అనంతపురం న్యూసిటీ: కటకటాలకు వెళ్లొచ్చినా ఈ మృగాడిలో మార్పురాలేదు. పడుపు వృత్తినే ప్రవృత్తిగా మార్చుకుని సమాజంలో చెలామణి అవుతున్నాడన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కూతురు వయసున్న అమ్మాయిలు కన్పిస్తే చాలు టక్కున వాలిపోయి వారి ఫోన్ నంబర్లను సేకరించి వ్యభిచార కూపంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. నగరపాలక సంస్థలో పనిచేసే ఈ ఉద్యోగి ఈ నెల 13న అనంతపురంలోని సాయినగర్‌లో ఓ అమ్మాయికి మాయమాటలు చెప్పి సెల్ నంబర్ సేకరించిన విషయం విదితమే.
పదేళ్ల క్రితమే కేసు నమోదు
నగరపాలక సంస్థలోని సదరు ఉద్యోగిపై పదేళ్ల క్రితమే వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అమ్మాయిలను ట్రాప్ చేసే విషయంలో జైలు జీవితం అనుభవించాడు. 2007–08లో వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఓ గుర్తు తెలియని అమ్మాయిని వాహనంలో తీసుకెళ్తూ ఉండగా పోలీసులు నిఘా ఉంచి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనమైంది. పోలీసులు ఆ ఉద్యోగితో బాధితురాలి కాళ్లు పట్టించారు. చివరకు రిమాండ్‌కు పంపారు. అప్పటి అ«ధికారులు ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు తలొగ్గి వదిలేశారు. దీన్ని అలుసుగా తీసుకుని ఆ ఉద్యోగి మళ్లీ అమ్మాయిలను ట్రాప్ చేసే పనిలో నిమగ్నమయ్యాడు.
ఇంటెలిజెన్స్ పోలీసుల విచారణ
సదరు ఉద్యోగిపై ఇంటెలిజెన్స్ పోలీసులు ఆదివారం ఆరా తీశారు. నగరపాలక సంస్థలో పని చేస్తున్న ఉద్యోగి అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న వైనం గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దీనిపై మరింత లోతుగా విచారణ చేసే దిశగా చర్యలు తీసుకోనున్నారు.
కమిషనర్ విచారణ
నగరపాలక సంస్థలోని ఉద్యోగిపై కమిషనర్ పీవీవీఎస్ మూర్తి విచారణకు ఆదేశించారు. సోమవారం ఉద్యోగిని తన ముందు హాజరుపర్చాలని కిందిస్థాయి అధికారులకు సూచించారు. దీనిపై ఉద్యోగుల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
రెడ్‌కార్పెట్
నగరపాలక సంస్థ అధికారులు ఈ ఉద్యోగికి రెడ్‌కార్పెట్ వేస్తున్నారు. ఇతని జీతం నెలకు రూ.50 వేల పైమాటే. గత కొన్నేళ్లుగా ఈయన ఒక్క పనీ చేయడం లేదు. కాలక్షేపానికి ఆఫీసుకు వచ్చి వెళ్తుంటారు. ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో పని చేయాల్సి ఉన్నా..పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఏ ఒక్క పనిలోనూ ఇతని ప్రమేయం లేదంటే అధికార పార్టీ నేతల మద్దతు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment