విభజనాగ్ని
సాక్షి, అనంతపురం : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యవాదులు గర్జిస్తున్నారు. పట్టణాలే కాదు.. పల్లెల్లోనూ స్వచ్ఛందంగా ఉద్యమిస్తున్నారు. 53వ రోజైన శనివారం కూడా జిల్లాలో ఉద్యమ సెగలు ఉవ్వెత్తున ఎగిశాయి. అనంతపురం నగరంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట రెవెన్యూ ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన.. బైక్ ర్యాలీ నిర్వహించారు.
రామన్ స్కూలు విద్యార్థులు కొవ్వొత్తుల ప్రదర్శన, స్థానిక తెలుగుతల్లి విగ్రహం వద్ద మానవహారం చేపట్టారు. సోనియా, షిండే, కేసీఆర్, దిగ్విజయ్ మాస్కులు ధరించిన విద్యార్థులు మోకాళ్లపై నిలబడగా.. తెలుగుతల్లి వేషధారణలోని విద్యార్థిని వారిని కొర డాతో కొడుతూ వినూత్న నిరసన తెలపడం నగర వాసులను ఆకట్టుకుంది. జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ లెక్చరర్స్ (జాక్‌లో) ఆధ్వర్యంలో ఖాళీ ప్లేట్లు, గ్లాసులతోనూ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు శ్రీకృష్ణ దేవరాయలు, తెలుగుతల్లి, స్వామి వివేకానంద వేషధారణతోనూ ర్యాలీలు చేశారు.
అంతకుముందు టవర్‌క్లాక్ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి... సమైక్యాంధ్రపై ఆలోచనాత్మకమైన ప్రదర్శన చేపట్టారు. ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ చేశారు. నగర పాలక సంస్థ ఉద్యోగులు స్థానిక సప్తగిరి సర్కిల్లో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. హౌసింగ్, నీటిపారుదల, పీఏసీఎస్, పంచాయతీరాజ్, పశుసంవర్ధక, రెవెన్యూ, వాణిజ్య పన్నులు, మార్కెటింగ్ శాఖల ఉద్యోగులు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్కేయూలో జేఏసీ నాయకుల రిలే దీక్షలకు ఆర్టీసీ జేఏసీ నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం విద్యార్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.
జేఎన్టీయూలో ఉద్యోగుల రిలే దీక్షలకు రిజిస్ట్రార్ హేమచంద్రారెడ్డి సంఘీభావం ప్రకటించారు. ధర్మవరంలో ‘తుఫాన్’ చిత్ర ప్రదర్శనను సమైక్యవాదులు అడ్డుకున్నారు. ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. తాడిమర్రిలో ఐసీడీఎస్ కార్యకర్తలు, ఆయాలు ర్యాలీ చేశారు. గుంతకల్లులో జేఏసీ నాయకులు హంద్రీ-నీవా కాలువలో శీర్షాసనం వేసి నిరసన తెలిపారు. ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ శ్రేణుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జేఏసీ నాయకులు కసాపురానికి పాదయాత్రగా వెళ్లి... ఆంజనేయస్వామికి 101 టెంకాయలు కొట్టారు. గుత్తిలో ఉపాధ్యాయులు ఖాళీ డబ్బాలతో ర్యాలీ చేశారు. పామిడిలో నిర్వహించిన విద్యార్థి గర్జనలో వేలాది మంది పాల్గొని జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. ఇదే పట్టణంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. హిందూపురంలో విద్యుత్ ఉద్యోగులు పచ్చిమిరప కాయలు కొరుకుతూ, సమైక్యవాదులు గుగ్గిళ్లి అమ్మి.. కేసీఆర్ వేషధారణలో బూట్ పాలీష్ చేస్తూ నిరసన తెలిపారు. ప్రైవేటు కళాశాలల విద్యార్థుల భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. కదిరిలో అమడగూరు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, కదిరి మార్కెట్ యార్డు ఉద్యోగులు, సిబ్బంది రిలే దీక్షలు చేపట్టారు. విద్యుత్ ఉద్యోగులు, ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు, ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు.
కళ్యాణదుర్గంలో మహిళలు పెద్దఎత్తున ర్యాలీ చేశారు. మడకశిరలో మార్కెట్‌యార్డు ఉద్యోగులు, జేఏసీ నాయకులు మానవహారం నిర్మించారు. రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. అమరాపురంలో ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి. పుట్టపర్తిలో జేఏసీ నాయకులు సంతలో కూరగాయలు అమ్ముతూ నిరసన తెలిపారు. ఓడీచెరువులో సమైక్యవాదులు రాస్తారోకో చేశారు. పెనుకొండలో ఉపాధ్యాయులు, పంచాయతీ కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు. జేఏసీ నాయకులు దుకాణాలు మూసివేయించి, ర్యాలీ చేశారు. పరిగిలో కొడిగెనహళ్లి గ్రామస్తులు రిలే దీక్షలు చేపట్టారు. రొద్దంలో ఉపాధ్యాయులు విద్యార్థులకు రోడ్డుపైనే పాఠాలు చెప్పారు.
కేంద్ర మంత్రులు రాజీనామా చేయకుండా.. శవాలపై చిల్లర ఏరుకుంటున్నారని రాయదుర్గంలో జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంత్రుల మాస్కులు ధరించి శ వయాత్ర నిర్వహించారు. కుమ్మర్లు, విద్యార్థులు ర్యాలీ చేశారు. అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద కుండలు తయారు చేసి నిరసన తెలిపారు. కణేకల్లులో ఏపీ ఎన్జీఓలు బెలూన్లతో ర్యాలీ చేపట్టారు. రాప్తాడులో ఉపాధ్యాయులు జాతీయ రహదారిపై అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. కనగానపల్లి, చెన్నేకొత్తపల్లిలో సమైక్యాంధ్రపై గ్రామసభలు నిర్వహించారు. ఆత్మకూరులో ఉపాధ్యాయినులు రిలేదీక్షలు చేపట్టారు. శింగనమలలో సమైక్యాంధ్రకు మద్దతుగా సర్పంచులు, కార్యదర్శులు తీర్మానం చేశారు.
బుక్కరాయసముద్రం నుంచి వందలాది మంది సమైక్యవాదులు అనంతపురానికి పాదయాత్ర చేపట్టారు. గార్లదిన్నెలో సమైక్యవాదులు ర్యాలీ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్మించారు. నార్పలలో జేఏసీ నాయకులు ర్యాలీ, తాడిపత్రిలో మహిళా జేఏసీ ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో గొడుగులతో నిరసన తెలిపారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్మించారు. కూడేరులో జేఏసీ నాయకులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో మహిళా గర్జన నిర్వహించారు.