Machalipatanam
-
మచిలీపట్టణం తొలి మేయరు గా మహిళకు అవకాశం
-
వేడెక్కిన మున్సి‘పోల్స్’
ముమ్మరంగా అభ్యర్థుల ప్రచారం రేపు సాయంత్రంతో ప్రచారానికి తెర ఇక పంపకాలే మిగిలాయి ఓటుకు వెయ్యి అంటూ ప్రచారం మద్యం పరవళ్లు మచిలీపట్నం, న్యూస్‌లైన్ : మునిసిపల్ ఎన్నికలు ఈ నెల 30వ తేదీన జరగనున్న నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో ప్రచారానికి తెరపడనుంది. దీంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జిల్లాలో ఎనిమిది పురపాలక సంఘాల్లో 218 మంది కౌన్సిలర్లను ఎన్నుకోవాల్సి ఉంది. ఎన్నికల బరిలో 859 మంది అభ్యర్థులు ఉన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి 209 మంది, టీడీపీ నుంచి 216, కాంగ్రెస్ నుంచి 104, సీపీఎం నుంచి 19 మంది, సీపీఐ నుంచి ఏడుగురు, బీఎస్పీ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి 30, లోక్‌సత్తా నుంచి ఏడుగురు, సమైక్య తెలుగురాజ్యం నుంచి 16 మంచి, స్వతంత్రులు 248 మంది పోటీలో ఉన్నారు. గెలుపుకోసం ఆయా పార్టీల నాయకులు, అభ్యర్థులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. బంధుత్వాలు కలుపుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇంటిం టికీ తిరుగుతూ తమనే గెలిపించాలని కోరుతున్నారు. ప్రచారానికి ఇంకా రెండు రోజులే గడువు ఉండటంతో తమ బలాన్ని నిరూపించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వార్డుల్లో ఉన్న సామాజిక వర్గాలు, వారి ఓటు బ్యాంకులపై లెక్కలు తీస్తున్నారు. దూరప్రాంతాల్లో ఉన్న వారిని రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయా సామాజిక వర్గాల పెద్దలను ప్రసన్నం చేసుకుని తమకే మద్దతు తెలపాలంటూ అభ్యర్థిస్తున్నారు. ప్రతి వార్డులోనూ మైక్ ప్రచారం హోరెత్తుతోంది. ఓటు ఒక చోట ఉండి పట్టణంలో వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్న వారిని కలుసుకుని తమకే ఓటు వేయాలని ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా నగదు పంపిణీ పురపాలక సంఘాల్లోని వార్డుల్లో ఇప్పటికే ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించడం పూర్తికావడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. తమ ప్రత్యర్థి చేస్తున్న ప్రయత్నాలు తెలుసుకుని అందుకు భిన్నంగా వ్యవహరించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ప్రత్యేక ఏజెంట్లను పెట్టుకుని గుట్టుచప్పుడు కాకుండా నగదు పంపిణీ కూడా చేపట్టేరనే ప్రచారం సాగుతోంది. ఓటుకు వెయ్యి రూపాయలతో పాటు మహిళలకు చీరలు పంపిణీ చేసేందుకు అభ్యర్థులు రంగం సిద్ధం చేస్తున్నారు. నగదు పంపిణీ చేస్తూ పట్టుబడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పైకి ఏమీ తెలియనట్లుగా ఉన్నా నగదు పంపిణీ కోసం ఇప్పటికే అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ అడుగు ముందుకు వేసిన టీడీపీ నాయకులు ఓటుకు వెయి రూపాయలు ఇస్తామంటూ బాహాటంగానే ప్రచారం చేస్తుండటం గమనార్హం. నగదు పంపిణీ చేస్తున్న, చేసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థుల అనుచరుల పైనా నిఘా పెరిగింది. ఎవరు ఎటువైపు వెళుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు తదితర అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా ఓటర్లంతా తమ వైపే ఉన్నారని గెలుపు ఖాయమంటూ గోబెల్స్ ప్రచారం ప్రారంభమైంది. చీకటి పడగానే వార్డుల్లో మద్యం పరవళ్లు తొక్కుతోంది. పోటాపోటీగా అభ్యర్థులు మద్యం పంపిణీ చేస్తుండటంతో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ బ్యాలెట్లో తమ పేరు ఉన్న చోట పార్టీ గుర్తును వేసి కరపత్రాలను పంచుతున్నారు. ఫలానా నెంబరులో పేరు, గుర్తు ఉంటుందని ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఎల్వోల ద్వారా ఇప్పటికే వార్డుల్లో ఓటరు స్లిప్‌ల పంపిణీ కార్యక్రమం దాదాపు పూర్తయింది. -
ఇసుక దుమారం
ఇక మైనింగ్ పరిధిలోకి.. పర్మిట్ల బాధ్యత భూగర్భ గనుల శాఖదే జీవో 63 జారీచేసిన ప్రభుత్వం జిల్లాలో మరో నాలుగు రీచ్‌లకు అవకాశం సాక్షి, మచిలీపట్నం : ఇసుక దుమారం శిరోభారంగా మారడంతో బాధ్యతల బదలాయింపు తప్పడం లేదు. గతంలో భుగర్భ గనుల (మైనింగ్) శాఖ పర్యవేక్షణలో ఉన్న ఇసుక రీచ్‌లను తర్వాత జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పీడీల పరిధిలోకి తెచ్చారు. మళ్లీ ప్రభుత్వం ఇసుక క్వారీ బాధ్యతలు మైనింగ్ శాఖకే అప్పగిస్తూ తాజాగా జీవో జారీచేసింది. ఇకనుంచి జిల్లాలో ఇసుక క్వారీలపై పర్యవేక్షణ మళ్లీ మైనింగ్ శాఖకు ఉంటుంది. ఇసుక పర్మిట్ల జారీ, సీనరేజి వసూలు, అక్రమాల నియంత్రణ వంటి అధికారాలు ఆ శాఖకు ఉంటాయి. ఇసుక క్వారీలు గతంలో భూగర్భ, గనుల శాఖ పరిధిలో ఉండేవి. క్వారీలపై అజమాయిషీని 2012 డిసెంబర్లో డ్వామా పీడీలకు అప్పగిస్తూ ప్రభుత్వం 154 జీవో జారీచేసింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్రంలోని పలు జిల్లాల డ్వామా పీడీలు ఇసుక క్వారీల విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. రీచ్‌ల వ్యవహారంలో తమపై పని ఒత్తిడి పెరిగిందని, ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని వివాదాస్పదమవుతున్నాయని డ్వామా పీడీలు చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ర్ట్ర ప్రభుత్వం తాజాగా మైనింగ్ శాఖకు ఇసుక క్వారీల పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తూ జీవో నంబర్ 63ను ఈ నెల 23న విడుదల చేసింది. మళ్లీ సమస్యలేనా? .. పూర్వం గ్రామ పంచాయతీల పరిధిలోనే ఇసుక రీచ్‌లు నడిచేవి. ఆ తరువాత మైనింగ్‌కు వాటి పర్యవేక్షణ అప్పగించడంతో ఇసుక క్వారీ వ్యవహారం వివాదాలకు దారితీసింది. 2012కు ముందు మైనింగ్ శాఖ పర్యవేక్షణలోనే ఇసుక క్వారీలు ఉండడంతో న్యాయపరమైన, సాంకేతికపరమైన చిక్కులు వచ్చేవి. చాలా కాలంపాటు ఇసుక రీచ్‌లు తెరుచుకోకపోవడం, ఇసుకను అక్రమంగా తరలించి అధిక ధరకు అమ్ముకోవడం వంటివి జరగడంతో మైనింగ్‌శాఖ అభాసుపాలైంది. అప్పట్లో తగినంతమంది సిబ్బంది లేకపోవడంతో మైనింగ్‌శాఖ ఇసుక రీచ్‌లపై సరైన పర్యవేక్షణ చేయలేకపోయిందన్న అపవాదు ఉంది. ఈ నేపథ్యంలో సిబ్బంది ఉన్న డ్వామాకు అప్పగించారు. ఇప్పుడు డ్వామా అధికారులు చేతులెత్తేయడంతో మైనింగ్‌కు బాధ్యతలు కేటాయించడం మళ్లీ సమస్యలకు దారితీస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 26 ఇసుక రీచ్‌లకు గుర్తింపు ఉంది. నీటిపారుదల శాఖ అధీనంలో సూరాయిపాలెం, భవానీపురం, ఇబ్రహీంపట్నంలలో మూడు క్వారీలు పనిచేస్తున్నాయి. కంచికచర్ల మండలం గనిఆత్కూరు క్వారీకి కొద్ది రోజుల క్రితమే లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. ఇబ్రహీంపట్నం గుంటుపల్లి క్వారీకి గతంలోనే వేలం పాట నిర్వహించి ఎంపిక చేసినప్పటికీ సుప్రీంకోర్టు వరకు న్యాయపరమైన వివాదం నడిచింది. ఎట్టకేలకు గుంటుపల్లి క్వారీకి పాత పాటదారుడికే ఇటీవల అనుమతి ఇవ్వడంతో ఇసుక రీచ్ తెరుచుకుంది. దాములూరు, మద్దూరు, రావిరాల, వేదాద్రి ఇసుక రీచ్‌లకు అనుమతులు ఇచ్చేలా అధికారులు ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. వీటికి సంబంధించిన అనుమతులు, పర్యవేక్షణ ఇకపై మైనింగ్ శాఖ చూస్తుంది. -
సమ్మె షురూ!
మచిలీపట్నం, న్యూస్‌లైన్/సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన మలివిడత సమ్మె గురువారం జిల్లాలోనూ ప్రారంభమైంది. మున్సిపల్ ఉద్యోగులు జిల్లా వ్యాప్తంగా పెన్‌డౌన్ చేసి విధులను బహిష్కరించారు. మొత్తం 80 శాతం మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారని అంచనా. బందరులోని పలు ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. కలెక్టరేట్ ప్రాంగణంలోని వివిధ సంక్షేమ కార్యాలయాలు, గ్రామీణాభివృద్ధి శాఖ, ఖజానాశాఖ, పంచాయతీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయంలోని అన్ని సెక్షన్లు, డీఎస్వో, విద్యాశాఖ కార్యాలయాలు తెరుచుకోలేదు. ఏపీ ఎన్జీవో నాయకులు సమ్మెలో పాల్గొనాలని కార్యాలయాలు తిరుగుతూ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. జేఏసీ తూర్పు కృష్ణా చైర్మన్ రొండి కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజించేందుకే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా వ్యతిరేకించాలని, అందుకు సహకరించని ప్రజాప్రతినిధులను రాబోయే ఎన్నికల్లో ఓడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రావి శ్రీనివాసరావు, ఎల్.వి.సూర్యకుమార్, పి.సాయికుమార్, బి.సీతారామయ్య, ఆకూరి శ్రీనివాసరావు, హుస్సేన్, తస్లీంబేగ్, శ్రీమన్నారాయణ, రాజేంద్రప్రసాద్, వి.సత్యనారాయణసింగ్, శివశంకర్, శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. చల్లపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రాస్తారోకో చేశారు. జగ్గయ్యపేట పట్టణంలో రంగుల మహోత్సవానికి తరలివచ్చిన శ్రీ తిరుపతమ్మ ఉత్సవమూర్తులకు రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం సభ్యులు వినతిపత్రం సమర్పించారు. జగ్గయ్యపేటలో మున్సిపల్ కూడలిలో ధర్నా చేసి మానవహారం చేపట్టారు. నూజివీడు పట్టణంలోని చిన్నగాంధీబొమ్మ సెంటరులో ముత్తంశెట్టి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అఖిలపక్ష జేఏసీ రిలేదీక్షలను ప్రారంభించింది. నూజివీడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు సెంటరులో రిలేనిరాహార దీక్షలను ప్రారంభించారు. సెయింట్ థామస్ హైస్కూల్ విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి చిన్నగాంధీబొమ్మ సెంటరులో మానవహారం నిర్వహించారు. నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్లో సమైక్యాంధ్రకు మద్దతుగా వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. కంకిపాడు సినిమాహాలు సెంటరులో సమైక్యవాదులు రాస్తారోకో చేపట్టారు. బెజవాడలో.. విజయవాడలో ఎన్జీవో నేతలు ఉదయం 10 గంటలకు ఇరిగేషన్ కార్యాలయానికి వెళ్లి సమ్మెలో పాల్గొనాలని ఉద్యోగులను కోరారు. అక్కడి నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లారు. జేఏసీ కన్వీనర్ ఎ.విద్యాసాగర్ నేతృత్వంలో ఉద్యోగ సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో ఈ ఆందోళనలో పాల్గొన్నారు. సబ్‌కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి సిబ్బందిని బయటకు పంపించి వేశారు. సబ్‌కలెక్టర్ హరిచందనను కలిసి సమ్మెకు సహకరించాలని కోరారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్జీవో నేతలు తాళాలు వేశారు. న్యాయవాదులు ఎడ్లబండ్లతో ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.