గందరగోళంలో కాంగ్రెస్, టీడీపీ క్యాడర్
Published Wed, Sep 18 2013 3:22 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి, నరసరావుపేట : పల్నాడు ప్రాంతంలో కాంగ్రెస్, టీడీపీలకు నేతలే కరువయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటివరకు గురజాల నియోజకవర్గంలోని అన్నివర్గాల ప్రజలు వైఎస్సార్‌సీపీకి మద్దతు పలుకుతుండటంతో ఒకరిద్దరు నేతలు మాత్రమే అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు దిక్కుగా ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడమే కాకుండా తెలుగువారి ఆత్మగౌరవ యాత్రంటూ గురజాల నియోజకవర్గంలోని పొందుగల నుంచి యాత్రను ప్రారంభించారు. అయితే ఈ యాత్రలో సీమాంధ్ర ప్రజలకు జరగబోయే నష్టాల గురించి గాని, వాటికి ఏవిధంగా తమ పార్టీ పరిష్కారం చూపబోతుందో చెప్పకుండా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తూ ఎన్నికల ప్రచారం మాదిరిగా యాత్రను ముగించడంతో సొంతపార్టీ నేతల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
దీనికితోడు చంద్రబాబు యాత్రను అడ్డుకుంటే పల్నాడు వదిలి ఎవ్వరూ బయటకు వెళ్లలేరంటూ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై సమైక్యవాదులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చంద్రబాబు యాత్ర ముగిసిన తరువాత గురజాల తెలుగు తమ్ముళ్ళలో అంతర్మథనం మొదలైంది. సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు, యరపతినేని వైఖరిని నిరసిస్తూ పిడుగురాళ్ళ మున్సిపాలిటీ పరిధిలోని అనేక మంది పార్టీ ముఖ్యనాయకులు పార్టీని వీడుతున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులంతా లోలోపల మదనపడుతూ పార్టీని వీడేందుకు తమ అనుచరులతో సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పరిస్థితి అధ్వానం ..
అధికార కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భావంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని ప్రజలు కాంగ్రెస్‌పార్టీని వీడి వైఎస్సార్‌సీపీకి జై కొట్టారు. అధికార పార్టీ కావడంతో కొందరు మండలస్థాయి, గ్రామస్థాయి నేతలు మాత్రం తమ అనుచరులను వైఎస్సార్‌సీపీలోకి పంపి, తాము మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీకి ఐదు పంచాయతీలు మాత్రమే దక్కాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు నేతల మధ్య అంతర్గత విభేదాలతో పార్టీ పరువు బజారునపడుతోంది.
నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా చెప్పుకుంటున్న మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి. కృష్ణారెడ్డి ఇటీవల జరిగిన పిడుగురాళ్ళ మార్కెట్‌యార్డు చైర్మన్, కమిటీ సభ్యుల నియామకాల్లో అవినీతికి పాల్పడ్డారంటూ సొంతపార్టీకి చెందిన అనేక మందినేతలు హైదరాబాద్ వెళ్లి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో పాటు ఇన్‌ఛార్జి మంత్రి టి.జి వెంకటేష్, జిల్లా మంత్రులు కాసు వెంకట కృష్ణారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాదరావులకు లిఖిత పూర్వక ఫిర్యాదులు చేశారు. టి.జి.వి కృష్ణారెడ్డి మార్కెట్ యార్డు కమిటీలో టీడీపీకి చెందిన వ్యక్తులను నిమించారని, ఇదంతా ప్యాకేజీల కోసమే జరిగిందని పేర్కొన్నారు. దీంతో అసలు కృష్ణారెడ్డికి గురజాల నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలు తాము అప్పజె ప్పలేదని బొత్స తమతో చెప్పారని మార్కెట్‌యార్డు మాజీ డెరైక్టర్లు చలువాది నారాయణ, సిద్ధారపు రామారావు, మాజీ ఎంపీపీ కొప్పుల సాంబయ్య, మాజీ సర్పంచ్ కుందేటి సాంబయ్య, సీనియర్ నాయకుడు లక్ష్మీనారాయణ సాక్షికి తెలిపారు.
Advertisement
Advertisement