సమ్మె షురూ!
మచిలీపట్నం, న్యూస్‌లైన్/సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన మలివిడత సమ్మె గురువారం జిల్లాలోనూ ప్రారంభమైంది. మున్సిపల్ ఉద్యోగులు జిల్లా వ్యాప్తంగా పెన్‌డౌన్ చేసి విధులను బహిష్కరించారు. మొత్తం 80 శాతం మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారని అంచనా. బందరులోని పలు ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. కలెక్టరేట్ ప్రాంగణంలోని వివిధ సంక్షేమ కార్యాలయాలు, గ్రామీణాభివృద్ధి శాఖ, ఖజానాశాఖ, పంచాయతీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయంలోని అన్ని సెక్షన్లు, డీఎస్‌వో, విద్యాశాఖ కార్యాలయాలు తెరుచుకోలేదు.
ఏపీ ఎన్జీవో నాయకులు సమ్మెలో పాల్గొనాలని కార్యాలయాలు తిరుగుతూ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. జేఏసీ తూర్పు కృష్ణా చైర్మన్ రొండి కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజించేందుకే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా వ్యతిరేకించాలని, అందుకు సహకరించని ప్రజాప్రతినిధులను రాబోయే ఎన్నికల్లో ఓడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రావి శ్రీనివాసరావు, ఎల్.వి.సూర్యకుమార్, పి.సాయికుమార్, బి.సీతారామయ్య, ఆకూరి శ్రీనివాసరావు, హుస్సేన్, తస్లీంబేగ్, శ్రీమన్నారాయణ, రాజేంద్రప్రసాద్, వి.సత్యనారాయణసింగ్, శివశంకర్, శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. చల్లపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రాస్తారోకో చేశారు. జగ్గయ్యపేట పట్టణంలో రంగుల మహోత్సవానికి తరలివచ్చిన శ్రీ తిరుపతమ్మ ఉత్సవమూర్తులకు రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం సభ్యులు వినతిపత్రం సమర్పించారు. జగ్గయ్యపేటలో మున్సిపల్ కూడలిలో ధర్నా చేసి మానవహారం చేపట్టారు.
నూజివీడు పట్టణంలోని చిన్నగాంధీబొమ్మ సెంటరులో ముత్తంశెట్టి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అఖిలపక్ష జేఏసీ రిలేదీక్షలను ప్రారంభించింది. నూజివీడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు సెంటరులో రిలేనిరాహార దీక్షలను ప్రారంభించారు. సెయింట్ థామస్ హైస్కూల్ విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి చిన్నగాంధీబొమ్మ సెంటరులో మానవహారం నిర్వహించారు. నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్‌లో సమైక్యాంధ్రకు మద్దతుగా వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. కంకిపాడు సినిమాహాలు సెంటరులో సమైక్యవాదులు రాస్తారోకో చేపట్టారు.
బెజవాడలో..
విజయవాడలో ఎన్జీవో నేతలు ఉదయం 10 గంటలకు ఇరిగేషన్ కార్యాలయానికి వెళ్లి సమ్మెలో పాల్గొనాలని ఉద్యోగులను కోరారు. అక్కడి నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లారు. జేఏసీ కన్వీనర్ ఎ.విద్యాసాగర్ నేతృత్వంలో ఉద్యోగ సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో ఈ ఆందోళనలో పాల్గొన్నారు. సబ్‌కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి సిబ్బందిని బయటకు పంపించి వేశారు. సబ్‌కలెక్టర్ హరిచందనను కలిసి సమ్మెకు సహకరించాలని కోరారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్జీవో నేతలు తాళాలు వేశారు. న్యాయవాదులు ఎడ్లబండ్లతో ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.