న్యూఢిల్లీ: రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, టిడిపి, బిజెపి నేతలు ఢిల్లీ చేరుకున్నారు. పొత్తులు, అభ్యర్థులు ఖరారుపై మంతనాలు జరుపుతున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్తో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రసిడెంట్ ఉత్తమకుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులు, టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన చెరకు సుధాకర్లు సమావేశమయ్యారు. అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చితే ఎవరినైనా తమ పార్టీలో చేర్చుకుంటామని చెప్పారు. ఈ రోజు ఇక్కడ జరిగే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితాపై చర్చ జరుగుతుంది. ఈ చర్చలలో పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటారు.
ఇదిలా ఉండగా, బిజెపి, టిడిపి నేతలు కూడా పొత్తులు, అభ్యర్థుల విషయం చర్చించడానికి ఇక్కడకు వచ్చారు. రాష్ట్ర బీజేపీ అభ్యర్థుల జాబితాను జాతీయ నేతలకు సమర్పించేందుకు కిషన్‌రెడ్డి, వీర్రాజు, హరిబాబు వచ్చారు. ఈ రోజు సాయంత్రం జరిగే బీజేపీ జాతీయ ఎన్నికల కమిటీ సమావేశంలో వారు పాల్గొంటారు. బిజెపితో పొత్తుకు టిడిపి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీజేపీ అగ్రనేతలతో పొత్తులపై చర్చించేందుకు ఆ పార్టీ నేతలు రమణ, ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నరసింహులు, సుజనా చౌదరి ఇక్కడకు వచ్చారు. మరో పక్క చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని బిజెపి అగ్రనేతలతో ఫోన్లో మంతనాలు జరుపుతున్నారు.
పొత్తులు, అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీలో మంతనాలు
Published Mon, Mar 31 2014 12:19 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement