
అదేమని అడిగిన తల్లిదండ్రులకూ చెప్పు చూపించిన వైనం
శ్రీసత్యసాయి జిల్లాలో ఘటన
ధర్మవరం: విద్యార్థులను చెప్పుతో కొట్టిన టీచర్.. అదేమని అడిగిన తల్లిదండ్రులకూ అదే చెప్పు చూపించిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, పట్టణంలో జీనియస్ అనే ఒక ప్రైవేట్ పాఠశాలలో గొట్లూరు గ్రామానికి చెందిన విద్యార్థులు సనధ్వైజ్, జశ్విన్, భరత్ 2వ తరగతి చదువుతున్నారు. రెండు రోజుల క్రితం టీచర్‌గా విధులు చేపట్టిన అనిత, తరగతిలో ఈ ముగ్గురు విద్యార్థులు హోంవర్క్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసి చెప్పుతో కొట్టింది.
బాధిత విద్యార్థులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాఠశాలకు వెళ్లి ప్రశ్నించారు. వారితోనూ ఆ టీచర్ అమర్యాదగా ప్రవర్తించారు. తాను కావాలని కొట్టలేదంటూనే.. ‘ఏదో అలా తగిలిందంటూ’ వారికి చెప్పు చూపించారు. దీంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురై, పాఠశాల కరస్పాండెంట్ ప్రేమ్ కిషోర్ వద్దకు వెళ్లి వాగ్వివాదానికి దిగారు. అనంతరం పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. టీచర్ అనిత, పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ ధర్మవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.