పాదయాత్రపై దృష్టి మరల్చడానికే ఫిరాయింపులు | BY ramaiah fired on butta renuka | Sakshi
Sakshi News home page

పాదయాత్రపై దృష్టి మరల్చడానికే ఫిరాయింపులు

Published Wed, Oct 18 2017 7:59 AM | Last Updated on Wed, Oct 18 2017 7:59 AM

BY ramaiah fired on butta renuka

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న పాదయాత్ర నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే సీఎం చంద్రబాబు మరోసారి ఫిరాయింపులకు తెర లేపారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి విమర్శించారు. ఇందులో భాగంగానే కర్నూలు ఎంపీ బుట్టా రేణుకను మభ్యపెట్టి, విలువలను మరచి టీడీపీలో చేర్చుకున్నారని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన కర్నూలులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు.చంద్రబాబు ఆడుతున్న మైండ్‌ గేమ్‌ ప్రజలకు అర్థమైపోయిందని, వచ్చే ఎన్నికల్లో ఫిరాయింపుదారుల అడ్రెస్‌ గల్లంతు కావడం ఖాయమని అన్నారు. కన్నతల్లి లాంటి పార్టీ, సీటు ఇచ్చిన అధినేతను మోసం చేసిన ప్రజాప్రతినిధులు ప్రజల వజ్రాయుధం ఓటుకు బలికాక తప్పదని హెచ్చరించారు.

2014 ఆగస్టు 15న కర్నూలులో స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన సీఎం చంద్రబాబు ఈ జిల్లాకు 35 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అందులో ఒక్కదాన్నీ అమలు చేసిన పాపానపోలేదన్నారు. అయితే.. జిల్లాలో తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి కొనుగోలు చేశారని ధ్వజమెత్తారు. ఓర్వకల్‌ ఇండస్ట్రియల్‌ హబ్, ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్స్‌ పార్కు, ఉర్దూ యూనివర్సిటీ, కళాశాలలు, కర్నూలు స్మార్ట్‌సిటీ ఏమయ్యాయని ప్రశ్నించారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను టీడీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందన్నారు. గుండ్రేవుల, వేదావతి ప్రాజెక్టుల  నిర్మాణాలను చేపట్టలేదన్నారు. గతంలోనే 90 శాతం పూర్తయిన ముచ్చుమర్రి ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్‌ పనులను మూడున్నరేళ్లయినా పూర్తి చేయకపోవడం శోచనీయమన్నారు. నంద్యాలలో డబ్బు, అధికార దుర్వినియోగంతో గెలుపొంది వాపును బలంగా భావిస్తున్న టీడీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.  

మా నాయకుడి మనోధైర్యం సడలదు...
చంద్రబాబు ఎంతమందిని కొనుగోలు చేసినా తమ నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మనోధైర్యం సడలదని గౌరు వెంకటరెడ్డి అన్నారు.  చంద్రబాబు కంటే వయసులో చిన్నవారైనా విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారని ప్రశంసించారు. ఒక్క నాయకుడు వెళ్లిపోతే వెయ్యి మందిని తయారు చేసుకోగల శక్తి తమ పార్టీకి ఉందన్నారు. చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే తమ పార్టీ నుంచి చేర్చుకున్న ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించాలని సవాల్‌ విసిరారు.  

స్వలాభం కోసమే బుట్టా ఫిరాయింపు
అభివృద్ధి కోసమే టీడీపీతో కలసి పనిచేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక చెబుతున్న మాటల్లో వాస్తవంలేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య విమర్శించారు. స్వలాభం కోసమే ఆమె పార్టీ ఫిరాయించారన్నారు. మూడున్నరేళ్లలో అభివృద్ధి గురించి ఆలోచించని ఆమె..నాలుగైదు నెలల్లో ఏమి అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. ఆమె కుటుంబ సభ్యుల వ్యాపారాన్ని పెంచుకోవడానికే టీడీపీలోకి వెళ్లారన్నారు. కన్నతల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసిన ఆమెకు ప్రజాకోర్టులో చెంపదెబ్బ తప్పదన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఫిరాయింపు ప్రజాప్రతినిధులను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు కర్నాటి పుల్లారెడ్డి, రమణ, ఫిరోజ్‌ఖాన్, పర్ల శ్రీధర్‌రెడ్డి, యశ్వంత్, కరుణాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement