సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘వదినమ్మా.. జిల్లాలో గెలిస్తే మేం గెలవాలి. లేదంటే మీరు. వేరొకరు ఆధిపత్యం చెలాయించేందుకు వీల్లేదు. మీరు పోటీ చేసే చోట మా పార్టీ అభ్యర్థి గెలవకుండా చూస్తాం. మేము పోటీ చేసే చోట కూడా మీ అభ్యర్థిని బలహీనపర్చాలి.’’ ఇదీ జిల్లాలోని రెండు కుటుంబాల మధ్య కుదిరిన ఒప్పందం. ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పలు చోట్ల కాంగ్రెస్, టీడీపీ నేతలు కుమ్మక్కవడం ఇందుకు బలం చేకూరుస్తోంది.
ఆదోని మున్సిపాలిటీలోని 34వ వార్డులో టీడీపీ శ్రేణులు కాంగ్రెస్‌కు.. 21, 29వ వార్డుల్లో కాంగ్రెస్ వర్గీయులు టీడీపీకి ఒటేసేలా ఒప్పందం చేసుకున్నారు. డోన్‌లో శనివారం రాత్రి టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఒక్కటై మున్సిపాలిటీ కైవసానికి తెరచాటు బాగోతం నడిపారు. ఆ మేరకు పలు వార్డుల్లో పరస్పరం సహకరించుకున్నారు. ఇదే ఒప్పందం అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగేందుకు నిశ్చయించుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ రెండు కుటుంబాల ముఖ్య నాయకులు తమ సహచరులతో రహస్య సమావేశాలు నిర్వహించినట్లు తెలిసింది.
రెండు మూడు రోజుల్లో కర్నూలులోని ఓ హోటల్లో మరోసారి వీరు సమావేశం కానున్నట్లు సమాచారం. జిల్లాలో కొన్నేళ్లుగా ఈ రెండు కుటుంబాల ఆధిపత్యం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్, టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వీరికి రానున్న ఎన్నికలు చావోరేవో అన్నట్లు మారాయి. ఫలితాలు అటుఇటు అయితే రాజకీయ సన్యాసం తప్పదని వీరికి బెంగ పట్టుకుంది.
ఈ కారణంగానే పరస్పర ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రెండు కుటుంబాలకు మరో పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు మధ్యవర్తిత్వం నెరుపుతున్నారు. త్వరలో మరో విడత భేటీకి నంద్యాల డివిజన్ పరిధిలోని కాంగ్రెస్, టీడీపీకి చెందిన మరో ఇద్దరు నాయకులు హాజరు కానున్నారు.
ఆ ప్రాంతంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టేందుకు వీరు సమావేశమవుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఆ కుటుంబాలు మాత్రమే అధికారంలో ఉండాలని.. మరొకరికి అవకాశం ఇవ్వకూడదనే పట్టుదలతో వీరు రాజకీయం చేస్తుండటం గమనార్హం.
కొత్త అభ్యర్థులకు మద్దతిస్తున్నట్లు నటిస్తూనే భారీగా డబ్బు ఖర్చు చేయించడం.. చివరకు ద్వితీయ శ్రేణులు సహకరించనందుకే ఓటమిపాలైనట్లు నమ్మబలికేందుకు ప్రణాళిక రచించినట్లు తెలిసింది. ఇటీవల జిల్లాలో కొత్తగా రాజకీయాల్లోకి రావాలని భావించిన ఓ వ్యక్తిపై భౌతిక దాడికి పాల్పడటం ఆ కుటుంబ నైజాన్ని బయటపెట్టింది.వీరిరువురి ఒప్పందం ఏ పరిణామాలకు దారి తీస్తుందోనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఓటమి భయం.. చీకటి ఒప్పందం
Published Mon, Mar 31 2014 11:53 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement