సాక్షి, అనంతపురం : రాష్ర్ట విభజనను అడ్డుకునేందుకు ఉద్యోగులు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇప్పటివరకు రెవెన్యూ, ఎపీ ఎన్జీఓలు ఆందోళనలు చేస్తుండగా వారికి అండగా బుధవారం నుంచి మున్సిపల్ ఉద్యోగులు కూడా సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే నగర పాలక సంస్థ ఉద్యోగులు, కార్మిక జేఏసీ నాయకులు మంగళవారం మున్సిపల్ ఇంజనీర్ శివరామిరెడ్డికి సమ్మె నోటీసు ఇచ్చారు. మున్సిపల్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తున్నందున పారిశుద్ధ్యం సమస్య నెలకొనే అవకాశం వుంది.
మంగళవారం పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులను బయటకు వెళ్లిపోవాలని రెవెన్యూ ఉద్యోగులు కోరినప్పటికీ తమ తమ స్థానాల నుంచి కదలకపోవడంతో ఆగ్రహంతో అక్కడే ఉన్న కంప్యూటర్ గది అద్దాలను పగులగొట్టారు. కొంతమంది ఉద్యోగులే ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా విధులు నిర్వర్తిస్తూ వేతనాలు తీసుకునేందుకు తహతహలాడుతున్నారని రెవెన్యూ ఉద్యోగులు ఆరోపించారు. రెవెన్యూ, ఎన్జీఓ, పౌరసరఫరాల శాఖ ఉద్యోగులంతా సమ్మెలో ఉన్నారని ఎవరికీ డ్యూటీ సర్టిఫికెట్ ఇవ్వకూడదని కలెక్టర్, జేసీ, డీఆర్వోలను కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రెవెన్యూ ఉద్యోగులు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఎస్కేయూ వద్ద ఉద్రిక్తత
సమైక్యాంధ్రకు మద్దతుగా శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ విద్యార్థులు బంద్ నిర్వహించారు. తర్వాత అనంతపురం-చెన్నై జాతీయ రహదారిని దిగ్బంధించారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఈ తోపులాటలో రమేష్ అనే విద్యార్థి స్వల్పంగా గాయపడ్డాడు. విద్యార్థులను అరెస్టు చేసి ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. విభజన బిల్లును తిరస్కరించడంలో మౌనముద్ర వహించిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
రెండుగా విడదీస్తే కాంగ్రెస్ పతనమే..
అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో ఏర్పడిన తెలుగుజాతిని తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రెండుగా విడదీస్తే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పతనం చేయాల్సిన అవసరం మనందరిపై ఉందని పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ రాచంరెడ్డి భాస్కర్‌రెడ్డి కోరారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో స్థానిక జెడ్పీ ప్రాంగణంలో ఉద్యోగులు సమైక్య నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. విభజనతో వైద్య రంగం నిర్వీర్యం అవుతుందని.. దానికి నిరసనగా డాక్టర్లు, స్టాప్‌నర్సులు, తదితర సిబ్బంది ఓపీ బ్లాక్ ఎదుట గంట పాటు ధ ర్నా నిర్వహించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు హైదరాబాద్‌లోనే ఉన్నాయని రాష్ట్రం విడిపోతే తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు.
రాష్ట్ర విభజనకు నిరసనగా వాటికి బాధ్యులైన ప్రజాప్రతినిధుల ఫొటోల ఫ్లెక్సీలను దహనం చేయడంతో పాటు పార్లమెంట్‌లో బిల్లుపెట్టే రోజు పెన్‌డౌన్ చే యడం, రాస్తారోకోలు నిర్వహించడం వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్య జేఏసీ చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. సమైక్యంగా ఉన్న తెలుగు రాష్ట్రాన్ని కేవలం ఓట్లు, సీట్లు కోసం విభజించాలనే ప్రయత్నం చేసే రాజకీయ పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులను సీమాంధ్రలో తిరగనివ్వమని గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీ. శంకర్‌నాయక్ హెచ్చరించారు.
తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడాన్ని నిరసిస్తూ ఎస్‌యూసీఐ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కళ్యాణదుర్గం, హిందూపురం మున్సిపాలిటీల్లో ఉద్యోగులు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోతే జోలె పట్టాల్సిందేనని ఇప్పటికైనా నాయకులు స్పందించి విభజనను అడ్డుకోవాలని రాయదుర్గంలో ఏపీ ఎన్జీఓలు, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో యూపీఏ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు సమ్మెలో పాల్గొన్నారు.
దద్దరిల్లిన అనంత
Published Wed, Feb 12 2014 2:04 AM | Last Updated on Tue, Oct 16 2018 6:47 PM
Advertisement
Advertisement