ఇరకాటంలో కాంగ్రెస్ టీడీపీ
Published Thu, Aug 15 2013 2:46 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి, గుంటూరు: సమైక్య ఉద్యమ నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష నేతలు ఇరకాటంలో పడుతున్నారు. కొన్ని చోట్ల చొరవ తీసుకుని ఉద్యమంలో పాల్గొంటున్నా, సమైక్యాంధ్ర ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) నేతలు, ప్రజలు సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. టీడీపీ అధినేత ఇప్పటికీ విభజనకు అనుకూలంగా మాట్లాడడం ఇక్కడ ఆ పార్టీ నాయకులను ఇరకాటంలో పడేస్తోంది. మరో వైపు సీడబ్ల్యుసీ ద్వారా విభజన ప్రకటన చేయించడం తమకు తలనొప్పిగా మారిందని జిల్లా కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో సమైక్య ఉద్యమాన్ని వైఎస్సార్ సీపీ ఆది నుంచి ముందుండి నడిపిస్తుంది. క్రమంగా ఉద్యమం ఉధృతం రూపం దాల్చింది. విద్యార్థి, ఉద్యోగ సంఘాల నిరసనలు, ఆందోళనలు పెరిగి అధికార, ప్రధాన ప్రతిపక్షాల నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. వీటిని గమనించిన కాంగ్రెస్, టీడీపీ నేతలు కొన్ని చోట్ల తామే నేరుగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. మరి కొన్ని చోట్ల ప్రత్యక్షంగా పాల్గొనలేని నాయకులు పార్టీలోని ద్వితీయ శ్రేణి వర్గాన్ని ఆ దిశగా ప్రోత్సహిస్తూనే ఉద్యమానికి దూరంగా ఉండ లేక మదన పడుతున్నారు. యూపీఏ ప్రభుత్వం ద్వారా కాకుండా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ద్వారా రాష్ట్ర విభజన ప్రకటన చేయడం తలనొప్పిగా మారిందని చెబుతున్న అధికారపార్టీ నేతలు ఉద్యమంలో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
మంత్రులు దూరం...
ఇదిలావుంటే విభజన కారణంగా సీమాంధ్రులకు అన్యాయం జరుగుతోందని ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొంటున్నారు. మరోవైపు రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్‌లు ఇది తమకు సంబంధించిన అంశమే కాదన్నట్టుగా దూరంగా ఉంటున్నారు. ఎంపీ రాయపాటి సాంబశివరావు తన పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించినా ఆయన ఇంకా విదేశీ పర్యటనలోనే వున్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజల కన్నా తమకు అధిష్టానం ఆశీస్సులే ముఖ్యమంటూ కేంద్రమంత్రులు పనబాక లక్ష్మీ, జేడీ శీలంలు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మస్తాన్‌వలి ఉద్యమం ప్రారంభమైన కొత్తలో రెండ్రోజులు ర్యాలీలు చేసి ఆ తరువాత మిన్నకుండిపోయారు. ఒకదశలో ఏపీఎన్జీవోస్ జేఏసీ ఆధ్వర్యంలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల రాజీనామాలే లక్ష్యంగా వారి వారి నివాసాలను ముట్టడించినా ఫలితం కనిపించలేదు. పైగా మంత్రి కన్నా ఉద్యోగులకే ఎదురు ప్రశ్నలేసిన సంగతి తెలిసిందే..
అయోమయంలో టీడీపీ ..
విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వడమే కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికీ విభజనకు కట్టుబడి ఉండటం ఆ పార్టీ నేతలను అయోమయంలో పడేస్తుంది. చంద్రబాబు విభజనకు వ్యతిరేకంగా మాట్లాడకుండా రాజధాని ఏర్పాటు, దానికయ్యే వ్యయం గురించి మాట్లాడుతుండటంతో ఇక్కడ తెలుగు తమ్ముళ్లు ధైర్యంగా ఉద్యమంలో పాల్గొనలేకపోతున్నారు. ప్రజలకు భయపడి కాస్త ఆలస్యంగా పదవులకు రాజీనామాలిచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం లేదు. ఆ పార్టీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ కోడెల శివప్రసాద్‌రావు, దూళిపాళ్ల నరేంద్ర, నన్నపనేని రాజకుమారి మినహా ఇతర నేతలు ఉద్యమంలో కనిపించడం లేదు. లోక్‌సభ, రాజ్యసభల్లో ఆ పార్టీ ఎంపీలు సమైక్యాంధ్రపై మాట్లాడుతుండగా, జిల్లానేతలు మాత్రం ఇప్పటికీ ప్యాకేజీల పైనే వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం. ఇలా కాంగ్రెస్, టీడీపీలు డ్రామాలాడితే రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని ఏపీఎన్‌జీవో జేఏసీ నేతలు, ప్రజాసంఘాల జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు.
Advertisement