మున్సిపల్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు
హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. చైర్మన్, మేయర్ అభ్యర్థులుగా ప్రచారం చేసుకున్న చాలామంది ఓడిపోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య హోరాహోరి పోరు నడుస్తోంది. సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ- టీడీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యం సాధించింది. 20 వార్డులకు గాను 18 చోట్ల వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. 50 డివిజన్లున్న కడప నగరపాలక సంస్థలో 15 చోట్ల వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. తుని, పులివెందుల, ఆముదాలవలస, చిలకలూరిపేట, ఇచ్చాపురం మున్సిపాలిటీలు వైఎస్ఆర్ సీపీ వశమయ్యాయి.
దేవరకొండ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, కౌన్సిలర్‌గా పోటీ చేసిన రమవత్ లాలూ నాయక్ ఓటమి పాలయ్యారు. దేవరకొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైంది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు ఫలితం టై అయింది. 20 వార్డులున్న గొల్లప్రోలు మున్సిపాలిటీలో 10 వార్డులు వైఎస్ఆర్ సీపీ, 10 వార్డుల్లో టీడీపీ విజయం సాధించింది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో 12 చోట్ల కనివిని ఎరగని రీతిలో బీఎస్పీ విజయం సాధించింది. 23 వార్డుల్లున్న భైంసాలో 12 చోట్ల ఎంఐఎం గెలిచింది. భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకుంది.