► విజయవాడ బెంజి సర్కిల్‌లో ఏర్పాట్లు
► ఉదయం 11 గంటలకు ప్రజలతో చంద్రబాబు ప్రతిజ్ఞ
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బెంజి సర్కిల్ వద్ద ‘నవ నిర్మాణ దీక్ష’ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 13 జిల్లాల నుంచి ప్రజలను సమీకరించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 12 వరకు నవ నిర్మాణ దీక్ష జరుగుతుంది.
ప్రజలతో ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ
నవ్యాంధ్ర నిర్మాణంలో మేమంతా భాగస్తులమవుతామంటూ రాష్ట్ర ప్రజలతో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ చేయిస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రజల కోసం తగిన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేస్తోంది.
వేదికకు చేరుకునేది ఇలా..
హైదరాబాద్ వైపు నుంచి స్వరాజ్యమైదానం మీదగా వేదిక వద్దకు వచ్చే వాహనాలను డీవీ మేనర్ వరకు, మచిలీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలను ఎన్టీఆర్ విగ్రహం వరకు, చెన్నై, గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలను పకీరుగూడెం జంక్షన్ వరకు, ఏలూరు, గన్నవరం నుంచి వచ్చే వాహనాలను నిర్మలా కాన్వెంట్ వరకు అనుమతిస్తారు. అక్కడ నుంచి సభాస్థలికి ప్రజలు నడిచి రావాల్సి ఉంటుంది. ఆయా ప్రదేశాలకు దగ్గరలోనే వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించారు.
మిట్టమధ్యాహ్నం.. మండుటెండలో..
గత ఏడాది జూన్ 2న జరిగిన నవ నిర్మాణ దీక్షను తలుచుకుని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఒక వైపు నిప్పులు చెరిగే ఎండ.. మరో వైపు మిట్టమధ్యాహ్నం దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు విలవిలలాడారు. మంచినీటి కోసం తహతహలాడారు. ఈ ఏడాది కూడా అందుకు భిన్నంగా జరగకపోవచ్చని అధికారులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. తెల్లవారుజాము 4 నుంచి 12 గంటల వరకు ట్రాఫిక్‌ను నగరంలోకి రానీయకుండా అడ్డుకుంటారు.
నవ నిర్మాణ దీక్ష వారోత్సవాలు..
జూన్ 2 నుంచి 8వ తేదీ వరకు నవ నిర్మాణ దీక్ష వారోత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రచార పాటలతో వారం రోజు ల పాటు రాష్ట్రాన్ని హోరెత్తించనున్నారు. జూన్ 3 నుంచి 7వ తేదీ వరకు నియోజకవర్గ కేంద్రా ల్లో వివిధ అంశాలపై సదస్సులు నిర్వహిస్తారు.
నేడు నవ నిర్మాణ దీక్ష
Published Thu, Jun 2 2016 1:12 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement