మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌కు టికెట్ దక్కకపోవడంతో అనకాపల్లిలో టీడీపీ శ్రేణుల ఆందోళన
సాక్షి, విశాఖపట్నం : నమ్మిన వారిని నట్టేట ముంచడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మరోసారి నిరూపితమైంది. పార్టీని అంటిపెట్టుకొని.. భూజాలపై మోస్తున్న సీనియర్లను కరివేపాకులా తీసి పడేశారు. పొత్తులో భాగంగా జనసేనతో కలిసి తొలి విడత విడుదల చేసిన జాబితా.. సీనియర్లలో కుంపటి రాజేసింది. సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని మొదటి జాబితాలో తమ పేర్లు ఉంటాయని భావించిన వారంతా.. చంద్రబాబు కుతంత్ర రాజకీయాలకు బలయ్యారు. మొత్తం 94 మంది అభ్యర్థుల లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో కంగుతిన్నారు. నిన్నా మొన్న పార్టీలోకి వచ్చిన వారికి సీట్లు కేటాయించడంపై సీనియర్లు అవాక్కయ్యారు.
అందరిదీ అదే పరిస్థితి..!
► ముందుగా ఊహించినట్లుగానే గంటా శ్రీనివాసరావును పొమ్మనలేక పొగపెట్టినట్లుగా చంద్రబాబు వ్యవహరించారు. సీటు మార్పు అంటూ ఊహాగానాలు వచ్చినా.. చివరికి ఆయన పేరు ప్రస్తావన లేకుండానే తొలి జాబితా సాగిపోయింది. గత ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకూ అన్నీ తానై వ్యవహరించిన గంటాకు మొండిచెయ్యి చూపించడంతో కేడర్ భగ్గుమంటోంది. జాబితా విడుదలైన తర్వాత గంటా ఇంట్లో ఒంటరిగా ఉండిపోయారు. ఒకరిద్దరు సన్నిహితులతో మాత్రమే మాట్లాడిన గంటా.. కేడర్, పార్టీ శ్రేణులు ఇంటికి వచ్చినా.. తర్వాత కలుద్దామని చెప్పి పంపించేశారు.
► విశాఖ టీడీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరించిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికీ తొలి జాబితాలో చోటు దక్కకపోవడంతో ఆయన మొహం చాటేశారు. పెందుర్తి సీటు పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారని ముందుగానే ప్రచారం చేశారు. అయితే.. పెందుర్తి సీటు కచ్చితంగా తనకు గానీ, కుమారుడికి గానీ ఇవ్వాలని ఇటీవల పర్యటించిన చంద్రబాబు, లోకేష్ ఇద్దరికీ బండారు విజ్ఞప్తి చేశారు. కానీ.. ఈ సీనియర్‌ని కూడా పక్కన పెట్టేలా వ్యవహరించడంతో.. కేడర్ మూగబోయింది. ముఖ్యనేతలతో సమావేశమైన బండారు.. మరోసారి అధిష్టానంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
► విశాఖ పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుదీ అదే పరిస్థితి. 2019 ఎన్నికల్లో పల్లాని చంద్రబాబు పోటీలో నిలబెట్టినా.. గాజువాక నుంచి పవన్ పోటీ చేస్తున్నందున ప్రచారం కూడా చెయ్యొద్దంటూ హుకుం జారీ చేశారు. నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన చంద్రబాబు.. గాజువాక రాకపోయినా పట్టించుకోని పల్లా.. పార్టీని కాపాడుకునేందుకు నాలుగున్నరేళ్లుగా కష్టపడుతున్నారు. అయినా.. పల్లాకు సీటు గ్యారెంటీ లేదని అధిష్టానం చెప్పకనే చెప్పింది. మరోసారి అధిష్టానంతో మాట్లాడి.. సీటు ఉంటుందా.. లేదా అనేది క్లారిటీ వచ్చిన తర్వాత.. భవిష్యత్తు కార్యాచరణ ఏంటనేది నిర్ణయించుకుందామని తన అనుచరగణంతో పల్లా చెప్పినట్లు తెలుస్తోంది.
► పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు కనీసం పట్టించుకోని గణబాబుకు మరోసారి పశ్చిమ సీటు కేటాయించడంపై పార్టీలో అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి. గణబాబుకు ఈసారి టికెట్ ఇవ్వొద్దంటూ పార్టీ సీనియర్లు తిరుగుబావుటా ఎగరేసినా.. పట్టించుకోకుండా టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. టీడీపీలో అడ్డగోలు రాజకీయాలు జరుగుతున్నాయంటూ సన్నిహితుల వద్ద వాపోయారు. ఏ పార్టీలో చేరుతాననేది త్వరలోనే చెబుతానని ప్రకటించారు.
► అనకాపల్లిలో పార్టీకి పునాదిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు కూడా చేదు అనుభవం ఎదురైంది. ఏడాదిన్నర క్రితం జరిగిన నియోజకవర్గ సమీక్షలోనూ పీలాకే టికెట్ అన్నట్లుగా చంద్రబాబు సంకేతాలిచ్చి.. చివరి నిమిషంలో జనసేన తరఫున కొణతాల రామకృష్ణకు టికెట్ కేటాయించడంపై ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబితా ప్రకటించిన వెంటనే పార్టీ కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. అధిష్టానం పునరాలోచన చేయకుంటే తమ నాయకుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు.
► వలస పక్షుల్లా.. ఆ గూటికీ.. ఈ గూటికీ తిరుగుతూ ఉండే దాడి వీరభద్రరావు కుటుంబం.. నెల రోజుల క్రితం చంద్రబాబు హామీతో టీడీపీ పంచన చేరారు. బాబు చేసే మోసాల గురించి పూర్తిగా తెలిసినా.. దాడి ఫ్యామిలీ మరోసారి భంగపాటుకు గురైంది. తనకు గానీ.. కుమారుడు రత్నాకర్‌కు గానీ టికెట్ ఇస్తానని చెప్పి.. నమ్మించి గొంతు కోశారంటూ దాడి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వైరి వర్గంగా భావించే కొణతాలకు టికెట్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ●నమ్మక ద్రోహానికి నిలువెత్తు రూపం చంద్రబాబు అంటూ టీడీపీ సీనియర్ నాయకులు అనుచర వర్గాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. బాబు కొట్టిన దెబ్బకు భవిష్యత్తు కార్యాచరణపై సీనియర్లంతా సమాలోచనలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment