- ఇంకా తేలని స్థానికత వివాదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి ఆరు నెలలు దాటినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంతో లక్ష మందికిపైగా విద్యార్థులు ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నారు. తెలంగాణలో చదువుతున్న దాదాపు 80 వేల మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులతోపాటు ఆంధ్రా ప్రాంతంలో చదువుతున్న సుమారు 40 వేల మంది తెలంగాణ విద్యార్థులు కూడా తమకు ఈ పథకం వర్తిస్తుందా లేదా అన్నది తేలక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
స్థానికత అంశం ముడిపడి ఉన్న ఫీజులు, స్కాలర్‌షిప్‌లపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు దాగుడుమూతలు ఆడుతుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో నివసిస్తున్న ఏపీ విద్యార్థులకు ఇది పెద్దసమస్యగానే ఉంది. ఓవైపు వార్షిక పరీక్షలు ముంచుకొస్తున్నా ఇంకా ఈ విషయంలో స్పష్టత రాకపోవడం మరోవైపు ఫీజులు చెల్లించాలంటూ యాజమాన్యాల ఒత్తిడితో విద్యార్థులు వేదన చెందుతున్నారు.
జటిలంగా మారిన సమస్య: తెలంగాణలో చదువుతున్న విద్యార్థులందరికీ (స్థానికతతో సంబంధం లేకుండా) రీయింబర్స్‌మెంట్ చేసిన పక్షంలో తెలంగాణ ప్రభుత్వానికి కొన్ని వందల కోట్ల భారం పడనుంది. అదే సమయంలో ఏపీలో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు ఆ ప్రభుత్వం కొన్ని పదుల కోట్ల మేర చెల్లించాలి. ఆర్థికభారం పెరుగుతుందన్న కారణంతో రెండు ప్రభుత్వాలు ముందుగా ఎవరు నిర్ణయం తీసుకుంటారోనని వేచి చూస్తూ విద్యార్థులతో దోబూచులాడుతున్నాయి.
తెలంగాణకే చెందిన వారిగా (స్థానికులుగా) ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకునే విద్యార్థులకు ‘ఫాస్ట్’ను వర్తింపజేస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించగా హైదరాబాద్, రంగారెడ్డి పరిసర జిల్లాల్లో ఉంటున్న ఏపీ విద్యార్థులకు ఈ సర్టిఫికెట్లను ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరిస్తున్నారు. ఎమ్మార్వోలు నేటివిటీ సర్టిఫికెట్లకు బదులు ఫలానా ఇంట్లో నివసిస్తున్నారని మాత్రమే పత్రాలు ఇస్తున్నారు.