విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్.. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి రాజీనామా లేఖను ఫ్యాక్స్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కేఈ ప్రభాకర్ రాజీనామా టీడీపీలో కల్లోలం రేపింది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లుతోందని, ప్రజాదరణ చూరగొంటోన్న ప్రభుత్వానికి సహకరించకుండా, అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకునేలా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని.. రాజీనామా చేసిన నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కేఈ రాజీనామాతో కర్నూలు టీడీపీ కేడర్ ఆలోచనలో పడింది.
టీడీపీకి బలమైన నేతలు కేఈ సోదరులు..
జిల్లాలో టీడీపీ అత్యంత బలహీనమైన పార్టీ. గత 20 ఏళ్లలో ఆ పార్టీ అత్యధికంగా గెలిచిన అసెంబ్లీ స్థానాలు నాలుగు మాత్రమే. ఈ దఫా ఎన్నికల్లో కనీసం ఒక్కస్థానం కూడా గెలవలేదు. అయితే టీడీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో ఆ పార్టీకి కేఈ సోదరులు, భూమా నాగిరెడ్డి అండగా ఉండేవారు. భూమా నాగిరెడ్డి టీడీపీని వీడి ప్రజారాజ్యంలో చేరిన తర్వాత కేఈ సోదరులు పెద్ద దిక్కయ్యారు. అయితే అధికారంలో ఉన్న ఐదేళ్లూ వీరిని చంద్రబాబు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. టీడీపీ పాలనలో ఐదేళ్లు రెవెన్యూ మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా కేఈ కృష్ణమూర్తి కొనసాగినా...కనీసం ఒక్క ఆర్డీవోను కూడా బదిలీ చేసుకోలేని పరిస్థితి చంద్రబాబు కల్పించారు. కీలకమైన రెవెన్యూశాఖ ఉన్నప్పటికీ కేఈ ప్రభావం లేకుండా తనను ఒక అసమర్థ మంత్రిగా చంద్రబాబు చేశారని, అప్పట్లో టీడీపీ జిల్లా ఇన్‌చార్జ్‌లు చర్చించుకునేవారు.
అయితే టీడీపీ అధికారంలో ఉండటంతో ఇష్టం లేకపోయినా అనివార్య పరిస్థితుల్లో అందులో కొనసాగారు. టీడీపీ ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో కేఈ ప్రభాకర్ రాజీనామా వ్యవహారం కొత్త చర్చలకు దారి తీసింది. కేఈ కృష్ణమూర్తికి తెలీకుండా ప్రభాకర్ రాజీనామా చేసే అవకాశమే లేదని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. కేఈ కృష్ణమూర్తి సలహాతోనే ప్రభాకర్ రాజీనామా చేశారని తెలుస్తోంది. త్వరలోనే కేఈ కృష్ణమూర్తి, శ్యాంబాబు కూడా టీడీపీకి రాజీనామా చేసే అవకాశం ఉందని కేఈ ప్రభాకర్ సన్నిహితులు ‘సాక్షి’కి తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై కేఈ రాజీనామా ప్రభావం: స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన వైఎస్సార్‌సీపీని ఎదుర్కోలేక టీడీపీ ఆపసోపాలు పడుతోంది. చాలాచోట్ల ఇన్‌చార్జ్‌ల మద్దతు లేక ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నారు. ఈక్రమంలో కేఈ ప్రభాకర్ రాజీనామా చేశారు. ఆయన సోదరుడు కేఈ కృష్ణమూర్తి డోన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డోన్ మునిసిపాలిటీలో టీడీపీ పోటీ నుంచి తప్పుకుంటోందని వెల్లడించారు. ఈ రెండు పరిణామాలు టీడీపీలో కల్లోలం రేపాయి. కేఈ బ్రదర్స్‌లో ఒకరు ఎన్నికల బాధ్యత నుంచి తప్పుకుంటే మరొకరు ఏకంగా పార్టీకే రాజీనామా చేశారని, వారే చేతులెత్తేస్తే ఇక తమ పరిస్థితి ఏంటని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు డోలాయమానంలో పడ్డారు. దీంతో పాటు ఎన్నేళ్లున్నా ఎమ్మెల్యేగా గెలవలేని టీడీపీలో కొనసాగడం కంటే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోడమే మంచిదని గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఓ ఎమ్మెల్యే అభ్యర్థి ‘సాక్షి’తో తెలిపారు. ఈ పరిణామాలు చూస్తుంటే కేఈ ప్రభాకర్ రాజీనామా వ్యవహారంపై టీడీపీపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. త్వరలోనే మరికొంతమంది నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు టీడీపీని వీడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు వైఖరి నచ్చక రాజీనామా..
రాజీనామా అంశంపై కేఈ ప్రభాకర్ ‘సాక్షి’తో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఒంటెత్తు పోకడలతోనే తాను రాజీనామా చేసినట్లు వెల్లడించారు. టీడీపీ సరైన దారిలో నడవలేదన్నారు. టీడీపీ రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై పార్టీకి ద్రోహం చేసి టీజీ వెంకటేష్ బీజేపీలో చేరారని, అలాంటి వ్యక్తి కనుసన్నల్లో ఇప్పటికీ టీడీపీ నడుస్తోందన్నారు. కార్పొరేటర్ టిక్కెట్ల నుంచి జిల్లాలోని చాలా నియోజవకర్గాల్లో టీడీపీలో టీజీ మాట చెల్లబాటవుతోందన్నారు. అలాగే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారని, కానీ నంద్యాల పార్లమెంట్‌లో కూడా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయాలు అధిష్టానికి తెలిపినా నిర్లక్ష్యం చేసి, వారికే సహకరిస్తున్నారన్నారు. వీటితో పాటు చాలా కారణాలు ఉన్నాయని, అందుకే టీడీపీని వీడుతున్నాని తెలిపారు. త్వరలోనే కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment