ప్చ్..!
Published Mon, Apr 7 2014 1:11 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
నిన్న మొన్నటివరకు కత్తులు దూసుకొన్న వారు.. నేడు ఆలింగనాలు చేసుకుంటున్నారు. నాయకులు ఒక్క రోజులోనే సిద్ధాంతాలు మార్చుకొంటున్నారు. అంత తేలికగా పార్టీలోని కార్యకర్తలు వారి చెలిమిని ఆకలింపు చేసుకోలేక పోతున్నారు. పైపైకి పార్టీలో చేరినందుకు మురిసిపోతున్నా.. తమ భవిష్యత్తుకు అడ్డంకిగా మారుతున్న వలస నాయకులను చూసి లోలోన రగిలిపోతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకుని అష్టకష్టాలు పడుతున్న నేతలను కాదని, చేరిన మరుసటి రోజునే పార్టీలు ప్రధాన పీఠం వేయటం, ఇప్పటివరకు పార్టీలో ఎవరు లేనట్లు టిక్కెట్లు పందారం చేయడం తెలుగు తమ్ముళ్ళు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇన్నేళ్లు పార్టీని బతికించుకొన్న తమ కష్టం పరులపాలు చేయటం సబాబుకాదని వాపోతున్నారు. తిట్టిన నోటితోనే ఎలా పొగడాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారు.
కొరిటెపాడు/అరండల్‌పేట (గుంటూరు), న్యూస్‌లైన్ :కాంగ్రెస్ నేతలు తెలుగుదేశం పార్టీలో కలసిన విచిత్ర కలయిక చిత్రమిది. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీలో అసమ్మతి జ్వాలలు రగులుతున్నాయి. 1999 సార్వత్రిక ఎన్నికల అనంతరం గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని తమ భుజాలపై మోసిన రాయపాటి సోదరులు అకస్మాత్తుగా ఎన్నికల ముందు పార్టీ మారడంతో ఇప్పటివరకు వారి వలన ఇబ్బందులు పడిన తెలుగు తమ్ముళ్లు ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోన రగిలిపోతున్నారు. మరోవైపు చిత్తూరు జిల్లా నుంచి గల్లా జయదేవ్‌ను గుంటూరుకు దిగుమతి చేసి తమపై రుద్దడాన్ని తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎవరికి లబ్ధి..?
కాంగ్రెస్‌పార్టీలో కీలకంగా ఉన్న నేతలను జిల్లా ఎంపీ అభ్యర్థులుగా టీడీపీ ప్రకటించడంతో వీరితో సుపరిచయాలు ఉన్న కాంగ్రెస్ నాయకులకే తిరిగి లబ్ధి చేకూరే అవకాశాలు అధికంగా ఉన్నాయని టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల్లో ప్రచారం దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ ఆది నుంచి టీడీపీలో కొనసాగుతూ వస్తున్న వారిని పక్కనపెట్టి కాంగ్రెస్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన వారికే ఈ ఎంపీ అభ్యర్థులు పెద్ద పీట వేయడం తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తికి దారితీస్తోంది. పైకి వారితో సఖ్యతగా ఉన్నట్లు కనిపిస్తున్నా లోలోన తమ రాజకీయ భవిష్యత్తుకు వీరు గండి కొడుతున్నారన్న భావన టీడీ పీ నాయకులు, కార్యకర్తల్లో నెలకొంది. కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని 57 మండలాల్లో రెండు విడతలలో జరుగుతున్న ఎన్నికల్లో పూర్తిస్థాయిలో అభ్యర్థులను రంగంలో నిలపలేక పోయింది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీల అభ్యర్థుల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. తాజాగా తాడికొండ, పెదకూరపాడు, పొన్నూరు నియోజకవర్గాల్లో రాయపాటి సోదరులు టీడీపీకి ప్రచారం చేస్తున్నారు. అయితే అప్పటివరకు కాంగ్‌స్‌ప్రార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించిన వీరు టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడం అక్కడి ప్రజలు, కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇదే సమయంలో టీడీపీ కార్యకర్తలు సైతం వీరి ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఏదేమైనా టీడీపీలోకి వస్తున్న వలసలు భవిష్యత్తులో పార్టీకి మేలుకంటే కీడే జరిగే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Advertisement
Advertisement