సాక్షి ప్రతినిధి, కర్నూలు :కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరిక ఆ పార్టీలోని నేతలకే మింగుడుపడటం లేదు. ఆమె చేరికపై ప్రధానంగా కేఈ కుటుంబం అసహనంతో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే అమరావతిలో జరిగిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హాజరుకాలేదన్న ప్రచారం ఆ పార్టీలో సాగుతోంది. మరోవైపు బుట్టా చేరిక కార్యక్రమానికి హాజరు కావాలంటూ తనకు చివరి నిమిషంలో సమాచారం ఇవ్వడంపై కేఈ ప్రభాకర్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. సాధారణ ఎన్నికల్లో కర్నూలు ఎంపీ సీటుపై ఆయన కన్నేశారు. గత ఎన్నికల్లోనే సీటు ఆశించి భంగపడిన ఆయన.. వచ్చే సారీ ఇదే పరిణామం పునరావృతం కానుండటంపై కినుక వహిస్తున్నారు.
ఎంపీ బుట్టా పార్టీలో చేరడం, తమను కనీసం సంప్రదించకపోవడం వంటి పరిణామాలతో కేఈ కుటుంబం ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఎప్పటి నుంచో పార్టీనే నమ్ముకుని, కష్టకాలంలో వెన్నంటి ఉన్న తమను విస్మరించడం వారికి ఆగ్రహాన్ని తెప్పించినట్టు ఆ పార్టీ నేతలే అంటున్నారు. కాగా.. కోడుమూరు నియోజకవర్గంలో కొత్తకోట ప్రకాష్‌రెడ్డి చేరికపై కూడా ఎదురూరు విష్ణువర్దన్‌రెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు. మొదటి నుంచీ ఉప్పు నిప్పుగా ఉన్న కొత్తకోట–విష్ణు వర్గాల మధ్య ఈ పరిణామాలు మరింత దుమారం రేపుతున్నాయి.
రాజకీయంగా తెరమరుగే!
కేఈ ప్రభాకర్ గత ఎన్నికల్లో పోటీకి దిగలేదు. కర్నూలు ఎంపీ స్థానాన్ని ఆశించి భంగపడ్డారు. ఈ సీటు బీటీ నాయుడుకు ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ ఇస్తానని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారనే ప్రచారం జరిగింది. తీరా ఎమ్మెల్సీ కూడా ఇవ్వకపోవడంతో కేఈ ప్రభాకర్... పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ టీడీపీ కార్యాలయం ముందే ధర్నాకు దిగారు. ఆ తర్వాత ఆయనకు ఏపీఐడీసీ చైర్మన్ పదవి లభించింది. అయితే, ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోతే తనకు రాజకీయ భవితవ్యం ఉండదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏదో ఒక స్థానం నుంచి తప్పకుండా పోటీ చేస్తానని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన కర్నూలు ఎంపీ సీటును ఆశించారు. అయితే, తాజా పరిణామాలు మింగుడు పడటం లేదు. ఎంపీ బుట్టా రేణుక పార్టీలో చేరికపై మంగళవారం ఉదయం ఫోన్ చేసి ఆహ్వానించడంతో ఆయన మరింత మండిపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో అధికారపార్టీలో కొత్త కుంపట్లకు తెరలేసిందనే ప్రచారం జరుగుతోంది.
చేరింది టీడీపీ కార్యకర్తలే...
ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరిన సందర్భంగా చంద్రబాబు నాయుడు కండువాలు కప్పిన కార్యకర్తల్లో పలువురు ఇప్పటికే టీడీపీలో ఉండటం గమనార్హం. ఈ విధంగా సొంత పార్టీ కార్యకర్తలైన వేముగోడు మాజీ సర్పంచ్ సత్యనారాయణ స్వామి, ఆయన కుమారుడు సాయినాథ్‌తో పాటు పిల్లిగుండ్ల జయరామ్‌లను తిరిగి ఎంపీ సమక్షంలో టీడీపీలోకి చేర్చుకుంటున్నట్లు ఫొటోలకు ఫోజులివ్వడం చర్చనీయాంశమైంది. ఈ విధంగా టీడీపీ కార్యకర్తలకే పచ్చ కండువాలు వేయడం పట్ల పలువురు నవ్విపోతున్నారు.
ఫోన్ల బెడద
ఇక పార్టీ మారిన ఎంపీ బుట్టా రేణుకకు కొత్త కష్టం వచ్చిపడింది. పార్టీ మారడంపై కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలోని పలువురు ఫోన్లు చేసి మరీ మండిపడుతున్నట్టు సమాచారం. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి మారడం ఏమిటని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. తాము ఓటు వేసి గెలిపిస్తే..కనీసం చెప్పకుండానే పార్టీ ఎలా మారతారని నిలదీసినట్టు సమాచారం. ఈ ఫోన్ల బెడద తట్టుకోలేక, సమాధానం చెప్పలేక ఎంపీ కార్యాలయ సిబ్బంది కాస్తా ఇబ్బందికి గురైనట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment