
డోన్: తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ధిక్కార స్వరం వినిపించారు. డోన్ టీడీపీ అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థిని ప్రభాకర్ తిరస్కరించారు. డోన్ నియోజకవర్గంలో కేఈ కుటుంబం కచ్చితంగా పోటీ చేస్తుందని బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు టీడీపీలో దుమారం రేపుతున్నాయి.
డోన్ టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని చంద్రబాబు గతంలోనే ప్రకటించారు. ఈ నిర్ణయంపై కేఈ ప్రభాకర్ అసంతృప్తితో ఉన్నారు. తన జన్మదిన వేడుక సందర్భంగా బుధవారం డోన్‌లో ఓ ఫంక్షన్ హాలులో సభ నిర్వహించి, తన నిర్ణయాన్ని ప్రకటించారు. ‘40 ఏళ్లుగా కేఈ కుటుంబానికి డోన్ కంచుకోట. నేను జెడ్పీటీసీ నుంచి అంచెలంచెలుగా జనామోదంతో రాష్ట్ర మంత్రి వరకు ఎదిగాను.
ఇప్పుడు ఎలాంటి అనుభవం, జనామోదం లేని వ్యక్తికి నియోజకవర్గ ఇన్‌చార్జి ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు’ అని చెప్పారు. తమకు జన బలం, ధన బలం కూడా ఉందనే సంగతి ఎవ్వరూ మర్చిపోవద్దని అన్నారు. ఒంట్లో శక్తి కూడా తగ్గలేదని అన్నారు. కచ్చితంగా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తామని, ఈ విషయంలో కార్యకర్తలు సందేహించాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.
ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. టిక్కెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతామని నేరుగా చంద్రబాబుకే స్పష్టం చేసినట్లు కేఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇదిలా ఉండగా కేఈ జన్మదిన వేడుకకు హాజరుకాకుండా ఉండేందుకు సుబ్బారెడ్డి బుధవారమే నంద్యాలలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.