విశ్వసనీయతకే | vote for real leaders | Sakshi
Sakshi News home page

విశ్వసనీయతకే

Published Sun, Mar 30 2014 3:21 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

vote for real leaders

సాక్షి, ఒంగోలు: పురపాలక ఎన్నికలు జిల్లావ్యాప్తంగా ఆదివారం ఆరు మున్సిపాలిటీల్లో జరుగుతున్నాయి. చీరాల, మార్కాపురం, అద్దంకి, చీమకుర్తి, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 141 వార్డుల్లో పోలింగ్ జరగనుంది.  మొత్తం 590 మంది అభ్యర్థుల తలరాతను 2.12 లక్షల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు.

అన్నిచోట్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పూర్తి స్థాయిలో తలపడుతుండగా, కాంగ్రెస్ మాత్రం కొన్ని వార్డులకే పరిమితమైంది. జిల్లావ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న పట్టణాల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఉన్నంత ధీమా మిగిలిన పక్షాల్లో కనిపించడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ వ్యూహాన్ని ఛేదించాలని టీడీపీ నాయకత్వం విశ్వప్రయత్నం చేస్తోంది. అయితే, వర్గాలపోరు దానికి అడ్డంకిగా మారింది.
 
మార్కాపురం, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి మున్సిపాలిటీల్లో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ బలమైన రాజకీయ వ్యూహాలు ప్రయోగిస్తుండగా... కాంగ్రెస్ చతికిలపడింది.  చీరాల, గిద్దలూరులో మాత్రం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఆమంచి కృష్ణమోహన్, అన్నా రాంబాబు వ్యక్తిగత ప్రాబల్యంతో పావులు కదుపుతున్నారు.  రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులే ఫలితాలను నిర్దేశించే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని పక్షాల నాయకులు ప్రలోభాల వల విసురుతున్నా.. అది పారకపోవచ్చని తెలుస్తోంది. ‘నాయకులు పార్టీలు మారినా... వారి మొఖాలేమీ మారలేదు కదా...అలాంటి వారిని ఎలా ఆదరిస్తాం..రాష్ట్రం విడిపోయింది.
 
అడ్డగోలు విభజనకు అనుకూలంగా పనిచేసిన వారిని.. రెండుమూడు కళ్ల సిద్ధాంతమంటూ హడావుడి చేసేవారిని గెలిపించే ప్రసక్తే లేదు. మా భవిష్యత్‌ను బాగుచేసే వారినే ఈసారి ఎన్నుకుంటామని ’ కొందరు మహిళలు ‘సాక్షి’ కి చెప్పారు. ఈసారి ఏఅంశానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న ప్రశ్నకు వారి సమాధానం చాలా స్పష్టంగానే ఉంది. పైగా ప్రలోభాలను అస్సలు పట్టించు కోలేదని చాలామంది స్పష్టంగా చెప్పారు. డబ్బులున్న వారు పంచనివ్వండి..దానివల్ల ఓటరు మనసేమీ మారిపోదంటూ.. కుండబద్దలు కొట్టారు.
 
పట్టణాన్ని బాగుచేయించడం.. భవిష్యత్‌కు మంచిమార్గం వేయడం.. వీటినే మేం చూస్తున్నామంటూ కొంతమంది ఓటర్లు స్పష్టం చేశారు. అన్నిచోట్లా నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యేలు ఆమంచి, అన్నా రాంబాబు స్వతంత్రులను పెట్టి ఎన్నికల రాజకీయం నడిపిస్తున్నా.. వారి నిర్ణయాల విషయంలో ఏర్పడిన ప్రతిష్టంబనతో వర్గవిభేదాల ప్రభావం ఆయా స్వతంత్ర అభ్యర్థులపై స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని ఎంతవరకు అధిగమిస్తారనేది వేచిచూడాలి.
 
వైఎస్సార్ కాంగ్రెస్ ఇలా..
ఎన్నికలు జరుగుతున్న ఆరు మున్సిపాలిటీల్లోనూ అన్ని వార్డులును గెలుచుకుంటామని ఆపార్టీ ఎల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ ధీమా వ్యక్తంచేశారు. వారిద్దరితో పాటు ఇతర నియోజకవర్గాల సమన్వయకర్తలంతా స్థానికంగా మకాం వేశారు. కొన్ని మున్సిపాలిటీల వార్డుల్లో నెలకొన్న ఇబ్బందులను పరిష్కరించడంతో పాటు.. ప్రత్యర్థులు బలంగా ఉన్నచోట ప్రత్యేక వ్యూహం అవలంబించారు. కాంగ్రెస్‌కు బలమైన ప్రాంతాల్లో ఆపార్టీకి అభ్యర్థులు లేరు.
 
టీడీపీని వీడని వర్గపోరు..
ప్రస్తుత పురపాలక అభ్యర్థుల బాధ్యతలను టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ చూస్తున్నారు. అభ్యర్థుల ఎంపికతో పాటు బీఫారాలు ఇవ్వడం, ఇతర అంశాలన్నీ ఆయన పర్యవేక్షణలోనే జరిగాయి. ఈ క్రమంలో కొందరు నాయకులను పక్కనబెట్టడంతో.. వారంతా అసంతృప్తికి లోనయ్యారు. తమ వర్గమంటూ ఉన్న అభ్యర్థులను తప్పిస్తే.. మిగిలిన వారి విషయంలో పెద్దగా పనిచేయడం లేదన్న ప్రచారం ఉంది. మిగిలిన నాయకుల్లో ఒకరిని ప్రచారానికి పిలిస్తే.. మిగిలిన వారు దూరమవుతారనే ఆలోచనతో అభ్యర్థులు వ్యక్తిగత ప్రచారానికే పరిమితమయ్యారు. అన్నిచోట్లా ఆ పార్టీ ప్రచారం నామమాత్రంగానే సాగింది.
 
కాంగ్రెస్ ఓటుతో..
కాంగ్రెస్ ఓటుబ్యాంకు చెల్లాచెదురైంది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి నాలుగైదు చోట్ల మాత్రం అభ్యర్థులను గట్టిపోటీకి నిలబెట్టారు. కొన్నిచోట్ల స్వతంత్ర అభ్యర్థులు చీల్చేఓట్లతో కాంగ్రెస్, టీడీపీలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని రాజకీయ వర్గాల విశ్లేషణ. ఆదినుంచి ఓటర్లతో మమేకమవుతోన్న వైఎస్సార్ కాంగ్రెస్ విజయఢంకా మోగించనున్నట్లు ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement