సాక్షి, గుంటూరు: ‘అమ్మ హస్తం’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు తొమ్మిది రకాల సరుకులను రూ.189లకే అందించగా, కొత్తగా వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం రేషన్‌లో కోత విధించి పేదల పొట్టలు కొట్టింది. జిల్లాలో ఎన్నికలకు ముందే గోధుమ పిండి, జూన్ నుంచి పామాయి ల్ సరఫరా నిలిచిపోయాయి. ఆ తరువాత అక్టోబరు వరకు అరకొరగా కందిపప్పు సరఫరా జరిగినా మూడు నెలల నుంచి అదీ లేదు. పేదల రేషన్ నిలిచిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. కేవలం బియ్యం, పంచదార మాత్రమే రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తూ చేతులు దులుపుకుంటోంది.
గతంలో రంజాన్, క్రిస్మస్ పండుగలకు రేషన్ అదనపు కోటా ఇచ్చేవారు. ప్రస్తుతం అదీ లేదు. ఏదో అరకొరగా బియ్యం ఇచ్చి సరిపుచ్చుతున్నారు.
జిల్లాలో ప్రస్తుతం అన్ని రకాల రేషన్ కార్డులు కలిపి 12,72,390 ఉన్నాయి. కార్డులోని ఒక్కో యూనిట్‌కు నాలుగు కిలోల బియ్యం వంతున ఇస్తున్నారు. దీని ప్రకారం జిల్లాకు ప్రతి నెల 16,209 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయిస్తున్నారు.
పండుగ పూటా పస్తులే...
బయట మార్కెట్‌లో సరుకుల ధరలు మండుతున్నాయి. కొనాలంటే పేదలు హడలిపోతున్నారు. సబ్సిడీ ధరపై ఇచ్చే పామాయిల్, కందిపప్పు ప్రస్తుతం ఇవ్వక పోవడంతో పేదలు బయట మార్కెట్‌లో కొనలేక పచ్చడి మెతుకులతో సరిపెట్టుకుంటున్నారు.
ప్రభుత్వం స్పందించి కందిపప్పు, పామాయిల్, అదనపు కోటాగా పంచదార ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రేషన్ బియ్యంపై పౌరసరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పక్కదారి పడుతున్నాయి. కొన్ని చోట్ల రేషన్ డీలర్లు బియ్యం పంపిణీ సక్రమంగా చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నిత్యం జిల్లాలో ఎక్కడో చోట రేషన్ బియ్యం పట్టుబడుతూనే ఉన్నాయి.
పరేషన్
Published Sat, Dec 20 2014 2:00 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement