం ఒక్కస్థానం కూడా గెలవలేదు. అయితే టీడీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో ఆ పార్టీకి కేఈ సోదరులు, భూమా నాగిరెడ్డి అండగా ఉండేవారు. భూమా నాగిరెడ్డి టీడీపీని వీడి ప్రజారాజ్యంలో చేరిన తర్వాత కేఈ సోదరులు పెద్ద దిక్కయ్యారు. అయితే అధికారంలో ఉన్న ఐదేళ్లూ వీరిని చంద్రబాబు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. టీడీపీ పాలనలో ఐదేళ్లు రెవెన్యూ మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా కేఈ కృష్ణమూర్తి కొనసాగినా...కనీసం ఒక్క ఆర్డీవోను కూడా బదిలీ చేసుకోలేని పరిస్థితి చంద్రబాబు కల్పించారు. కీలకమైన రెవెన్యూశాఖ ఉన్నప్పటికీ కేఈ ప్రభావం లేకుండా తనను ఒక అసమర్థ మంత్రిగా చంద్రబాబు చేశారని, అప్పట్లో టీడీపీ జిల్లా ఇన్‌చార్జ్‌లు చర్చించుకునేవారు. అయితే టీడీపీ అధికారంలో ఉండటంతో ఇష్టం లేకపోయినా అనివార్య పరిస్థితుల్లో అందులో కొనసాగారు. టీడీపీ ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో కేఈ ప్రభాకర్ రాజీనామా వ్యవహారం కొత్త చర్చలకు దారి తీసింది. కేఈ కృష్ణమూర్తికి తెలీకుండా ప్రభాకర్ రాజీనామా చేసే అవకాశమే లేదని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. కేఈ కృష్ణమూర్తి సలహాతోనే ప్రభాకర్ రాజీనామా చేశారని తెలుస్తోంది. త్వరలోనే కేఈ కృష్ణమూర్తి, శ్యాంబాబు కూడా టీడీపీకి రాజీనామా చేసే అవకాశం ఉందని కేఈ ప్రభాకర్ సన్నిహితులు ‘సాక్షి’కి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కేఈ రాజీనామా ప్రభావం: స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన వైఎస్సార్సీపీని ఎదుర్కోలేక టీడీపీ ఆపసోపాలు పడుతోంది. చాలాచోట్ల ఇన్‌చార్జ్‌ల మద్దతు లేక ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నారు. ఈక్రమంలో కేఈ ప్రభాకర్ రాజీనామా చేశారు. ఆయన సోదరుడు కేఈ కృష్ణమూర్తి డోన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డోన్ మునిసిపాలిటీలో టీడీపీ పోటీ నుంచి తప్పుకుంటోందని వెల్లడించారు. ఈ రెండు పరిణామాలు టీడీపీలో కల్లోలం రేపాయి. కేఈ బ్రదర్స్‌లో ఒకరు ఎన్నికల బాధ్యత నుంచి తప్పుకుంటే మరొకరు ఏకంగా పార్టీకే రాజీనామా చేశారని, వారే చేతులెత్తేస్తే ఇక తమ పరిస్థితి ఏంటని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు డోలాయమానంలో పడ్డారు. దీంతో పాటు ఎన్నేళ్లున్నా ఎమ్మెల్యేగా గెలవలేని టీడీపీలో కొనసాగడం కంటే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోడమే మంచిదని గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఓ ఎమ్మెల్యే అభ్యర్థి ‘సాక్షి’తో తెలిపారు. ఈ పరిణామాలు చూస్తుంటే కేఈ ప్రభాకర్ రాజీనామా వ్యవహారంపై టీడీపీపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. త్వరలోనే మరికొంతమంది నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు టీడీపీని వీడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు వైఖరి నచ్చక రాజీనామా.. రాజీనామా అంశంపై కేఈ ప్రభాకర్ ‘సాక్షి’తో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఒంటెత్తు పోకడలతోనే తాను రాజీనామా చేసినట్లు వెల్లడించారు. టీడీపీ సరైన దారిలో నడవలేదన్నారు. టీడీపీ రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై పార్టీకి ద్రోహం చేసి టీజీ వెంకటేష్ బీజేపీలో చేరారని, అలాంటి వ్యక్తి కనుసన్నల్లో ఇప్పటికీ టీడీపీ నడుస్తోందన్నారు. కార్పొరేటర్ టిక్కెట్ల నుంచి జిల్లాలోని చాలా నియోజవకర్గాల్లో టీడీపీలో టీజీ మాట చెల్లబాటవుతోందన్నారు. అలాగే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారని, కానీ నంద్యాల పార్లమెంట్లో కూడా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయాలు అధిష్టానికి తెలిపినా నిర్లక్ష్యం చేసి, వారికే సహకరిస్తున్నారన్నారు. వీటితో పాటు చాలా కారణాలు ఉన్నాయని, అందుకే టీడీపీని వీడుతున్నాని తెలిపారు. త్వరలోనే కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానని తెలిపారు. -
కర్నూలులో టీడీపీకి షాక్..
-
కర్నూలులో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ..!
సాక్షి, కర్నూలు: జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు, టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీడీపీకి మనుగడ లేదని విమర్శించారు. ఓ బీజేపీ నాయకుడి మాటలను టీడీపీ జిల్లా అధ్యక్షుడు వింటున్నారని... కనీసం తాను అడిగిన కార్పొరేటర్ టికెట్లు ఇవ్వలేని దుస్థితిలో పార్టీ ఉందని మండిపడ్డారు. త్వరలోనే తాను ఏ పార్టీలో చేరబోయేది ప్రకటిస్తానని కేఈ ప్రభాకర్ పేర్కొన్నారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ పార్టీ వీడిన సంగతి తెలిసిందే. (కడపలో టీడీపీకి మరో బిగ్‌షాక్) ఇక కర్నూలుతో పాటు అనంతపురం జిల్లాలోనూ టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె, మాజీ ఎమ్మెల్యే యామిని బాల టీడీపీని వీడే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గత కొద్ది కాలంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఖరి పట్ల వారు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు దళితులను పక్కన పెడుతున్నారనే మనస్తాపంతో పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరగుతోంది.(టీడీపీకి షాక్: వైఎస్సార్సీపీలోకి కరణం వెంకటేశ్) టీడీపీకి మరో షాక్.. పార్టీ వీడిన మాజీ ఎమ్మెల్యే -
కర్నూల్లో కాల‘కేఈ’సోదరులు..
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : పత్తికొండ నియోజకవర్గంలో ఐదేళ్లు అరాచకం రాజ్యమేలింది. అక్రమాలు గద్దెనెక్కి తాండవం చేశాయి. అవినీతికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. రోడ్డు నిర్మాణాలు.. నీరు–చెట్టు పనులు.. ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు..పని ఏదైనా కేఈ సోదరులకు పర్సంటేజీ ఇవ్వాల్సిందే. లేదని ఎదురు తిరిగితే విధ్వంసం మెరుస్తుంది..బెదిరింపు ఉరుముతుంది. కబ్జాలు..సెటిల్మెంట్లు..ఒకటేమిటి అన్నీ వారి ఆధీనంలోనే..చివరకు కూలీల రెక్కల కష్టాన్నీ వదల్లేదు..గాలిమరల ఏర్పాటులో చేతివాటం..ప్రైవేట్ సబ్స్టేషన్ల నిర్మాణాల్లో బలవంతపు వసూళ్లు .. మొక్కల పెంపకంలో అక్రమాలు..ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో..ఎన్నెన్నో.. కాల‘కేఈ’ల అరాచకాలు.. వాటిల్లో కొన్ని... అవినీతికి చిహ్నం.. కృష్ణగిరి మండలం ఎస్‌హెచ్ ఎర్రగుడి నుంచి మన్నెకుంట వరకు గత ఏడాది సబ్‌ప్లాన్ కింద 3.2 కి.మీ రహదారిని రూ.1.45కోట్లతో వేశారు. ఇది ఆరు నెలలకే దెబ్బతినడంతో మళ్లీ ప్యాచ్‌లు వేశారు. కృష్ణగిరి మండలంలో కేఈ కృష్ణమూర్తి సోదరుడు, మాజీ జెడ్పీటీసీ కేఈ జయన్నదే పెత్తనం. ఏ పనిలోనైనా కమీషన్లు తీసుకోవడం రివాజుగా మారింది. ఐదేళ్ల నుంచి ఒక్క కృష్ణగిరి మండలంలోనే రూ.7కోట్ల వరకు అవినీతి జరిగినట్లు సమాచారం. దత్తత గ్రామంలో అక్రమాలు ఇది డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి దత్తత గ్రామమైన ఎరుకలచెర్వులోని సీసీ రోడ్డు దుస్థితి. అక్రమాలకు పాల్పడి నాసిరకంగా నిర్మించారనేదానికి ఇంతకన్నా నిదర్శనం లేదు. నడవడానికి వీలులేకుండా తయారైన రోడ్లను చూసి.. గ్రామాన్ని దత్తత తీసుకుంది అభివృద్ధికా? అవినీతికా? అని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. భారీగా కమీషన్లు! పత్తికొండ మండలం చిన్నహుల్తి వద్ద రూ.2కోట్లతో నిర్మించిన బ్రిడ్జి ఇది. దీని నిర్మాణంలో కేఈ శ్యాంబాబుకు భారీగా కమీషన్లు అందాయని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా నలకదొడ్డి గ్రామం వద్ద ప్రధాన మంత్రి గ్రామ సడక్ నిధులు రూ.7కోట్లతో కాజ్వే నిర్మించారు. దీనిలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. నాలుగేళ్లలో పత్తికొండ ఆర్అండ్బీ పరిధిలో రూ.49 కోట్లతో 89 కిలోమీటర్ల పొడవున బీటీ రోడ్ల పనులు జరిగాయి. ఈ పనుల్లో టీడీపీ నేతలకు కమీషన్లు అందాయి. పత్తికొండ మండలంలో రూ.6 కోట్లతో 515 పనులు జరిగాయి. వీటిలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా చేసిన పనుల్లో 10 శాతానికి పైగా కమీషన్ కేఈ శ్యాంబాబు ఆదేశాలతో నేరుగా టీడీపీ కార్యాలయానికి అందింది. పక్కా ఇళ్ల నిర్మాణం, చంద్రన్న బీమా మంజూరులోనూ కమీషన్ల పర్వం కొనసాగింది. ‘పక్కా’మోసం వెల్దుర్తిలో నక్కలతిప్పపై మూడేళ్ల నుంచి మొండిగోడలకే పరిమితమైన ఎన్టీఆర్ గృహాలు ఇవీ. వెల్దుర్తికి 106 గృహాలు మంజూరు కాగా.. లబ్ధిదారులకు తానే నిర్మించి ఇస్తానని వెల్దుర్తి టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ ఎల్ఈ జ్ఞానేశ్వర్ గౌడ్ ఒక్కొక్కరినుంచి రూ.50 వేలు వసూలు చేశాడు. ఊరికి దూరంగా నక్కల తిప్పపై రెండెకరాల స్థలంలో ఇళ్లు కడతామని ఊరించాడు. మొండిగోడలు తప్ప అక్కడ ఇంకేమీ లేవు. కూలీల కష్టాన్నీ దోచుకున్నారు.. సోలార్‌ప్లాంట్ అనుమతుల విషయంలో అధికార పార్టీ నేత రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నదాన్ని తక్కువ విస్తీర్ణంలో ఏర్పాటయ్యేలా అనుమతులు తీసుకున్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటులో పట్టా భూములతో పాటు ప్రభుత్వ పోరంబోకు భూములు కూడా వినియోగించారు. ప్లాంట్ నిర్మాణ సమయంలో కంకర, ఇసుకతో పాటు పనిచేసే రోజు వారీ కూలీల డబ్బుల్లో కూడా కమీషన్లు కత్తిరించారు. అనుచరులు సైతం... పత్తికొండ మండలంలో రూ.60 లక్షలతో నీరు–చెట్టు పనులు చేశారు. అలాగే పత్తికొండ–ఆదోని రోడ్డులోని హంద్రీ–నీవా కాలువ నుంచి ఊరి చెరువుకు నీరు నింపేందుకు రూ.50లక్షలతో పైప్‌లైన్ నిర్మించారు. అధికార పార్టీ జెడ్పీటీసీ సభ్యురాలు ఈడిగ సుకన్యకు మామ అయిన ఇ.నాగయ్యగౌడు, అతని కుమారుడు రామ్మూర్తి గౌడు ఈ పనులు దక్కించుకొని భారీ అక్రమాలకు పాల్పడ్డారు. చక్రాళ్ల గ్రామ శివారులోని ఫారెస్టులో మొక్కల పెంపకం పేరుతో అధికార పార్టీ కార్యాలయ ఇన్చార్జ్ సుమారు రూ.30 లక్షల వరకు బొక్కేశారని ఆరోపణలు బలంగా ఉన్నాయి. కేఈ శ్యాంబాబు అండతో పత్తికొండ–ఆదోని రోడ్డులో సుమారు 72 సెంట్ల కడగమ్ము వంక పోరంబోకు స్థలాన్ని టీడీపీ నాయకులు ఆక్రమించారు. దర్జాగా బేరం పెట్టి అమ్ముకున్నారు. గాలిమరల ఏర్పాటులోనూ.. పత్తికొండ మండలంలోని దేవనబండ, హోసూరు, పెద్దహుల్తి, పుచ్చకాయలమాడ, పందికోన గ్రామాల్లో గాలిమరలు, ప్రైవేట్ సబ్స్టేషన్ల ఏర్పాటు చేశారు. ఈ పనుల్లో కాంట్రాక్టర్ల నుంచి కేఈ శ్యాంబాబు, సాంబ, శ్రీధర్‌రెడ్డి కోట్లాది రూపాయల కమీషన్లు రాబట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మన్ను తిన్న పాములు.. వెల్దుర్తి ఎర్ర చెరువు వద్ద టిప్పర్లులో పూడికమన్ను నింపుతున్న దృశ్యమిది. ఎర్రచెరువు మట్టిని ఇటుకల బట్టీలకు తరలించి టీడీపీ నాయకులు భారీగా సొమ్ము చేసుకున్నారు. మాట వినని అధికారులపై అధికార పార్టీ నాయకులు చేయిచేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. వెల్దుర్తి మేజర్ పంచాయతీ ఈఓగా ఉన్న ఫకృద్ధీన్ (ప్రస్తుతం ఈఓఆర్డీ)ను ఆఫీసుకు వెళ్లి చెంప చెళ్లు మనిపించారు. అభివృద్ధిని అడ్డుకొని.. ఇది మద్దికెర మండలం ఎం.ఆగ్రహారంలోని వనకుంట. 227 సర్వే నంబర్లో 1.92 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కుంటను వెడల్పు చేయడానికి వాటర్‌షెడ్ పథకం కింద రూ.5.80 లక్షలు మంజూరు చేశారు. పనులు పూర్తి అయితే వర్షపునీరు నిలిచి గ్రామంలో బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. అయితే పనులు టీడీపీ నేతలకు దక్కలేదనే అసూయతో అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి నిలిపివేశారు. గ్రామాభివృద్ధికి సహకరించాల్సిన నాయకులు పర్సంటేజీల కోసం పనులకు బ్రేకులు వేయించాయరని ఆ గ్రామస్తులు వాపోతున్నారు. విధ్వంసకాండ తుగ్గలి మండలం ఎద్దులదొడ్డి గ్రామ సమీపంలో ధ్వంసమైన వాహనాలివి. రైల్వే కాంట్రాక్ట్ విషయంలో ఎవరూ టెండర్ వేయవద్దని కేఈ వర్గం నుంచి హెచ్చరికలు వెళ్లినా.. వీటిని ఖాతరు చేయకుండా తుగ్గలి నాగేంద్ర టెండర్ దక్కించుకున్నారు. పనులు చేస్తున్న ప్రాంతంలో లారీలు, జేసీబీల అద్దాలను కేఈ శ్యాంబాబుకు చెందిన మనుషులు పగలగొట్టి బెదిరింపులకు దిగారని నాగేంద్ర ఆనాడు తీవ్రంగా ఆరోపించారు. -
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఈ ప్రభాకర్
సాక్షి, అమరావతి: కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ పేరును టీడీపీ ఖరారు చేసింది.సోమవారం రాత్రి కేఈ ప్రభాకర్ పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. అనంతరం మంత్రులు కళా వెంకట్రావు, కాల్వ శ్రీనివాసులు ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ అందరితో సంప్రదింపులు జరిపి ప్రభాకర్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. కర్నూలు జిల్లా రాజకీయ అవసరాలు, అక్కడ నాయకుల అభిప్రాయాల మేరకు ఈ నిర్ణయం జరిగినట్లు చెప్పారు. -
బుట్టా చేరిక.. కేఈ అలక
సాక్షి ప్రతినిధి, కర్నూలు :కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరిక ఆ పార్టీలోని నేతలకే మింగుడుపడటం లేదు. ఆమె చేరికపై ప్రధానంగా కేఈ కుటుంబం అసహనంతో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే అమరావతిలో జరిగిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హాజరుకాలేదన్న ప్రచారం ఆ పార్టీలో సాగుతోంది. మరోవైపు బుట్టా చేరిక కార్యక్రమానికి హాజరు కావాలంటూ తనకు చివరి నిమిషంలో సమాచారం ఇవ్వడంపై కేఈ ప్రభాకర్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. సాధారణ ఎన్నికల్లో కర్నూలు ఎంపీ సీటుపై ఆయన కన్నేశారు. గత ఎన్నికల్లోనే సీటు ఆశించి భంగపడిన ఆయన.. వచ్చే సారీ ఇదే పరిణామం పునరావృతం కానుండటంపై కినుక వహిస్తున్నారు. ఎంపీ బుట్టా పార్టీలో చేరడం, తమను కనీసం సంప్రదించకపోవడం వంటి పరిణామాలతో కేఈ కుటుంబం ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఎప్పటి నుంచో పార్టీనే నమ్ముకుని, కష్టకాలంలో వెన్నంటి ఉన్న తమను విస్మరించడం వారికి ఆగ్రహాన్ని తెప్పించినట్టు ఆ పార్టీ నేతలే అంటున్నారు. కాగా.. కోడుమూరు నియోజకవర్గంలో కొత్తకోట ప్రకాష్‌రెడ్డి చేరికపై కూడా ఎదురూరు విష్ణువర్దన్‌రెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు. మొదటి నుంచీ ఉప్పు నిప్పుగా ఉన్న కొత్తకోట–విష్ణు వర్గాల మధ్య ఈ పరిణామాలు మరింత దుమారం రేపుతున్నాయి. రాజకీయంగా తెరమరుగే! కేఈ ప్రభాకర్ గత ఎన్నికల్లో పోటీకి దిగలేదు. కర్నూలు ఎంపీ స్థానాన్ని ఆశించి భంగపడ్డారు. ఈ సీటు బీటీ నాయుడుకు ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ ఇస్తానని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారనే ప్రచారం జరిగింది. తీరా ఎమ్మెల్సీ కూడా ఇవ్వకపోవడంతో కేఈ ప్రభాకర్... పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ టీడీపీ కార్యాలయం ముందే ధర్నాకు దిగారు. ఆ తర్వాత ఆయనకు ఏపీఐడీసీ చైర్మన్ పదవి లభించింది. అయితే, ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోతే తనకు రాజకీయ భవితవ్యం ఉండదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏదో ఒక స్థానం నుంచి తప్పకుండా పోటీ చేస్తానని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన కర్నూలు ఎంపీ సీటును ఆశించారు. అయితే, తాజా పరిణామాలు మింగుడు పడటం లేదు. ఎంపీ బుట్టా రేణుక పార్టీలో చేరికపై మంగళవారం ఉదయం ఫోన్ చేసి ఆహ్వానించడంతో ఆయన మరింత మండిపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో అధికారపార్టీలో కొత్త కుంపట్లకు తెరలేసిందనే ప్రచారం జరుగుతోంది. చేరింది టీడీపీ కార్యకర్తలే... ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరిన సందర్భంగా చంద్రబాబు నాయుడు కండువాలు కప్పిన కార్యకర్తల్లో పలువురు ఇప్పటికే టీడీపీలో ఉండటం గమనార్హం. ఈ విధంగా సొంత పార్టీ కార్యకర్తలైన వేముగోడు మాజీ సర్పంచ్ సత్యనారాయణ స్వామి, ఆయన కుమారుడు సాయినాథ్తో పాటు పిల్లిగుండ్ల జయరామ్‌లను తిరిగి ఎంపీ సమక్షంలో టీడీపీలోకి చేర్చుకుంటున్నట్లు ఫొటోలకు ఫోజులివ్వడం చర్చనీయాంశమైంది. ఈ విధంగా టీడీపీ కార్యకర్తలకే పచ్చ కండువాలు వేయడం పట్ల పలువురు నవ్విపోతున్నారు. ఫోన్ల బెడద ఇక పార్టీ మారిన ఎంపీ బుట్టా రేణుకకు కొత్త కష్టం వచ్చిపడింది. పార్టీ మారడంపై కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలోని పలువురు ఫోన్లు చేసి మరీ మండిపడుతున్నట్టు సమాచారం. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి మారడం ఏమిటని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. తాము ఓటు వేసి గెలిపిస్తే..కనీసం చెప్పకుండానే పార్టీ ఎలా మారతారని నిలదీసినట్టు సమాచారం. ఈ ఫోన్ల బెడద తట్టుకోలేక, సమాధానం చెప్పలేక ఎంపీ కార్యాలయ సిబ్బంది కాస్తా ఇబ్బందికి గురైనట్టు తెలుస్తోంది. -
తెరపైకి రెండో కృష్ణుడు!
► నంద్యాలలో టీడీపీ పరిస్థితేమీ బాగోలేదని మంత్రుల బృందం స్పష్టీకరణ ► సమన్వయం కొరవడిందని అధిష్టానానికి నివేదిక ► ఇన్‌చార్జ్‌ను మార్చే యోచనలో సీఎం చంద్రబాబు ► తెరపైకి మంత్రి గంటా పేరు కర్నూలు : నంద్యాల నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏమీ బాగోలేదని మంత్రుల బృందం టీడీపీ అధిష్టానానికి నివేదిక ఇచ్చిందా? అందరి మధ్య సమన్వయం పూర్తిస్థాయిలో కొరవడిందని తేల్చిచెప్పిందా? ఎవరికి వారే.. యమునా తీరే అన్న చందంగా ఇక్కడి వ్యవహారం నడుస్తోందని, కొత్త ఇన్‌చార్జ్‌ను నియమించాల్సి ఉందని స్పష్టం చేసిందా?.. ఈ ప్రశ్నలకు అధికార పార్టీ నేతల నుంచే అవుననే సమాధానం వస్తోంది. ఈ నేపథ్యంలో ‘రెండో కృష్ణుడు’ తెర మీదకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్చార్జ్గా ఉన్న మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ సమన్వయం సాధించే పరిస్థితి లేదని, ఈయన నియామకంపై మంత్రి అఖిలప్రియ సుముఖంగా లేరని కూడా మంత్రులు స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో కేఈ ప్రభాకర్ స్థానంలో మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు తెర మీదకు వస్తోంది. త్వరలోనే మంత్రి గంటా నంద్యాలలో మకాం వేయనున్నట్టు తెలుస్తోంది. అందరూ వెళ్లండి! నంద్యాల నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి బాగోలేదన్న మంత్రుల నివేదికలతో సీఎం చంద్రబాబుకు కంగారెత్తినట్టు సమాచారం. దీంతో జిల్లాలోని ముఖ్యనేతలందరూ నంద్యాలలోనే మకాం వేయాలని ఆదేశించారు. ప్రతి నేత కచ్చితంగా అక్కడే ఉండి, ఆయా సెక్షన్లకు చెందిన వారిని సమీకరించాలని సూచించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. త్వరలోనే మంత్రి లోకేష్ కూడా పర్యటించనున్నారని, ఆయన పర్యటన సందర్భంగా పార్టీ నేతలందరూ నంద్యాలలోనే ఉండాలని కూడా సీఎం పేర్కొన్నారు. ప్రధానంగా నంద్యాలలో వర్గాల వారీగా ఓటర్లను సమీకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలని సీఎం ఆదేశించినట్టు తెలిసింది. అయితే, ఎంత మంది బయటి నుంచి వెళ్లినప్పటికీ స్థానిక నేతల్లో ఐక్యత లేకపోతే తామేమీ చేయలేమని కొందరు జిల్లా నేతలు సీఎంకు స్పష్టం చేశారు. బుజ్జగింపులు..బెదిరింపులు : మాజీ మంత్రి ఫరూఖ్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నా కనీసం ఎమ్మెల్సీ ఇవ్వడం లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఎమ్మెల్సీ ఇస్తేనే పార్టీ కోసం కష్టపడతానని తేల్చిచెప్పడంతో అందుకు అధిష్టానం నుంచి హామీ లభించినట్టు సమాచారం. నంద్యాల ఉప ఎన్నికను అడ్డం పెట్టుకుని నేతలు ఎవరికి వారుగా బ్లాక్మెయిల్ చేసి పదవులు సాధించుకుంటున్నారని, తమకు మాత్రం ఏమీ మిగలడం లేదన్న అభిప్రాయం ఆ పార్టీలోనే కొందరు నేతల్లో వ్యక్తమవుతోంది. ఇదే అసంతృప్తితోనే కొందరు నేతలు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. వీరు వెళ్లకుండా మొదట్లో బుజ్జగిస్తున్న టీడీపీ నేతలు... మాట వినకపోతే బెదిరింపులకు కూడా దిగుతున్నారు. తాజాగా పెయింటర్స్ అసోసియేషన్ నేతలపై అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగారు. అయితే, శిల్పా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే నంద్యాల అభివృద్ధి జరిగిందని, మళ్లీ ఆయన నాయకత్వాన్నే తాము కోరుకుంటున్నామని అక్కడి నేతలు తేల్చిచెబుతున్నారు. -
ముఖ్యమంత్రితో మనస్పర్థలు నిజమే
పావగడ (తుమకూరు): తనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వనందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, తన సోదరుడు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో మనస్పర్థలు వచ్చిన మాట వాస్తవమేనని మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆయన నిన్న కర్ణాటకలోని తుమకూరు జిల్లా పావగడలో శనీశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ తనకు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ (ఏపీఐడీ) బోర్డు చైర్మన్ పదవి ఇస్తానని సీఎం హామీ ఇచ్చారని, అందువల్లే టీడీపీలో కొనసాగుతున్నట్లు వెల్లడించారు. -
టీడీపీని బీసీలు కూకటివేళ్లతో పెకిలిస్తారు: కేఈ
కర్నూలు : డబ్బులున్నవాళ్లకు మాత్రమే పదవులిస్తూ.. బీసీలకు అన్యాయం చేస్తే తెలుగుదేశం పార్టీని బీసీలు కూకటివేళ్లతో పెకలించివేస్తారని టీడీపీ నాయకుడు కేఈ ప్రభాకర్ హెచ్చరించారు. పార్టీలో ఇటీవలే చేరిన టీజీ వెంకటేష్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన.. కర్నూలులో తన అనుచరులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పైన, పార్టీ నాయకత్వంపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరాయని అన్నారు. కర్నూలు జిల్లాలో కేవలం మూడు స్థానాల్లోనే టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచినా కూడా పార్టీ కార్యకర్తలు నిస్తేజానికి గురికాకుండా అందరినీ ఒకగాటన తెచ్చామని, అలాంటిది ఇప్పుడు పదవులను మాత్రం ఎవరో కొట్టుకుపోతుంటే బీసీలు చూస్తూ ఊరుకోరని ఆయన మండిపడ్డారు. కర్నూలులో ఉన్న పార్టీ కార్యాలయాన్ని కూడా తానే కట్టించానని గుర్తుచేశారు. ఇప్పుడు కేవలం తనకే కాదు.. బీసీ జాతికి అన్యాయం జరిగిందని అన్నారు. పార్టీలు మారితే పదవులు వస్తాయంటే.. ఈపాటికి ఎన్నో పార్టీలు మారేవాడినని, ఆ విషయం ఇప్పుడే అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. బీసీలకు అన్యాయం చేస్తే టీడీపీని బీసీలు కూకటివేళ్లతో పెకలించివేస్తారని హెచ్చరించారు. సామాజిక న్యాయం చేసిన తర్వాత మిగిలినవాళ్లకు పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తనతో, ఉప ముఖ్యమంత్రితో టెలికాన్ఫరెన్సులో ఏం మాట్లాడారో గుర్తుంచుకోవాలని చెప్పారు. నాయకులు వస్తారు.. పోతారని, గత ఎన్నికల్లో టిక్కెట్టు కూడా త్యాగం చేశామని ఆయన గుర్తు చేశారు. నీచ రాజకీయాలకు ఎవరూ పాల్పడకూడదని చెప్పారు. ప్రజల్లో తిరిగి పదవులు వస్తే ఆనందం ఉంటుంది గానీ డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఆనందం ఉండదని హితవు పలికారు. అప్పట్లో టీజీ వెంకటేష్ సాధారణ లాంబ్రెట్టా మీద తన అన్న వద్దకు వచ్చారని, ఇప్పుడు ఆయనకు డబ్బులు వచ్చాయి కదా అని ఇలా చేస్తే కుదరదని మండిపడ్డారు. 100 శాతం పదవులను బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వాళ్లకు పదవులిచ్చాం, వీళ్లకు ఇచ్చాం అంటే తాము చేతులకు గాజులు తొడిగించుకుని లేమని హెచ్చరించారు. తమకు చేతనైనది ఏదో అది చేసి చూపిస్తామన్నారు. -
అధికార పార్టీలో రోజుకో లొల్లి
పాణ్యంలో మాజీ మంత్రుల మధ్య వివాదం అగ్గి రాజేసిన కాంట్రాక్ట్ వ్యవహారం తనకు విలువ ఏముంటుందని ఏరాసు కినుక అధిష్టాన వైఖరే అలజడికి కారణమంటున్న తెలుగు తమ్ముళ్లు కర్నూలు: అధికార పార్టీలో రోజుకో రగడ తెరమీదకు వస్తోంది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు- అప్పటికే ఉన్న నియోజకవర్గ ఇన్చార్జీల మధ్య నెలకొన్న విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలోని పాణ్యం నియోజకవర్గంలో ఒక ప్రైవేటు కాంట్రాక్టు విషయంలో ఇద్దరు మాజీ మంత్రుల మధ్య వివాదం చెలరేగింది. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా కేఈ కుటుంబానికి చెందిన వ్యక్తికి కాంట్రాక్టు అప్పగించడంపై పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న ఏరాసు ప్రతాప్ రెడ్డి గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అందులోనూ పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని మరీ కాంట్రాక్టు ఇప్పించడం పట్ల ఆయన కినుక వహిస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలోని ఒక ప్రైవేటు సిమెంట్ కంపెనీకి నంద్యాల నుంచి శ్లాబ్ సరఫరా కాంట్రాక్టును కేఈ కుటుంబానికి ఇప్పించినట్టు సమాచారం. ఈ కాంట్రాక్టు విలువ నెలకు రూ. 50 లక్షల మేరకు ఉంది. విషయం తెలుసుకున్న ఏరాసు.. నియోజకవర్గంలో వారికి పనులు ఇప్పించడమా అని వాపోతున్నారు. ఇప్పటికే పాణ్యం నియోజకవర్గం ఇన్చార్జ్ వ్యవహారంలో ఇద్దరి మధ్య విభేదాలు గుప్పుమంటుండగా... తాజాగా కాంట్రాక్టు వ్యవహారం మరింత అగ్గి రాజేసింది. పాణ్యం పోరు పదనిసలు వాస్తవానికి పాణ్యం నియోజకవర్గ విషయంలో అటు కేఈ కుటుంబానికి.. ఇటు ఏరాసుకు మధ్య రగడ నడుస్తోంది. పాణ్యంపై సదరు రాజకీయ కుటుంబానికి చెందిన మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌కు కన్ను ఉంది. పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు తనకు అప్పగించాలని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కోరుతున్నారు. ఇందుకోసం నూతన సంవత్సర వేడుకలను ఆయన వేదికగా చేసుకున్నారు. నియోజకవర్గానికి చెందిన నేతలను పిలిచి ఓర్వకల్లు సమీపంలోని రాక్‌గార్డెన్ వేదికగా భారీ పార్టీ ఇచ్చారు. ఇందుకు అనేక మంది అధికార పార్టీ నేతలు హాజరయ్యారు. అదేవిధంగా మా ఊరు- జన్మభూమి సభలను కూడా వేదికగా చేసుకుని తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. విషయం తెలుసుకున్న ఏరాసు.. హడావుడిగా విదేశాల నుంచి తిరిగి వచ్చి మరీ సభల్లో పాల్గొన్నారు. అయితే, కేఈ ప్రభాకర్ ప్రయత్నాలు సఫలం కాలేదు. పాణ్యం ఇన్చార్జిగా ఏరాసే ఉంటారని అధిష్టానం స్పష్టంగా తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాన్ని చల్లపరచడానికా అన్నట్టు ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టు అప్పగించినట్టు తెలిసింది. ఈ విషయంలో అధిష్టానం వ్యవహరించిన తీరు పట్ల ఏరాసు గుర్రుగా ఉన్నారు. అధిష్టానమే ఇలా చేస్తే ఎలా? ప్రశాంతంగా ఉన్న పార్టీలో అధిష్టానం వైఖరితోనే అలజడి రేగుతోందని తెలుగుతమ్ముళ్లు వాపోతున్నారు. ఇప్పటికే కోడుమూరు నియోజకవర్గంలో విష్ణుకు, మణిగాంధీకి మధ్య వార్ మొదలయింది. గూడూరు జాతర వేదికగా ఏకంగా రథోత్సవాన్ని నిలిపి మరీ తన పంతాన్ని నెగ్గించుకునేందుకు మణిగాంధీ యత్నించారు. జాతర వేదికగా ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఇక నంద్యాల, ఆళ్లగడ్డలో రోజుకో వైరం తెరమీదకు వస్తోంది. ఏకంగా సీఎం సాక్షిగా ఇరు వర్గాలను రాజీ కుదర్చాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ ఇంకో గ్రూపును ప్రోత్సహించే పేరుతో పార్టీ పెద్దలే అగ్గిరాజేస్తే ఎలా అని నియోజకవర్గ ఇన్చార్జీలు వాపోతున్నారు. మొత్తంగా అధికార పార్టీలో రోజుకో రగడ తెరమీదకు వస్తోంది. -
'మాజీ మంత్రి అంటే గుండెల్లో కలుక్కుమంటోంది'
కర్నూలు(అర్బన్): ' ప్రతి ఒక్కరూ మాజీ మంత్రి... మాజీ మంత్రి అని సంభోదిస్తుంటే.. గుండెల్లో కలుక్కుమంటోంది..అందుకే త్వరలోనే మంత్రినవుతాను' అంటూ మాజీ మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ అన్నారు. కర్నూలులో శనివారం నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు రూ.25 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు బీసీలు ఎంతో కృషి చేశారన్నారు. -
ఐకమత్యంతోనే బీసీలకు రాజ్యాధికారం
కర్నూలు(జిల్లా పరిషత్): ఐకమత్యంగా ఉంటేనే బీసీలకు రాజ్యాధికారం వస్తుందని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ చెప్పారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ఏపీ వాల్మీకి (బోయ) హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ తాము వాల్మీకులను సోదరులుగా భావిస్తున్నామన్నారు. అనంతరం కొత్తగా ఎన్నికైన వాల్మీకి కులానికి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను సన్మానించారు. కార్యక్రమంలో పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జె. శ్రీనివాసులునాయుడు, నాయకులు జగదీశ్వరరావు, జ్ఞానేశ్వరమ్మ, పద్మజనాయుడు, డాక్టర్ రజిత మాధురి, మీనెగె వెంకటేశ్వర్లు, ముప్పల వెంకటేశ్వరరావు, హరిబాబు, మీనెగె గోపి, మాజీ జెడ్పీటీసీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
తమ్ముడూ..తగునా!
కేఈ సోదరుల మధ్య జెడ్పీ చైర్మన్ చిచ్చు సాక్షి ప్రతినిధి, కర్నూలు: స్థాయీ సంఘాల ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌గౌడ్ తీరు కేఈ సోదరుల మధ్య చిచ్చుకు కారణమవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఓర్వకల్లు జెడ్పీటీసీగా గెలిచిన ఆయన రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాకపోవడంతో వెన్నుపోటు పొడిచి పచ్చకండువా కప్పుకున్నారు. ఆ పార్టీలో ఆది నుంచి కొనసాగుతూ జెడ్పీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న కప్పట్రాళ్ల బొజ్జమ్మ, పత్తికొండకు చెందిన సుకన్యల పేర్లను జాబితా నుంచి పథకం ప్రకారం తప్పించారు. కేఈ సోదరుల సహకారంతో ఏకంగా చైర్మన్ పదవిని తన్నుకుపోయారు. ఇప్పుడు ఆ పదవిని కాపాడుకునే ప్రయత్నంలో రాజకీయ ఎదుగుదలకు కారణమైన సోదరుల మధ్యే చిచ్చు రాజేస్తుండటంతో పార్టీలో చర్చనీయాంశమవుతోంది. స్థాయీ సంఘాల ఎన్నికల్లో కేఈ ప్రభాకర్ సూచించిన వ్యక్తికి చెక్ పెట్టేందుకు ఆయన సోదరుడు కేఈ ప్రతాప్‌ను పావుగా ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. జెడ్పీ చైర్మన్ కారణంగా కేఈ సోదరుల మధ్య పెరుగుతున్న దూరం ఏ పరిణామాలకు దారితీస్తుందోనని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం స్థాయీ సంఘాల ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అభివృద్ధిలో కీలకమైన స్థాయీ సంఘాల్లో ప్రాతినిధ్యం కోసం టీడీపీ పెద్ద ఎత్తున పైరవీ నడిచింది. నాలుగింటికి జెడ్పీ చైర్మన్ అధ్యక్షుడు కాగా.. వ్యవసాయ స్థాయీ సంఘం చైర్మన్‌గా జెడ్పీ వైస్ చైర్మన్ పుష్పావతి ఎన్నికయ్యారు. ఇక స్త్రీ, శిశు సంక్షేమం.. సాంఘిక సంక్షేమ స్థాయీ సంఘాల పదవులకు రసవత్తర పోటీ సాగింది. రెండు రోజుల క్రితం కేఈ నివాసంలో స్త్రీ, శిశు సంక్షేమ స్థాయీ సంఘం అధ్యక్షురాలుగా పత్తికొండ జెడ్పీటీసీ సభ్యురాలు సుకన్న, సాంఘిక సంక్షేమ స్థాయీ సంఘం అధ్యక్షురాలుగా పాణ్యం జెడ్పీటీసీ సభ్యురాలు నారాయణమ్మ పేర్లను ఖరారు చేశారు. అయితే రాత్రికి రాత్రి సుకన్న స్థానంలో తుగ్గలి జెడ్పీటీసీ సభ్యురాలు వరలక్ష్మికి అవకాశం కల్పించారు. తన పదవికి ఎక్కడ ఎసరు వస్తుందోననే ఉద్దేశంతోనే జెడ్పీ చైర్మన్ ఈ మార్పు చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది. స్థాయీ సంఘంలోనూ దక్కని చోటు జెడ్పీటీసీ సభ్యులుగా గెలుపొందిన సుకన్య, బొజ్జమ్మలకు మొదట జెడ్పీ చైర్మన్ పదవిని ఆశ చూపారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీని దెబ్బకొట్టాలంటే ఆ పార్టీ గుర్తుతో గెలిచి టీడీపీలో చేరిన వారికే పదవి కట్టబెడితే బాగుంటుందనే ఉద్దేశంతో వీరిని ఆ పదవికి దూరం చేశారు. కనీసం స్థాయీ సంఘాల్లోనైనా ప్రాధాన్యతనిస్తారని భావించిన వీరిద్దరికీ భంగపాటు తప్పలేదు. సుకన్యను స్త్రీ, శిశు సంక్షేమ స్థాయీ సంఘానికి అధ్యక్షురాలుగా ఎన్నిక చేయాలని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ సూచించారు. అయితే జెడ్పీ చైర్మన్ తన పబ్బం గడుపుకునేందుకు ప్రభాకర్ సోదరుడు కేఈ ప్రతాప్ ప్రోద్బలంతో సుకన్య స్థానంలో తుగ్గలి జెడ్పీటీసీ సభ్యురాలు వరలక్ష్మిని తెరపైకి తీసుకొచ్చారు. ఫలితంగా సుకన్యకు రెండోసారీ నిరాశే మిగిలింది. ప్రతిపాదించేది వారే... బలపరిచేదీ వారే స్థాయీ సంఘాల ఎన్నికల తీరు జెడ్పీటీసీ సభ్యులను ఆశ్చర్యానికి గురి చేసింది. అధ్యక్షులను ప్రతిపాదించేది, బలపరిచేది టీడీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులే కావడం గమనార్హం. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ సభ్యులకు ఎక్కడా అవకాశం కల్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది. స్థాయీ సంఘాల ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితి తామెన్నడూ చూడలేదని పలువురు జెడ్పీటీసీ సభ్యులు చర్చించుకోవడం కనిపించింది. -
చేతులెత్తేశారు..!
కుదిరిన బేరం.. టీడీపీలో హైడ్రామా తమ్ముళ్ల నమ్మకాన్ని వమ్ముచేశారు ఎమ్మెల్సీ పదవి కోసం ఆర్పీఎస్ అభ్యర్థి విత్‌డ్రా ఉవ్వెత్తున ఎగిసిపడి బాబుకు లొంగిన కేఈ ప్రభాకర్ కర్నూలు పార్లమెంట్ బరి నుంచి తప్పుకున్న వైనం సాక్షిప్రతినిధి, కర్నూలు: ‘నాకు టికెట్ ఇవ్వని టీడీపీలో ఉండలేను. ఎన్నికల్లో టీడీపీని మట్టికరిపిస్తాను. రెబల్‌గా బరిలో దిగుతాను. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తాను’ అంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ టీడీపీ అధినేత చంద్రబాబుపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అదేవిధంగా నందికొట్కూరు టీడీపీ నాయకుడు విక్టర్ కూడా అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ ఇద్దరు తీసుకున్న నిర్ణయంపై జిల్లా టీడీపీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్యాకేజీల కోసం కాంగ్రెస్ నేతలతో టీడీపీని నింపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆ ఇద్దరు తీసుకున్న నిర్ణయం సరైందనేని మద్దతు తెలియజేశారు. చివరకు ఆ ఇద్దరు తుస్సుమనిపించారు. కర్నూలు పార్లమెంట్ కోసం కేఈ ప్రభాకర్, నందికొట్కూరు అసెంబ్లీ టికెట్‌ను విక్టర్ ఆశించిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరినీ కాదని కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన లబ్బి వెంకటస్వామికి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన విక్టర్ టీడీపీ తీరుపై ఎర్రజెండా ఎగురవేశారు. కేఈ ప్రభాకర్ అయితే అధినేత చంద్రబాబు, సోదరుడు కేఈ కృష్ణమూర్తిపైనా మండిపడ్డారు. టీడీపీ నాయకులు.. బంధువులు కొందరు రకరకాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారు. కేఈ ప్రభాకర్ తీసుకున్న నిర్ణయానికి కొందరు సన్నిహితులు సైతం పూర్తి మద్దతు పలికారు. దీంతో కేఈ ప్రభాకర్ స్వతంత్ర అభ్యర్థిగా.. ఎస్పీ అభ్యర్థిగా వేరువేరుగా కర్నూలు పార్లమెంట్ నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. ఇదే సమయంలో నందికొట్కూరు అసెంబ్లీ అభ్యర్థిగా విక్టర్ నామినేషన్ వేశారు. ఈ ఇద్దరు నిర్ణయంపై జిల్లాలో టీడీపీ నేతలంతా హడలిపోయారు. చివరకు ఆ ఇద్దరూ చేతులెత్తేశారు. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు వీరు నామినేషన్లు ఉప సంహరించుకోవటంతో మద్దతిచ్చిన వారంతా గుర్రుమంటున్నారు. ఎమ్మెల్సీ పదవి ఎవరికి? కేఈ ప్రభాకర్, విక్టర్ తిరుగుబావుటా ఎగురవేయడంతో టీడీపీ నేతలు కొందరు అధినేత చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టారు. హైదరాబాద్‌లో మంగళవారం రాత్రంతా జరిగిన చర్చల్లో కేఈ ప్రభాకర్, విక్టర్‌ను ఒప్పించినట్లు సమాచారం. ఆ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఇద్దరిలో ఎవరికి ఇస్తారనేది స్పష్టత లేదు. అదేవిధంగా నందికొట్కూరులో బెరైడ్డి రాయలసీమ పరిరక్షణ సమితి(ఆర్పీఎస్) అభ్యర్థిగా డాక్టర్ శేషన్న నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈయన కూడా బుధవారం నామినేషన్ ఉపసంహరించుకున్నారు. శేషన్న ఉపసంహరించుకోవడానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అధినేత చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. -
బాబోయ్.. బాబు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘రోజుకో మాట.. పూటకో డ్రామా. ఈ రోజు ఒకటి చెబితే.. రేపు మరొకటి చెబుతున్నారు. నాయకులు, కార్యకర్తలను బాబు చెడుగుడు ఆడుకుంటున్నారు. పార్టీని పూర్తిగా కార్పొరేట్ సంస్థను చేసేశారు. గెలుపు కోసం పాకులాడుతున్నారు.’’ ఈ మాటలన్నది మరెవరో కాదు.. సాక్షాత్తు తెలుగుతమ్ముళ్లే. జిల్లా పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం టీడీపీ నేతలు పలువురు ఇలా ఆవేదన వ్యక్తం చేయడం కనిపించింది. బీజేపీతో పొత్తు వ్యవహారంలో అధినేత తీరుపై శ్రేణులు రగిలిపోతున్నాయి. పొత్తు నుంచి వైదొలుగుతున్నట్లు గురువారం చంద్రబాబు ప్రకటించడంతో కర్నూలు, ఆదోని, నంద్యాల, పాణ్యం, కోడుమూరు, ఆలూరు, పత్తికొండ తదితర నియోజకవర్గాల్లో బీజేపీ నేతలు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. కోడుమూరు నుంచి టీడీపీ నాయకులు కూడా పోటీలో నిలవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇంతలో బాబు నిర్ణయం మారడంతో రెండు పార్టీల నేతలు గుర్రుమంటున్నారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌కు సైతం బాబు హ్యాండిచ్చారు. అయినప్పటికీ ప్రభాకర్ గురువారం కర్నూలు పార్లమెంట్‌కు నామినేషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో తన వర్గీయులను టీడీపీ రెబల్ అభ్యర్థులుగా బరిలో దింపేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయన వర్గీయులు శనివారం నామినేషన్ దాఖలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం జై సమైక్యాంధ్ర పార్టీ నేతలు కేఈ ప్రభాకర్‌తో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు.. కేఈ ప్రభాకర్, ఆలూరు ఎమ్మెల్యే నీరజారెడ్డి, మంత్రాలయం మాధవరం రామిరెడ్డి, నందికొట్కూరు విక్టర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. వీరి చర్చలు ఓ కొలిక్కి వస్తే జై సమైక్యాంధ్ర తరఫున వారంతా నామినేషన్ వేసే అవకాశం ఉంది. లేదంటే కేఈ ప్రభాకర్, విక్టర్, మాధవరం రామిరెడ్డి టీడీపీ రెబల్ అభ్యర్థులుగా బరిలో నిలవొచ్చని వారి సన్నిహితులు చెబుతున్నారు. గందరగోళంలో తమ్ముళ్లు రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పాపం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలదేననే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ప్రజల దృష్టి మరల్చేందుకు టీడీపీ నేతలు అష్టకష్టాలు పడుతుండగా.. అధినేత బాబు రోజుకో డ్రామాకు తెరతీస్తుండటంతో జిల్లాలోని తమ్ముళ్లు గందరగోళానికి లోనవుతున్నారు. ‘‘వద్దు వద్దంటున్నా కాంగ్రెస్ నేతలను తీసుకొచ్చి పార్టీలో చేర్చుకొని టికెట్లు కట్టబెట్టారు.. తొమ్మిదేళ్లు జెండాను మోసిన వారిని పక్కనపెట్టారు.. బీజేపీతో పొత్తు వద్దంటే విన్నారు కాదని’’ శ్రేణులు బాబు తీరుపై గగ్గోలు పెడుతున్నారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం కలిగిన నేత వ్యవహరించే తీరిదేనా అన్న సంశయం టీడీపీ నాయకులకు కలుగుతోంది. తమ పరిస్థితే ఇలా ఉంటే.. ప్రజల ఆలోచన ఎలా ఉంటుందోనని తమ్ముళ్లు మదనపడుతున్నారు. అధినేత తీరు తమ పుట్టి ముంచుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇలాగే పార్టీ తీరు ఉంటే జనంలో గ్రాఫ్ మరింత దిగజారిపోయే ప్రమాదం ఉందని కలవరపడుతున్నారు.