తెలుగు జాతిరెండు ముక్కలు
- విభజన పూర్తి
- ఆంధ్రప్రదేశ్ నుంచి విడివడిన తెలంగాణ
- 8న రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం
- రాజధాని కోసం ఎదురుచూపులు
అక్షరక్రమంలోనే కాదు.. అన్నింటా ముందువరుసలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. దేశంలోని ముఖ్య రాష్ట్రాల్లో ఒకటి.. దేశ రాజకీయాలను శాసించే సత్తాగల రాష్ట్రమిది.. ఆర్థికంగా, సామాజికంగా నంబర్ వన్ స్థానంలో ఉన్న రాష్ట్రాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్.. ఇలా ఇప్పటి వరకు గొప్పగా.. గర్వంగా చెప్పుకొన్న మాటలు ఇకమీదట చెప్పుకోలేం. ఇప్పుడు రాష్ట్రం రెండు ముక్కలైంది. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో దేశంలోనే తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ నిలువునా చీలిపోయింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది. కొన్నాళ్లుగా ఈ పరిణామాలను నిశ్శబ్దంగానే గమనిస్తూ వచ్చిన జిల్లావాసులు మాత్రం స్తబ్దుగానే ఉన్నారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ : రాష్ట్ర విభజన ఘట్టం ముగిసింది. తెలుగు జాతి అధికారికంగా రెండు ముక్కలు అయ్యింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడిన తెలంగాణ 29వ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. రెండు రాష్ట్రాలకు రెండు ప్రభుత్వాలు ఏర్పడనున్నాయి. తెలంగాణ అంతటా సోమవారం ఆవిర్భావ దినోత్సవం జరుపుకొంటుంటే, ఆంధ్రప్రదేశ్‌లో స్తబ్దత నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఈ నెల ఎనిమిదిన విజయవాడ - గుంటూరు మధ్య నాగార్జునా యూనివర్సిటీ వద్ద ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. అప్పటి వరకు ఈ ప్రాంతంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది.
మూల్యం చెల్లించుకున్న కాంగ్రెస్...
తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్ల కోసం ఎనిమిది కోట్ల తెలుగువారిని కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలు చేసింది. తెలుగుజాతికి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని మంటగలిపింది. భావోద్వేగాల కోసం రాష్ట్రాలు ఏర్పాటు చేయకూడదన్న ఇందిరా గాంధీని మాటలను కూడా గంగలో కలిపింది. ‘రాష్ట్రం విడిపోదు.. మాకు స్టార్ బ్యాట్స్‌మెన్ ఉన్నాడు’ అన్న పార్లమెంట్ సభ్యుడు రాజగోపాల్ ధీమాకు గండి కొట్టింది. దీంతో ఆయన తాను ముందుగా చెప్పిన ప్రకారం రాజకీయ సన్యాసం స్వీకరించక తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ కుటిల యత్నాలకు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలు వంత పాడాయి.
తెలుగుజాతిని రెండుగా చీల్చడానికి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ప్రధాన భూమిక పోషించాయి. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం మాత్రమే నిబద్ధతతో పోరాడాయి. నిన్నటి వరకు సీమాంధ్రకు న్యాయం చేయాలంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పిన బీజేపీ నేతలు... నేడు తెలంగాణ ఇవ్వడంలో తమ వాటానే ఎక్కువని నిస్సిగ్గుగా చెప్పుకొంటూ సీమాంధ్ర ప్రజల్ని రోడ్డున పడేశారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకుండా చేశారు సీమాంధ్ర ప్రజలు. రాష్ట్ర విభజన జరిగిపోయిన నేపథ్యంలో ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది.
హామీల అమలుపైనే ఆశలు...
విభజన ప్రక్రియ అనంతరం రాష్ట్రానికి కేంద్రం ఇస్తానన్న హామీల అమలుపైనే జిల్లా వాసులు ఆశ పెట్టుకున్నారు. రాష్ట్రంలో జాతీయస్థాయి ప్రాధాన్యమున్న ఐఐటీ, నిట్, ఐఐఎం, ఐఐఎస్‌ఐఆర్, సెంట్రల్ యూనివర్సిటీ వంటివి జిల్లాకు వచ్చే విధంగా స్థానిక నేతలు కృషిచేయాలని డిమాండ్ పెరుగుతోంది. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ వంటి బోధనా సంస్థలను తీసుకురావాలనే డిమాండ్ పెరుగుతోంది. గన్నవరం విమానాశ్రయం స్థాయిని పెంచేందుకు కృషిచేయాలనేది స్థానికుల ఆకాంక్ష. కొత్త రైల్వే జోన్‌తో పాటు మెట్రో రైలు వ్యవస్థ ఏర్పాట్లను నెరవేరిస్తే.. రాష్ట్ర విభజనతో దెబ్బతిన్న జిల్లా వాసుల మనోభావాలు కొంత కుదుటపడే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మౌనంగా బెజవాడ...
దేశవ్యాప్తంగా ఏ సంఘటన జరిగినా స్పందించే విజయవాడ నగరం అన్యాయంగా జరిగిన విభజనను చూస్తూ మౌనంగా ఉండిపోయింది. జూన్ రెండో తేదీ అపాయింటెడ్ డే ప్రకటన జారీ అయినప్పటినుంచి విభజన ప్రక్రియ అంశాలను జిల్లా వాసులు నిశ్శబ్దంగా పరిశీలిస్తున్నారు. ఒకపక్క రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు పదవీ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తుండగా, మరోవైపు ఈ ప్రక్రియ ఏవిధంగా జరుగుతోంది.. ఎవరి పర్యవేక్షణలో జరుగుతోందనే అంశాలను పరిశీలిస్తున్నారు.
విభజనలో ముఖ్య ఘట్టాలు...
2009 డిసెంబర్ తొమ్మిదిన అప్పటి హోంమంత్రి చిదంబరం రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలైందంటూ ప్రకటన చేశారు.
దీనిని తీవ్రంగా నిరసిస్తూ పదో తేదీ నుంచి సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసింది.
2010 జనవరి 12న రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వాన కమిటీని వేసింది.
2010 మార్చి నాలుగు నుంచి ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించింది.
2010 డిసెంబర్ 30న శ్రీకృష్ణ కమిటీ తన నివేదిక సమర్పించింది.
2012 డిసెంబర్ 5న అఖిలపక్షం వేస్తున్నట్లు హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించారు.
2012 డిసెంబర్ 28న అఖిలపక్ష సమావేశం జరిగింది.
2013 జూలై 30న యూపీఏ సమన్వయ కమిటీ. సీడబ్ల్యూసీ విడివిడిగా సమావేశమై తెలంగాణ ఆవిర్భావానికి ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి.
2013 ఆగస్టు 12 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, మున్సిపల్, ఆర్టీసీ, ఇతర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సమ్మె 66 రోజులు కొనసాగింది.
2013 అక్టోబర్ 3న తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
2013 డిసెంబర్ 6న బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరింది.
2013 డిసెంబర్ 16న శాసనసభ, శాసనమండలిలో ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టారు.
2014 ఫిబ్రవరి ఒకటిన మూజువాణి ఓటుతో రాష్ట్ర శాసనసభ, శాసనమండలి బిల్లును వ్యతిరేకించాయి.
2014 ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2013కు లోక్‌సభ, 20న రాజ్యసభ ఆమోదం తెలిపాయి.
2014 ఫిబ్రవరి 28న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయించారు.
2014 జూన్ 2న అపాయింటెడ్ డేతో రాష్ట్ర విభజన పూర్తయింది.