సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడతారా?.. లేదంటే అయిష్టంగానే ఆ పార్టీలో కొనసాగుతారా? తన రాజకీయ భవిష్యత్తు కోసం గంటా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు?.. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఈ చర్చే ప్రధానంగా నడుస్తోంది. చీపురుపల్లిలో పోటీ తన వల్ల కాదని గంటా చెబుతున్నా.. చంద్రబాబు మాత్రం పోటీ చేయాల్సిందేనని తేల్చేశారు. దీంతో ఆయన ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘‘మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేసేందుకు నన్ను సరైన అభ్యర్థిగా పార్టీ భావించింది. చీపురుపల్లిలో సీనియర్ లీడర్‌పై పోటీ చేస్తే బాగుంటుందని గట్టి ప్రతిపాదన పెట్టింది’’.. ఫిబ్రవరి 23వ తేదీ ప్రెస్‌మీట్‌లో గంటా శ్రీనివాసరావు చెప్పిన మాట. అయితే వెంటనే ఆయన వెనకడుగేశారు. చీపురుపల్లిలో అవకాశాలపై తన సహచరులు, స్నేహితులు, పార్టీ కార్యకర్తలతో చర్చిస్తున్నానని చెబుతూనే.. అక్కడ నుంచి పోటీకి విముఖత ప్రదర్శిస్తూ వచ్చారు.
‘ప్రతి ఎన్నికల్లో వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న మాట వాస్తవమే. కానీ, ఈసారి గెలిచిన చోట నుంచే మళ్లీ పోటీ చేయాలనుకున్నా’ ఇది మారిన గంటా స్వరం. ఈ క్రమంలో పదే పదే చంద్రబాబును కలుస్తూ.. తాను చీపురుపల్లిలో అదీ బొత్స లాంటి పవర్‌ఫుల్ లీడర్‌పై పోటీకి సిద్ధంగా లేనని, కాదని బలవంతంగా పోటీకి దించితే ఫలితం మరోలా ఉండొచ్చని మొరపెట్టుకున్నారు. కానీ, చంద్రబాబు కనికరించడం లేదు. పోటీ చేస్తే చీపురుపల్లి నుంచే చేయాలని.. లేకుంటే మీ దారి మీరు చూస్కోండంటూ చంద్రబాబు తేల్చేసినట్లు సమాచారం. తాజాగా బుధవారం కూడా ఆయన చంద్రబాబును కలిసినా.. అదే సమాధానం వచ్చింది.దీంతో..
గంటా శ్రీనివాస్ ఇవాళ తన రాజకీయ భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్య అనుచరులతో గురువారం గంటా తన నివాసంలో భేటీ కానున్నారు. వాళ్లతో చర్చించి తన తర్వాతి అడుగులపై కీలక ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment