బాబోయ్.. బాబు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘రోజుకో మాట.. పూటకో డ్రామా. ఈ రోజు ఒకటి చెబితే.. రేపు మరొకటి చెబుతున్నారు. నాయకులు, కార్యకర్తలను బాబు చెడుగుడు ఆడుకుంటున్నారు. పార్టీని పూర్తిగా కార్పొరేట్ సంస్థను చేసేశారు. గెలుపు కోసం పాకులాడుతున్నారు.’’ ఈ మాటలన్నది మరెవరో కాదు.. సాక్షాత్తు తెలుగుతమ్ముళ్లే. జిల్లా పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం టీడీపీ నేతలు పలువురు ఇలా ఆవేదన వ్యక్తం చేయడం కనిపించింది. బీజేపీతో పొత్తు వ్యవహారంలో అధినేత తీరుపై శ్రేణులు రగిలిపోతున్నాయి.
పొత్తు నుంచి వైదొలుగుతున్నట్లు గురువారం చంద్రబాబు ప్రకటించడంతో కర్నూలు, ఆదోని, నంద్యాల, పాణ్యం, కోడుమూరు, ఆలూరు, పత్తికొండ తదితర నియోజకవర్గాల్లో బీజేపీ నేతలు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. కోడుమూరు నుంచి టీడీపీ నాయకులు కూడా పోటీలో నిలవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇంతలో బాబు నిర్ణయం మారడంతో రెండు పార్టీల నేతలు గుర్రుమంటున్నారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌కు సైతం బాబు హ్యాండిచ్చారు. అయినప్పటికీ ప్రభాకర్ గురువారం కర్నూలు పార్లమెంట్‌కు నామినేషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో తన వర్గీయులను టీడీపీ రెబల్ అభ్యర్థులుగా బరిలో దింపేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు.
ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయన వర్గీయులు శనివారం నామినేషన్ దాఖలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం జై సమైక్యాంధ్ర పార్టీ నేతలు కేఈ ప్రభాకర్‌తో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు.. కేఈ ప్రభాకర్, ఆలూరు ఎమ్మెల్యే నీరజారెడ్డి, మంత్రాలయం మాధవరం రామిరెడ్డి, నందికొట్కూరు విక్టర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. వీరి చర్చలు ఓ కొలిక్కి వస్తే జై సమైక్యాంధ్ర తరఫున వారంతా నామినేషన్ వేసే అవకాశం ఉంది. లేదంటే కేఈ ప్రభాకర్, విక్టర్, మాధవరం రామిరెడ్డి టీడీపీ రెబల్ అభ్యర్థులుగా బరిలో నిలవొచ్చని వారి సన్నిహితులు చెబుతున్నారు.
గందరగోళంలో తమ్ముళ్లు
రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పాపం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలదేననే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ప్రజల దృష్టి మరల్చేందుకు టీడీపీ నేతలు అష్టకష్టాలు పడుతుండగా.. అధినేత బాబు రోజుకో డ్రామాకు తెరతీస్తుండటంతో జిల్లాలోని తమ్ముళ్లు గందరగోళానికి లోనవుతున్నారు. ‘‘వద్దు వద్దంటున్నా కాంగ్రెస్ నేతలను తీసుకొచ్చి పార్టీలో చేర్చుకొని టికెట్లు కట్టబెట్టారు.. తొమ్మిదేళ్లు జెండాను మోసిన వారిని పక్కనపెట్టారు.. బీజేపీతో పొత్తు వద్దంటే విన్నారు కాదని’’ శ్రేణులు బాబు తీరుపై గగ్గోలు పెడుతున్నారు.
రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం కలిగిన నేత వ్యవహరించే తీరిదేనా అన్న సంశయం టీడీపీ నాయకులకు కలుగుతోంది. తమ పరిస్థితే ఇలా ఉంటే.. ప్రజల ఆలోచన ఎలా ఉంటుందోనని తమ్ముళ్లు మదనపడుతున్నారు. అధినేత తీరు తమ పుట్టి ముంచుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇలాగే పార్టీ తీరు ఉంటే జనంలో గ్రాఫ్ మరింత దిగజారిపోయే ప్రమాదం ఉందని కలవరపడుతున్నారు.