సాక్షి, చిత్తూరు: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మిగులు విద్యుత్తు ఉంది. దీంతో గృహావసర వినియోగ విద్యుత్తును 24 గంటలూ సరఫరాచేసే యోచనలో ఎస్‌పీడీసీఎల్(సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్)ఉంది. ఎస్‌పీడీసీఎల్ పరిధిలోని జిల్లాల్లో తొలుత చిత్తూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా 24 గంటల విద్యుత్ సరఫరాను అమలు చేయనున్నారు. ఈ దిశగా ఇప్పటికే కసరత్తు జరుగుతోంది. ఈ ప్రక్రియ కంటే ముందుగా ఇళ్లలోని బల్బుల మార్పిడికి రాష్ట్ర ప్రభుత్వం పట్టుబడుతోంది.
ఇళ్లలోని బల్బులు మార్చాల్సిందే!
గతంలో 100...ఆపై 60 వాట్ బల్బులను వినియోగించేవారు. కేవలం పది రూపాయలకే ఈ బల్బులు లభిస్తాయి. అయితే విద్యుత్తు బిల్లుల నేపథ్యంలో దాదాపు అందరూ ట్యూబ్‌లైట్లు, సీఎఫ్‌సీఎల్ లైట్లను వినియోగిస్తున్నారు. పల్లెల్లో ఇప్పటికీ 60 వాట్స్ బల్బులు వాడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ట్యూబ్‌లైటు ధర 40 -50, సీఎఫ్‌సీఎల్ 70 రూపాయలకు లభిస్తున్నాయి. వీటి వినియోగంతో 20-35వాట్స్ విద్యుత్తు మాత్రమే ఖర్చవుతుంది. అయితే ప్రస్తుతం వీటిని తొలగించి ఆ స్థానంలో కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఎల్‌ఈడీ బల్బులను వినియోగించాలని ప్రభుత్వం భావించింది.
ఈ మేరకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకుంది. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో ఎల్‌ఈడీ బల్బుధర 450 రూపాయలు ఉంది. ప్రతి ఇంట్లో 5 బల్బులకు తక్కువ లేకుండా ఉంటాయి. ఈ లెక్కన 2వేల రూపాయలు ఖర్చుచేసి బల్బులు మార్చుకోవాల్సిందే! బల్బు కాలిపోయిన ప్రతిసారి 450 రూపాయలు భరించాల్సిందే ! ప్రస్తుతం ఈ బల్బులను ఎస్‌పీడీసీఎల్ అధికారుల వద్ద కొనుగోలు చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
లైటింగ్ సమస్యతో కంటిచూపు తగ్గిపోయే ప్రమాదం
ట్యూబులైట్ వెలుతురుతో పోల్చితే సీఎఫ్‌సీఎల్ లైటింగ్ తక్కువ. ఈ లైట్ల వెలుతురులో చదువుతున్న పిల్లలకు కంటిచూపు తగ్గుతోంది. ఎల్‌ఈడీ బల్బులు సీఎఫ్‌సీఎల్ వెలుతురు కంటే చాలా తక్కువ. ఇలాంటి లైట్ల వెలుతురుతో చదివితే అక్షరాలు చూసేందుకు కళ్లపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. కంటి నరాలపై ఒత్తిడి పెరిగి చిన్నపిల్లలకే తక్కువ వయస్సులో కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ఖర్చు పెరిగినా ఫర్వాలేదని, వెలుతురు తక్కువగా ఉంటే పిల్లల పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
బల్బు మార్చాల్సిందే !
Published Sun, Aug 10 2014 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM
Advertisement
Advertisement