కేఈ సోదరుల మధ్య జెడ్పీ చైర్మన్ చిచ్చు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: స్థాయీ సంఘాల ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌గౌడ్ తీరు కేఈ సోదరుల మధ్య చిచ్చుకు కారణమవుతోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఓర్వకల్లు జెడ్పీటీసీగా గెలిచిన ఆయన రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాకపోవడంతో వెన్నుపోటు పొడిచి పచ్చకండువా కప్పుకున్నారు. ఆ పార్టీలో ఆది నుంచి కొనసాగుతూ జెడ్పీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న కప్పట్రాళ్ల బొజ్జమ్మ, పత్తికొండకు చెందిన సుకన్యల పేర్లను జాబితా నుంచి పథకం ప్రకారం తప్పించారు. కేఈ సోదరుల సహకారంతో ఏకంగా చైర్మన్ పదవిని తన్నుకుపోయారు. ఇప్పుడు ఆ పదవిని కాపాడుకునే ప్రయత్నంలో రాజకీయ ఎదుగుదలకు కారణమైన సోదరుల మధ్యే చిచ్చు రాజేస్తుండటంతో పార్టీలో చర్చనీయాంశమవుతోంది.
స్థాయీ సంఘాల ఎన్నికల్లో కేఈ ప్రభాకర్ సూచించిన వ్యక్తికి చెక్ పెట్టేందుకు ఆయన సోదరుడు కేఈ ప్రతాప్‌ను పావుగా ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. జెడ్పీ చైర్మన్ కారణంగా కేఈ సోదరుల మధ్య పెరుగుతున్న దూరం ఏ పరిణామాలకు దారితీస్తుందోనని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం స్థాయీ సంఘాల ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అభివృద్ధిలో కీలకమైన స్థాయీ సంఘాల్లో ప్రాతినిధ్యం కోసం టీడీపీ పెద్ద ఎత్తున పైరవీ నడిచింది.
నాలుగింటికి జెడ్పీ చైర్మన్ అధ్యక్షుడు కాగా.. వ్యవసాయ స్థాయీ సంఘం చైర్మన్‌గా జెడ్పీ వైస్ చైర్మన్ పుష్పావతి ఎన్నికయ్యారు. ఇక స్త్రీ, శిశు సంక్షేమం.. సాంఘిక సంక్షేమ స్థాయీ సంఘాల పదవులకు రసవత్తర పోటీ సాగింది. రెండు రోజుల క్రితం కేఈ నివాసంలో స్త్రీ, శిశు సంక్షేమ స్థాయీ సంఘం అధ్యక్షురాలుగా పత్తికొండ జెడ్పీటీసీ సభ్యురాలు సుకన్న, సాంఘిక సంక్షేమ స్థాయీ సంఘం అధ్యక్షురాలుగా పాణ్యం జెడ్పీటీసీ సభ్యురాలు నారాయణమ్మ పేర్లను ఖరారు చేశారు. అయితే రాత్రికి రాత్రి సుకన్న స్థానంలో తుగ్గలి జెడ్పీటీసీ సభ్యురాలు వరలక్ష్మికి అవకాశం కల్పించారు. తన పదవికి ఎక్కడ ఎసరు వస్తుందోననే ఉద్దేశంతోనే జెడ్పీ చైర్మన్ ఈ మార్పు చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
స్థాయీ సంఘంలోనూ దక్కని చోటు
జెడ్పీటీసీ సభ్యులుగా గెలుపొందిన సుకన్య, బొజ్జమ్మలకు మొదట జెడ్పీ చైర్మన్ పదవిని ఆశ చూపారు. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌సీపీని దెబ్బకొట్టాలంటే ఆ పార్టీ గుర్తుతో గెలిచి టీడీపీలో చేరిన వారికే పదవి కట్టబెడితే బాగుంటుందనే ఉద్దేశంతో వీరిని ఆ పదవికి దూరం చేశారు. కనీసం స్థాయీ సంఘాల్లోనైనా ప్రాధాన్యతనిస్తారని భావించిన వీరిద్దరికీ భంగపాటు తప్పలేదు. సుకన్యను స్త్రీ, శిశు సంక్షేమ స్థాయీ సంఘానికి అధ్యక్షురాలుగా ఎన్నిక చేయాలని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ సూచించారు. అయితే జెడ్పీ చైర్మన్ తన పబ్బం గడుపుకునేందుకు ప్రభాకర్ సోదరుడు కేఈ ప్రతాప్ ప్రోద్బలంతో సుకన్య స్థానంలో తుగ్గలి జెడ్పీటీసీ సభ్యురాలు వరలక్ష్మిని తెరపైకి తీసుకొచ్చారు. ఫలితంగా సుకన్యకు రెండోసారీ నిరాశే మిగిలింది.
ప్రతిపాదించేది వారే... బలపరిచేదీ వారే
స్థాయీ సంఘాల ఎన్నికల తీరు జెడ్పీటీసీ సభ్యులను ఆశ్చర్యానికి గురి చేసింది. అధ్యక్షులను ప్రతిపాదించేది, బలపరిచేది టీడీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులే కావడం గమనార్హం. ఈ విషయంలో వైఎస్‌ఆర్‌సీపీ జెడ్పీటీసీ సభ్యులకు ఎక్కడా అవకాశం కల్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది. స్థాయీ సంఘాల ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితి తామెన్నడూ చూడలేదని పలువురు జెడ్పీటీసీ సభ్యులు చర్చించుకోవడం కనిపించింది.
తమ్ముడూ..తగునా!
Published Mon, Sep 1 2014 4:36 AM | Last Updated on Sat, Sep 2 2017 12:41 PM
Advertisement
Advertisement