టీడీపీని బీసీలు కూకటివేళ్లతో పెకిలిస్తారు: కేఈ
కర్నూలు : డబ్బులున్నవాళ్లకు మాత్రమే పదవులిస్తూ.. బీసీలకు అన్యాయం చేస్తే తెలుగుదేశం పార్టీని బీసీలు కూకటివేళ్లతో పెకలించివేస్తారని టీడీపీ నాయకుడు కేఈ ప్రభాకర్ హెచ్చరించారు. పార్టీలో ఇటీవలే చేరిన టీజీ వెంకటేష్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన.. కర్నూలులో తన అనుచరులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పైన, పార్టీ నాయకత్వంపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరాయని అన్నారు.
కర్నూలు జిల్లాలో కేవలం మూడు స్థానాల్లోనే టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచినా కూడా పార్టీ కార్యకర్తలు నిస్తేజానికి గురికాకుండా అందరినీ ఒకగాటన తెచ్చామని, అలాంటిది ఇప్పుడు పదవులను మాత్రం ఎవరో కొట్టుకుపోతుంటే బీసీలు చూస్తూ ఊరుకోరని ఆయన మండిపడ్డారు. కర్నూలులో ఉన్న పార్టీ కార్యాలయాన్ని కూడా తానే కట్టించానని గుర్తుచేశారు. ఇప్పుడు కేవలం తనకే కాదు.. బీసీ జాతికి అన్యాయం జరిగిందని అన్నారు. పార్టీలు మారితే పదవులు వస్తాయంటే.. ఈపాటికి ఎన్నో పార్టీలు మారేవాడినని, ఆ విషయం ఇప్పుడే అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. బీసీలకు అన్యాయం చేస్తే టీడీపీని బీసీలు కూకటివేళ్లతో పెకలించివేస్తారని హెచ్చరించారు. సామాజిక న్యాయం చేసిన తర్వాత మిగిలినవాళ్లకు పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి తనతో, ఉప ముఖ్యమంత్రితో టెలికాన్ఫరెన్సులో ఏం మాట్లాడారో గుర్తుంచుకోవాలని చెప్పారు. నాయకులు వస్తారు.. పోతారని, గత ఎన్నికల్లో టిక్కెట్టు కూడా త్యాగం చేశామని ఆయన గుర్తు చేశారు. నీచ రాజకీయాలకు ఎవరూ పాల్పడకూడదని చెప్పారు. ప్రజల్లో తిరిగి పదవులు వస్తే ఆనందం ఉంటుంది గానీ డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఆనందం ఉండదని హితవు పలికారు.
అప్పట్లో టీజీ వెంకటేష్ సాధారణ లాంబ్రెట్టా మీద తన అన్న వద్దకు వచ్చారని, ఇప్పుడు ఆయనకు డబ్బులు వచ్చాయి కదా అని ఇలా చేస్తే కుదరదని మండిపడ్డారు. 100 శాతం పదవులను బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వాళ్లకు పదవులిచ్చాం, వీళ్లకు ఇచ్చాం అంటే తాము చేతులకు గాజులు తొడిగించుకుని లేమని హెచ్చరించారు. తమకు చేతనైనది ఏదో అది చేసి చూపిస్తామన్నారు.