ఇసుక దుమారం
- ఇక మైనింగ్ పరిధిలోకి..
- పర్మిట్ల బాధ్యత భూగర్భ గనుల శాఖదే
- జీవో 63 జారీచేసిన ప్రభుత్వం
- జిల్లాలో మరో నాలుగు రీచ్‌లకు అవకాశం
సాక్షి, మచిలీపట్నం : ఇసుక దుమారం శిరోభారంగా మారడంతో బాధ్యతల బదలాయింపు తప్పడం లేదు. గతంలో భుగర్భ గనుల (మైనింగ్) శాఖ పర్యవేక్షణలో ఉన్న ఇసుక రీచ్‌లను తర్వాత జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పీడీల పరిధిలోకి తెచ్చారు. మళ్లీ ప్రభుత్వం ఇసుక క్వారీ బాధ్యతలు మైనింగ్ శాఖకే అప్పగిస్తూ తాజాగా జీవో జారీచేసింది. ఇకనుంచి జిల్లాలో ఇసుక క్వారీలపై పర్యవేక్షణ మళ్లీ మైనింగ్ శాఖకు ఉంటుంది. ఇసుక పర్మిట్ల జారీ, సీనరేజి వసూలు, అక్రమాల నియంత్రణ వంటి అధికారాలు ఆ శాఖకు ఉంటాయి.
ఇసుక క్వారీలు గతంలో భూగర్భ, గనుల శాఖ పరిధిలో ఉండేవి. క్వారీలపై అజమాయిషీని 2012 డిసెంబర్‌లో డ్వామా పీడీలకు అప్పగిస్తూ ప్రభుత్వం 154 జీవో జారీచేసింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్రంలోని పలు జిల్లాల డ్వామా పీడీలు ఇసుక క్వారీల విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. రీచ్‌ల వ్యవహారంలో తమపై పని ఒత్తిడి పెరిగిందని, ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని వివాదాస్పదమవుతున్నాయని డ్వామా పీడీలు చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ర్ట్ర ప్రభుత్వం తాజాగా మైనింగ్ శాఖకు ఇసుక క్వారీల పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తూ జీవో నంబర్ 63ను ఈ నెల 23న విడుదల చేసింది.
మళ్లీ సమస్యలేనా? .. పూర్వం గ్రామ పంచాయతీల పరిధిలోనే ఇసుక రీచ్‌లు నడిచేవి. ఆ తరువాత మైనింగ్‌కు వాటి పర్యవేక్షణ అప్పగించడంతో ఇసుక క్వారీ వ్యవహారం వివాదాలకు దారితీసింది. 2012కు ముందు మైనింగ్ శాఖ పర్యవేక్షణలోనే ఇసుక క్వారీలు ఉండడంతో న్యాయపరమైన, సాంకేతికపరమైన చిక్కులు వచ్చేవి.
చాలా కాలంపాటు ఇసుక రీచ్‌లు తెరుచుకోకపోవడం, ఇసుకను అక్రమంగా తరలించి అధిక ధరకు అమ్ముకోవడం వంటివి జరగడంతో మైనింగ్‌శాఖ అభాసుపాలైంది. అప్పట్లో తగినంతమంది సిబ్బంది లేకపోవడంతో మైనింగ్‌శాఖ ఇసుక రీచ్‌లపై సరైన పర్యవేక్షణ చేయలేకపోయిందన్న అపవాదు ఉంది. ఈ నేపథ్యంలో సిబ్బంది ఉన్న డ్వామాకు అప్పగించారు. ఇప్పుడు డ్వామా అధికారులు చేతులెత్తేయడంతో మైనింగ్‌కు బాధ్యతలు కేటాయించడం మళ్లీ సమస్యలకు దారితీస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో 26 ఇసుక రీచ్‌లకు గుర్తింపు ఉంది.
నీటిపారుదల శాఖ అధీనంలో సూరాయిపాలెం, భవానీపురం, ఇబ్రహీంపట్నంలలో మూడు క్వారీలు పనిచేస్తున్నాయి.
కంచికచర్ల మండలం గనిఆత్కూరు క్వారీకి కొద్ది రోజుల క్రితమే లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు.
ఇబ్రహీంపట్నం గుంటుపల్లి క్వారీకి గతంలోనే వేలం పాట నిర్వహించి ఎంపిక చేసినప్పటికీ సుప్రీంకోర్టు వరకు న్యాయపరమైన వివాదం నడిచింది. ఎట్టకేలకు గుంటుపల్లి క్వారీకి పాత పాటదారుడికే ఇటీవల అనుమతి ఇవ్వడంతో ఇసుక రీచ్ తెరుచుకుంది.
దాములూరు, మద్దూరు, రావిరాల, వేదాద్రి ఇసుక రీచ్‌లకు అనుమతులు ఇచ్చేలా అధికారులు ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. వీటికి సంబంధించిన అనుమతులు, పర్యవేక్షణ ఇకపై మైనింగ్ శాఖ చూస్తుంది.