వేడెక్కిన మున్సి‘పోల్స్’
- ముమ్మరంగా అభ్యర్థుల ప్రచారం
- రేపు సాయంత్రంతో ప్రచారానికి తెర
- ఇక పంపకాలే మిగిలాయి
- ఓటుకు వెయ్యి అంటూ ప్రచారం
- మద్యం పరవళ్లు
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : మునిసిపల్ ఎన్నికలు ఈ నెల 30వ తేదీన జరగనున్న నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో ప్రచారానికి తెరపడనుంది. దీంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జిల్లాలో ఎనిమిది పురపాలక సంఘాల్లో 218 మంది కౌన్సిలర్లను ఎన్నుకోవాల్సి ఉంది. ఎన్నికల బరిలో 859 మంది అభ్యర్థులు ఉన్నారు.
వైఎస్సార్ సీపీ నుంచి 209 మంది, టీడీపీ నుంచి 216, కాంగ్రెస్ నుంచి 104, సీపీఎం నుంచి 19 మంది, సీపీఐ నుంచి ఏడుగురు, బీఎస్పీ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి 30, లోక్‌సత్తా నుంచి ఏడుగురు, సమైక్య తెలుగురాజ్యం నుంచి 16 మంచి, స్వతంత్రులు 248 మంది పోటీలో ఉన్నారు. గెలుపుకోసం ఆయా పార్టీల నాయకులు, అభ్యర్థులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు.
బంధుత్వాలు కలుపుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇంటిం టికీ తిరుగుతూ తమనే గెలిపించాలని కోరుతున్నారు. ప్రచారానికి ఇంకా రెండు రోజులే గడువు ఉండటంతో తమ బలాన్ని నిరూపించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వార్డుల్లో ఉన్న సామాజిక వర్గాలు, వారి ఓటు బ్యాంకులపై లెక్కలు తీస్తున్నారు.
దూరప్రాంతాల్లో ఉన్న వారిని రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయా సామాజిక వర్గాల పెద్దలను ప్రసన్నం చేసుకుని తమకే మద్దతు తెలపాలంటూ అభ్యర్థిస్తున్నారు. ప్రతి వార్డులోనూ మైక్ ప్రచారం హోరెత్తుతోంది. ఓటు ఒక చోట ఉండి పట్టణంలో వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్న వారిని కలుసుకుని తమకే ఓటు వేయాలని ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా నగదు పంపిణీ
పురపాలక సంఘాల్లోని వార్డుల్లో ఇప్పటికే ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించడం పూర్తికావడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. తమ ప్రత్యర్థి చేస్తున్న ప్రయత్నాలు తెలుసుకుని అందుకు భిన్నంగా వ్యవహరించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ప్రత్యేక ఏజెంట్లను పెట్టుకుని గుట్టుచప్పుడు కాకుండా నగదు పంపిణీ కూడా చేపట్టేరనే ప్రచారం సాగుతోంది. ఓటుకు వెయ్యి రూపాయలతో పాటు మహిళలకు చీరలు పంపిణీ చేసేందుకు అభ్యర్థులు రంగం సిద్ధం చేస్తున్నారు. నగదు పంపిణీ చేస్తూ పట్టుబడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పైకి ఏమీ తెలియనట్లుగా ఉన్నా నగదు పంపిణీ కోసం ఇప్పటికే అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ అడుగు ముందుకు వేసిన టీడీపీ నాయకులు ఓటుకు వెయి రూపాయలు ఇస్తామంటూ బాహాటంగానే ప్రచారం చేస్తుండటం గమనార్హం. నగదు పంపిణీ చేస్తున్న, చేసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థుల అనుచరుల పైనా నిఘా పెరిగింది. ఎవరు ఎటువైపు వెళుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు తదితర అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
అంతటితో ఆగకుండా ఓటర్లంతా తమ వైపే ఉన్నారని గెలుపు ఖాయమంటూ గోబెల్స్ ప్రచారం ప్రారంభమైంది. చీకటి పడగానే వార్డుల్లో మద్యం పరవళ్లు తొక్కుతోంది. పోటాపోటీగా అభ్యర్థులు మద్యం పంపిణీ చేస్తుండటంతో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ బ్యాలెట్‌లో తమ పేరు ఉన్న చోట పార్టీ గుర్తును వేసి కరపత్రాలను పంచుతున్నారు. ఫలానా నెంబరులో పేరు, గుర్తు ఉంటుందని ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఎల్‌వోల ద్వారా ఇప్పటికే వార్డుల్లో ఓటరు స్లిప్‌ల పంపిణీ కార్యక్రమం దాదాపు పూర్తయింది.