9 వేల పోలీసు పోస్టులు మాయం
విభజన నేపథ్యంలో కోల్పోయిన ఆంధ్రప్రదేశ్
లోటు పూడ్చటంపై అధికారుల మల్లగుల్లాలు
హైదరాబాద్: రాష్ట్ర విభజన పంపకాల అంశంలో నిబంధనలు పట్టించుకోకపోవడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి భారీ నష్టం ఏర్పడింది. ఇప్పటికే వాహనాల పంపకంలో ఏపీ 1,060 కోల్పోయినట్లు వెలుగులోకి రాగా.. ఇప్పుడు మరో అన్యాయం బయటపడింది. రాష్ట్రానికి రావాల్సిన పోలీసు పోస్టుల్లో తొమ్మిది వేలకు పైగా నష్టపోయినట్లు వెల్లడైంది. రాష్ట్ర పోలీసు విభాగంపై తీవ్ర ప్రభావం చూపే ఈ లోటును ఎలా పూడ్చాలనే అంశంపై ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆస్తులతో పాటు పోస్టులు తదితరాలను సైతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు 58.32 : 41.68 నిష్పత్తిలో పంచాల్సి ఉంది. పోలీసు విభాగానికి సంబంధించి వాహనాలు, పోస్టుల పంపకంలో ఈ విషయాన్ని విభజన కమిటీ పట్టించుకోలేదు. 2012 డిసెంబర్ నాటికి మంజూరైన పోస్టుల లెక్క ప్రకారం రాష్ట్ర పోలీస్‌లోని 17 విభాగాల్లో మొత్తం 1,38,823 పోస్టులు ఉన్నాయి. వీటిని విభజన చట్టం ప్రకారం పంచితే ఏపీకి 80,962 పోస్టులు, తెలంగాణకు 57,861 పోస్టులు రావాలి.
అయితే వాటికన్నా తెలంగాణకు ఎక్కువ రాగా.. ఆంధ్రప్రదేశ్ మాత్రం దాదాపు తొమ్మిది వేలకు పైగా పోస్టుల్ని కోల్పోయింది. కేవలం సాధారణ పోలీసు పోస్టుల విషయంలోనే కాదు.. చివరకు ఏపీఎస్పీ, గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌ల్లోనూ ఇదే రీతిలో పంపకాలు జరిగాయి. సాధారణంగా పోలీసు విభాగంలో రాష్ట్ర, జోనల్ వంటి క్యాడర్ పోస్టులు ఉంటాయి. విభజన చట్టం రాష్ట్ర స్థాయి పోస్టుల పంపకానికి మాత్రమే వర్తిస్తుంది. 1975 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఓ జీవోను జారీ చేసింది. దీని ప్రకారం ఏపీఎస్పీలో మినిస్టీరియల్ సిబ్బంది మినహా ప్రతీ పోస్టూ రాష్ట్ర స్థాయికి చెందినదే. అయితే ఏపీఎస్పీని విభజిస్తున్న సందర్భంలో కమిటీ ఎక్కడి యూనిట్లు అక్కడే అన్న నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 58.32 శాతం వాటా రావాల్సిన ఏపీకి ఎనిమిది బెటాలియన్లు.. 41.68 శాతం రావాల్సిన తెలంగాణకు తొమ్మిది బెటాలియన్లు వచ్చాయి.