రిజర్వ్‌డ్ అసెంబ్లీ స్థానాలు ఏపీలో 50కి.. తెలంగాణలో 38కి పెరుగుదల
ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో ఇకపై 9 అసెంబ్లీ స్థానాలు
హైదరాబాద్: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను 119 నుంచి 153 కు, ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225కు పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. 2015 జనవరి నుంచి రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ విషయమై పలు అంశాలపై కేంద్రం నుంచి వివరాలను కోరింది. దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌తో కూడా ఈసీ ఇటీవల సమీక్షించింది. ప్రాథమికంగా తెలంగాణ, ఏపీలో 2011 జనాభా ప్రాతిపదికన ఏ జిల్లాల్లో ఎస్సీ నియోజకవర్గాలు పెరుగుతాయో నిర్ధారించడంతో పాటు ఎన్ని ఎస్టీ స్థానాలు పెరుగుతాయో అంచనా వేశారు. జిల్లా యూనిట్‌గా ఎస్సీ నియోజకవర్గాలను, రాష్ట్ర యూనిట్‌గా ఎస్టీ నియోజకవర్గాలను ఖరారు చేయనున్నారు.
ఏపీలో ప్రస్తుతం ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాలు 29 ఉండగా పునర్విభజన అనంతరం 38 స్థానాలకు, ఎస్టీ రిజర్వ్ స్థానాలు ఏడు నుంచి 12కు పెరుగుతాయి. తెలంగాణలో ఎస్సీ స్థానాలు 19 నుంచి 24కు, ఎస్టీ స్థానాలు 12నుంచి 14కు పెరుగుతాయి. ఇరు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలుండగా పునర్విభజన అనంతరం రెండేసి చొప్పున పెరుగుతాయి. అంటే ఒక్కో ఎంపీ స్థానంలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలుంటాయి. లోక్‌సభ స్థానాల సంఖ్యలో మార్పూ ఉండదు. పునర్విభజన కోసం ఎస్సీ, ఎస్టీల జనాభాను గ్రామాల వారీగా ఇవ్వాలని రిజస్ట్రార్ ఆఫ్ జనరల్ జనాభా గణాంకాలను ఈసీ కోరింది. విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి అసోసియేషన్ సభ్యులు ఐదుగురు మాత్రమే అని పేర్కొంది.
పునర్విభజన కసరత్తు షురూ
Published Sat, Sep 13 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM
Advertisement