
ఇంటర్ 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభం
తొలిరోజు 10 శాతం మించని విద్యార్థుల హాజరు
వచ్చిన వారికి చాలా చోట్ల మధ్యాహ్న భోజనం కరువు
తొలి రోజే ఇస్తామన్న పుస్తకాలు ఇంకా రానేలేదు
కాలేజీల పునఃప్రారంభంపై సరైన ప్రచారం కల్పించని ప్రభుత్వం
సాక్షి నెట్‌వర్క్/అమరావతి: అరకొర వసతుల మధ్య పుస్తకాల్లేకుండానే నూతన విద్యా విధానంలో ఇంటర్మీడియట్ మొదలైంది. మంగళవారం రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీల్లో 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. మార్చి 20వ తేదీతో ఇంటర్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో తిరిగి పది రోజుల్లోనే రెండో ఏడాది విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. తొలి రోజు విద్యార్థులను కాలేజీలకు రప్పించడంలో అటు ప్రభుత్వం, ఇటు అధికారులు విఫలమయ్యారు.
ఇంటర్మీడియట్ నూతన విద్యా సంవత్సరంలో అమలు చేయనున్న విద్య, అకడమిక్ సంస్కరణలపై మార్చి 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని బోర్డు కార్యదర్శి ఆదేశించినా అది విద్యార్థుల వరకు చేరలేదు. మంగళవారం ‘సాక్షి’ బృందం పలు కళాశాలలను సందర్శించగా, ఎక్కడా విద్యార్థుల హాజరు 10 శాతం మించలేదు. ఒకటో తేదీనే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలతో స్టూడెంట్ కిట్ ఇస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేర లేదు. ఏ జిల్లాలోనూ విద్యార్థులకు పుస్తకాలు ఇచ్చిన దాఖలా లేదు. వచ్చిన అరకొర విద్యార్థులకు చాలాచోట్ల మధ్యాహ్న భోజనం పెట్టలేదు.
కొన్ని చోట్ల ఈనెల 3వ తేదీ వరకు ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ఉండడంతో ఆయా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించలేదు. రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలో జూనియర్ కాలేజీలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు కలిపి 801 ఉండగా, హైస్కూల్ ప్లస్‌లు 502, ప్రయివేట్ ఎయిడెడ్ కాలేజీలు 181 ఉన్నాయి. అయినప్పటికీ తొలిరోజు విద్యార్థుల హాజరు అంతంత మాత్రమే నమోదైంది. తొలి ఏడాది పరీక్షలు రాసిన పది రోజుల్లోనే తిరిగి కాలేజీకి రావడం కొత్తగా ఉందని పలువురు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఎండల తీవ్రత కారణంగా ఏప్రిల్‌లో తరగతులు సరికాదని మరి కొందరు పేర్కొన్నారు.
అన్ని చోట్లా అరకొర హాజరే...
⇒ గుంటూరు నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 401మంది విద్యార్థినులకు తొలిరోజు కేవలం 20 మందే హాజరయ్యారు. ఇక్కడ ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ కొనసాగుతుండడంతో ఉ.9 గంటలకు వచ్చిన విద్యార్థినులను అర్ధ గంటలోనే ఇళ్లకు పంపించారు.
⇒ ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరంలోకి 238 మంది విద్యార్థులు ప్రవేశించగా, మంగళవారం కేవలం 48 మందే వచ్చారు.
⇒ ప్రకాశం జిల్లాలో 32 ప్రభుత్వ కళాశాలల్లో 2,200 మంది విద్యార్థులకు గాను, తొలిరోజు 120 మందే హాజరయ్యారు.
⇒ కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ కాలేజీలో 225 మంది విద్యార్థులకు గాను ఒక్కరూ హాజరుకాలేదు. చిప్పగిరి, హోళగుంద, గూడూరు, కోడుమూరు, కర్నూలు బి.క్యాంపు, మంత్రాలయం, నాగులదిన్నె, ఎమ్మిగనూరు కాలేజీల్లో ఒక్కరు కూడా హాజరు కాకపోవడం గమనార్హం. వెల్దుర్తి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 78 మంది విద్యార్థులకు ఇద్దరు మాత్రమే హాజరయ్యారు.
⇒ కడపలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 171 మందికి కేవలం 29 మంది మాత్రమే వచ్చారు.
⇒ చిత్తూరు పీసీఆర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 258 మందికి గాను తొలి రోజు కేవలం 25 మంది హాజరయ్యారు. ఒకేషనల్ 196 మందికిగాను ఒక్కరూ హాజరు కాలేదు. పలమనేరు కళాశాలలో 339 మందికి 30 మంది, గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 100 మందికి 10 మంది వచ్చారు. అన్ని కాలేజీల్లో ఇదే పరిస్థితి కనిపించింది.
⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 13 ప్రభుత్వ కళాశాలల్లో 1,372 మంది విద్యార్థులకుగాను, 344 మంది మాత్రమే హాజరయ్యారు.
⇒ నెల్లూరు జిల్లాలో 51 ప్రభుత్వ యాజమాన్య జూనియర్ కళాశాలల్లో 6 వేల మంది విద్యార్థులకు గాను తొలి రోజు 500 మంది మాత్రమే వచ్చారు. కేజీబీవీ, మోడల్, సోషల్ వెల్ఫేర్ కళాశాలల్లో 15 శాతం విద్యార్థులే హాజరయ్యారు.
మధ్యాహ్న భోజనం లేదు
మా స్వగ్రామం లద్దగిరి నుంచి ప్రతిరోజు 15 కి.మీ ప్రయాణించి వెల్దుర్తి కాలేజీకి రావాలి. సాయంత్రం వరకు ఇక్కడే ఉండాలి. తొలిరోజు మధ్యాహ్న భోజనం పెట్టలేదు. ఇస్తామని చెప్పిన పుస్తకాలూ ఇవ్వలేదు. మా కాలేజీలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపుల్లో సెకండియర్ వారు 78 మంది రావాలి. కానీ ఇద్దరమే వచ్చాం. అన్ని సౌకర్యాలు కల్పించాక తరగతులు ప్రారంభిస్తే బాగుండు. – దేవరాజు, సెకండియర్ సీఈసీ, లద్దగిరి, కర్నూలు జిల్లా
వేసవి సెలవులు ఇవ్వాలి
తొలి ఏడాది పరీక్షలు ముగిసిన పది రోజుల్లోనే సెకండ్ ఇయర్ తరగతులు ప్రారంభించడం కొత్తగా ఉంది. ప్రైవేట్ కాలేజీల్లో ఇప్పటికే ద్వితీయ సంవత్సరం తరగతులు నిర్వహిస్తున్నారు. వారితో పోటీ పడాలంటే ఇప్పటి నుంచే తరగతులు నిర్వహిస్తే సబ్జెక్టులపై అవగాహన పెరుగుతుంది. అయితే ఎండలు ముదిరిన నేపథ్యంలో వేసవి సెలవులు ఇస్తే బావుంటుంది. – కె.సాయికృష్ణ, సెకండియర్ హెచ్‌ఈసీ విద్యార్థి, ఏలూరు
పుస్తకాలు త్వరగా ఇస్తే మేలు
గతంలో జూన్ లో కళాశాలలు ప్రారంభమయ్యేవి. ఇప్పుడేమో పరీక్షలు రాసిన పది రోజుల్లోనే కళాశాలకు రప్పించారు. ఈ విధానం మంచిదేననిపిస్తోంది. కాకపోతే ఎండల తీవ్రత అధికంగా ఉంది. అన్ని కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెడితే బావుంటుంది. పుస్తకాలు కూడా త్వరగా ఇవ్వాలి. – సయ్యద్ సమీర్, సెకండియర్ సీఈసీ, నక్కాస్, కడప