తెరపైకి రెండో కృష్ణుడు!
► నంద్యాలలో టీడీపీ పరిస్థితేమీ బాగోలేదని మంత్రుల బృందం స్పష్టీకరణ
► సమన్వయం కొరవడిందని అధిష్టానానికి నివేదిక
► ఇన్‌చార్జ్‌ను మార్చే యోచనలో సీఎం చంద్రబాబు
► తెరపైకి మంత్రి గంటా పేరు
కర్నూలు : నంద్యాల నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏమీ బాగోలేదని మంత్రుల బృందం టీడీపీ అధిష్టానానికి నివేదిక ఇచ్చిందా? అందరి మధ్య సమన్వయం పూర్తిస్థాయిలో కొరవడిందని తేల్చిచెప్పిందా? ఎవరికి వారే.. యమునా తీరే అన్న చందంగా ఇక్కడి వ్యవహారం నడుస్తోందని, కొత్త ఇన్‌చార్జ్‌ను నియమించాల్సి ఉందని స్పష్టం చేసిందా?.. ఈ ప్రశ్నలకు అధికార పార్టీ నేతల నుంచే అవుననే సమాధానం వస్తోంది. ఈ నేపథ్యంలో ‘రెండో కృష్ణుడు’ తెర మీదకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ సమన్వయం సాధించే పరిస్థితి లేదని, ఈయన నియామకంపై మంత్రి అఖిలప్రియ సుముఖంగా లేరని కూడా మంత్రులు స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో కేఈ ప్రభాకర్ స్థానంలో మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు తెర మీదకు వస్తోంది. త్వరలోనే మంత్రి గంటా నంద్యాలలో మకాం వేయనున్నట్టు తెలుస్తోంది.
అందరూ వెళ్లండి!
నంద్యాల నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి బాగోలేదన్న మంత్రుల నివేదికలతో సీఎం చంద్రబాబుకు కంగారెత్తినట్టు సమాచారం. దీంతో జిల్లాలోని ముఖ్యనేతలందరూ నంద్యాలలోనే మకాం వేయాలని ఆదేశించారు. ప్రతి నేత కచ్చితంగా అక్కడే ఉండి, ఆయా సెక్షన్లకు చెందిన వారిని సమీకరించాలని సూచించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. త్వరలోనే మంత్రి లోకేష్ కూడా పర్యటించనున్నారని, ఆయన పర్యటన సందర్భంగా పార్టీ నేతలందరూ నంద్యాలలోనే ఉండాలని కూడా సీఎం పేర్కొన్నారు. ప్రధానంగా నంద్యాలలో వర్గాల వారీగా ఓటర్లను సమీకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలని సీఎం ఆదేశించినట్టు తెలిసింది. అయితే, ఎంత మంది బయటి నుంచి వెళ్లినప్పటికీ స్థానిక నేతల్లో ఐక్యత లేకపోతే తామేమీ చేయలేమని కొందరు జిల్లా నేతలు సీఎంకు స్పష్టం చేశారు.
బుజ్జగింపులు..బెదిరింపులు :
మాజీ మంత్రి ఫరూఖ్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నా కనీసం ఎమ్మెల్సీ ఇవ్వడం లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఎమ్మెల్సీ ఇస్తేనే పార్టీ కోసం కష్టపడతానని తేల్చిచెప్పడంతో అందుకు అధిష్టానం నుంచి హామీ లభించినట్టు సమాచారం. నంద్యాల ఉప ఎన్నికను అడ్డం పెట్టుకుని నేతలు ఎవరికి వారుగా బ్లాక్‌మెయిల్ చేసి పదవులు సాధించుకుంటున్నారని, తమకు మాత్రం ఏమీ మిగలడం లేదన్న అభిప్రాయం ఆ పార్టీలోనే కొందరు నేతల్లో వ్యక్తమవుతోంది.
ఇదే అసంతృప్తితోనే కొందరు నేతలు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. వీరు వెళ్లకుండా మొదట్లో బుజ్జగిస్తున్న టీడీపీ నేతలు... మాట వినకపోతే బెదిరింపులకు కూడా దిగుతున్నారు. తాజాగా పెయింటర్స్ అసోసియేషన్ నేతలపై అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగారు. అయితే, శిల్పా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే నంద్యాల అభివృద్ధి జరిగిందని, మళ్లీ ఆయన నాయకత్వాన్నే తాము కోరుకుంటున్నామని అక్కడి నేతలు తేల్చిచెబుతున్నారు.