టీడీపీ నేతలకు తమ ఎన్నికల భవితవ్యం ఇప్పటికి బోధపడిన ట్లుంది...జిల్లాలో అన్నిసీట్లు గెలుస్తాం...ఇన్ని సీట్లు గెలుస్తామని ఇన్నాళ్లూ బీరాలు పలికిన తెలుగుతమ్ముళ్లకు ఎట్టకేలకు జ్ఞానోదయం అయినట్లుంది. ప్రచారపర్వంలో ఎదురవుతున్న అనుభవాలు...ఓటర్లనాడి ...తమ భవిష్యత్తును కళ్లముందుంచుతున్నాయి. జిల్లాలో టీడీపీ గెలుపు అవకాశాలు శూన్యమనే నిర్ణయానికి అభ్యర్థులు, నాయకులు వచ్చినట్లున్నారు కాబోలు ‘ఇందుకు బాధ్యులు మీరంటే...మీరే’ అని ఒకరిపై ఒకరు పరస్పర దూషణలకు దిగుతున్నారు. ఓ వైపు ప్రత్యర్థులు పక్కా ప్రణాళికతో ఎన్నికల సమరంలో దూసుకుపోతుంటే తమ నేతలు యుద్ధానికి ముందే పలాయనం చిత్తగించడంపై కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. నేతల మధ్యే సమన్వయం లేదని ఇలాంటి వారితో వెళితే భవిష్యత్తులో తిప్పలు తప్పవనే ఆలోచనకు వచ్చారు. ఈ పరిణామాలతో ఇన్నాళ్లూ ఎన్నికల రేసులో ఉన్న టీడీపీ నేతలు కళ్లెం విడిచినట్లయింది.
సాక్షి, కడప: తెలుగుదేశంపార్టీలో ఎన్నడూ లేని విచిత్రపరిస్థితి చోటు చేసుకుంది. కాంగ్రెస్‌పార్టీకీ ప్రత్యామ్నాయంగా ఇన్నాళ్లూ గట్టిపోటీ ఇచ్చిన టీడీపీ ప్రస్తుత ఎన్నికల్లో నైరాశ్యంలో మునిగిపోయింది. పార్టీకోసం శ్రమించిన వారికి కాకుండా మరొకరికి టిక్కెట్లు కేటాయించ డంలో చంద్రబాబు వేసిన తప్పటడుగు జిల్లాలో పార్టీని నిండాముంచింది.
నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల్లో ఏ ఒక్కరూ ‘మనస్ఫూర్తి’గా తమపార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయడం లేదు. బరిలోని అభ్యర్థులకు ఈ విషయం బోధపడినట్లుంది. పరిస్థితి చేయిదాటిపోయిందని, ఇలాంటి అంతర్గతపోరు మధ్య గెలవడం అసాధ్యమనే నిర్ణయానికి వచ్చారు. తమతో పాటు ఎన్నికల పడవ ఎక్కి నడిఏట్లోకి వెళ్లాక ఒంటరిని చేసి అందరూ దిగిపోవడంతో గమ్యం చేరడం అసాధ్యమనే నిర్ణయానికి వచ్చిన టీడీపీ అభ్యర్థులు బోరుమంటున్నారు. తమకు సహకరించని వారిపై దూషణలకు దిగుతున్నారు.
కడపలో తమ్ముళ్ల తగువులాట:
విశ్వసనీయత లేని రాజకీయాలకు కడప టీడీపీ చిరునామాగా నిలిచింది. బీజేపీతో పొత్తు పెట్టుకుని కడప అసెంబ్లీని బీజేపీకి ఇచ్చిన చంద్రబాబు తిరిగి టీడీపీ-బీఫారంను సుధాప్రసాద్‌కు ఇచ్చి తన నైజాన్ని చాటుకున్నారు. ఇది మరింత వివాదాన్ని రగిల్చింది. పార్టీ కోసం శ్రమించినవారు ఎందరో ఉంటే పార్టీలో సభ్యత్వం కూడా లేని ప్రసాద్‌కు టిక్కెట్టు ఇవ్వడంతో ద్వితీయశ్రేణి నేతలు గుర్రుగా ఉన్నారు. బుధవారం కడపలో బాలకృష్ణయాదవ్, సుధాప్రసాద్‌లపై శశికుమార్ ఒంటికాలిపై లేవడం, చెప్పులతో కొట్టుకునే వరకూ వెళ్లి తుపాకులు తీయడం తెలిసిందే! అయితే వార్డులో కూడా గెలవలేని బాలకృష్ణయాదవ్‌ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించి తప్పు చేశారనుకుంటే కడపలో పేరే తెలియని ప్రసాద్‌కు టిక్కెట్టు ఇచ్చి పార్టీ పరవు మంటగలిపారని, ఆ అక్కసుతోనే తాను అలా ప్రవర్తించాల్సి వచ్చిందని, ఈ విషయాన్ని తేలిగ్గా వదలనని తన అనుచరులతో శశికుమార్ చెప్పినట్లు తెలిసింది.
‘పుట్టా’ రివర్స్ గేర్!:
ధనబలంతో గెలవాలనుకున్న పుట్టాకు జ్ఞాననేత్రం తెరుచుకున్నట్లుంది. గెలుస్తాననే ధీమాతో మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాలకు డబ్బులు ఖర్చు పెడతానని పుట్టా చంద్రబాబుకు హామీ ఇచ్చిన ట్లు తెలిసింది. తీరా మైదుకూరులో తన అనుచరులతో సర్వే చేయించుకుంటే 20వేల ఓట్లతో ఓడిపోనున్నట్లు తెలిసిందని పుట్టా అనుచరుల్లో కీలక నేత ఒకరు ‘సాక్షి’కి చెప్పారు.
దీంతో ‘పుట్టా’కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ‘మైదుకూరులో తన ఓటమి ఖాయమయ్యేలా ఉందని, అదే జరిగితే తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని లేదంటే బద్వేలుకు డబ్బు మూటలు పంపను’ అని సీఎం రమేష్‌తో చెప్పినట్లు తెలిసింది. దీనికి రమేశ్ కూడా ఘాటుగానే స్పందించి ‘డీఎల్‌ను కాదని నీకు టిక్కెట్ ఇచ్చాం.. అదే గొప్ప...మళ్లీ షరతులు ఒకటా! బద్వేలుకు డబ్బులు ఇచ్చే బాధ్యత నీదే. లేదంటే నీ కథ చూస్తా!’ అని హెచ్చరించినట్లు తెలిసింది.
మాజీమంత్రి డీఎల్ వచ్చినట్లే వచ్చి ‘మొండిచేయి’చూపడం...రెడ్యం వెంకటసుబ్బారెడ్డి బయటికి ఒకలా లోపలికి మరోలా ఉంటూ వ్యవహరిస్తుండటంతో ‘పుట్టా’బోరుమంటున్నారు. ఈ పరిణామం బద్వేలుపై కూడా పడింది. భరోసా మాది అని హామీ ఇవ్వడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిన బద్వేలు అభ్యర్థి విజయజ్యోతి ‘పుట్టా’ మాటలతో షాక్ తిన్నారు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కూడా ఆర్థిక సహకారం విషయంలో వెనక్కు తగ్గడంతో విజయజ్యోతి ఆశలు ఆవిరయ్యాయి.
లింగారెడ్డీ..ఒప్పందం ‘గుట్టు’ విప్పుతా!:
ప్రొద్దుటూరులో కూడా లింగారెడ్డి, వరద మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ‘ఒప్పందం ప్రకారమే ఎమ్మెల్యే టిక్కెట్టు తనకు దక్కిందని, ఆ మేరకు తనకు మద్దతు ఇవ్వడం లేదని.. ఎన్నికల్లో తనకు అనుకూలంగా పనిచేయకపోతే టిక్కెట్ ఒప్పందంలోని గుట్టును విప్పుతా అని లింగారెడ్డితో వరద రాజులరెడ్డి ఫోన్‌లో చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. లింగారెడ్డి తీరుతో ‘వరద’కూడా గెలుపుపై ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది. రాజంపేటలో మేడామల్లికార్జునరెడ్డికి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. మేడాకు టిక్కెట్టు ఇవ్వడాన్ని టీడీపీ నేతలు స్వాగతించడం లేదు. మాజీమంత్రి బ్రహ్మయ్య కడుపులో కత్తులో పెట్టుకుని మేడాను కౌగించుకుంటుంటే...కీలకనేతలైన మోదుగులపెంచలయ్య, కృష్ణకుమార్‌లు ‘మేడా’ను వదలి మరో అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు. దీనికి తోడు మాజీ ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రెడ్డి టీడీపీని వీడటంతో ‘మేడా’కు తన భవిష్యత్తు కళ్లెదుటే సాక్షాత్కరమైంది.
పులివెందులలో ఎమ్మెల్సీ సతీశ్‌రెడ్డి వైఖరిపై రాంగోపాల్‌రెడ్డి మండిపడుతున్నారు. సతీశ్‌పార్టీలో నియంతలా వ్యవహరిస్తున్నారని, వైఖరి మారకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని అనుచరులతో చెబుతున్నట్లు తెలిసింది. తమ కుటుంబాన్ని కాదని టిక్కెట్ దక్కించుకున్న కాంగ్రెస్ అరువునేత రాయచోటి అభ్యర్థి రమేశ్‌రెడ్డికి మద్దతు ఇవ్వకూడదని మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు తన వర్గీయులకు మార్గనిర్దేశం చేస్తున్నట్లు తెలిసింది. ఈ పరిణామాలన్నీ టీడీపీ శ్రేణులను నైరాశ్యంలోకి నెడుతున్నాయి. ఎన్నికలకు ముందే ‘దేశం’ అభ్యర్థులు ఓటమిని ఊహించుకుని కుమిలిపోతూ...సహకరించని వారిపై కన్నెర్ర చేస్తున్నారు. ఈ పరిణామాలను కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.
భ్రమలు తొలగి..
Published Fri, May 2 2014 1:24 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement