ఆ 37 సంస్థలపై పోటాపోటీ
విభజన చట్టంలో ఏ షెడ్యూల్‌లో చేర్చని సంస్థలపై పంచాయితీ
మావంటే మావే అంటున్న తెలంగాణ, ఆంధ్రా సర్కార్లు
గవర్నర్‌కు, కేంద్రానికి లేఖ రాయాలని ఏపీ సర్కారు నిర్ణయం
హైదరాబాద్: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఏ షెడ్యూల్‌లోనూ చేర్చని 37 సంస్థలపై తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. చట్టంలో ఏ షెడ్యూల్‌లో చేర్చని సంస్థలు ఆంధ్రప్రదేశ్‌కే చెందుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాది స్తుండగా... భౌగోళికంగా తెలంగాణలో ఉన్న సంస్థలు తమకే చెందుతాయని తెలంగాణ సర్కారుకు పట్టు పడుతోంది. దీంతో ఈ సంస్థలపై ఇరు రాష్ట్రప్రభుత్వాల మధ్య పంచాయతీలు రోజు రోజుకూ పెరగనున్నాయి. ఈ 37 సంస్థల్లో భౌగోళికంగా కొన్ని తెలంగాణలోను, కొన్ని ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉన్నాయి. వీటిలో ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ తదితర సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలను తీసుకోవడంపట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మండిపడుతోంది. ఈ 37 సంస్థల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుని ఒక అవగాహనకు రావాల్సి ఉందని, అయితే తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కేంద్రానికి, గవర్నర్‌కు లేఖ రాయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని ఏ షెడ్యూల్‌లో చేర్చని సంస్థలుంటే అవి ఆంధ్రప్రదేశ్‌కే చెందుతాయని, లేదంటే వెంటనే పదవ షెడ్యూల్‌లో చేర్చి ఇరు రాష్ట్రాలకు సేవలందించేలా చర్యలు తీసుకోవాలని కోరనుంది. పదో షెడ్యూల్‌లో చేర్చితే ప్రత్యామ్నాయ సంస్థలను మరో రాష్ట్రం ఏర్పాటు చేసుకునే వరకు ఉమ్మడి సేవలను అందించాల్సి ఉంటుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సీఎస్ మంగళవారం ఉన్నతాధికారులతో సమావేశమ య్యారు. తెలంగాణ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలను నిలువరించాలని గవర్నర్, కేంద్రానికి లేఖలు రాయాలని నిర్ణయించారు.
రెండు రాష్ట్రాలు పోటీ పడుతున్న సంస్థలు ఇవే..
ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన శిక్షణ సంస్థ, ఏపీ సెరికల్చర్ రీసెర్చ్ అభివృద్ధి సంస్థ, వ్యవసాయ-మార్కెటింగ్ శిక్షణ సంస్థ, రాష్ట్ర ఏజీఎంఏఆర్‌కే లేబరేటరీ, డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్, క్రాప్ వూనిటరింగ్ లేబొరేటరీ, బయో పెస్టిసైడ్ టెస్టింగ్, వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ సంస్థ, ఏపీ యోగాధ్యాన పరిషత్, ఎంఎన్‌జే అంకాలజీ రీజనల్ కేన్సర్ సెంటర్, ఆరోగ్య శ్రీ హెల్త్‌కేర్ ట్రస్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్, ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్స్, ప్రవేశ ఫీజు నియంత్రణ కమిటీ, ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్, ఏపీ వెటర్నరీ మండలి, రాష్ట్ర ఆస్తిపన్ను మండలి, ఏపీ ఫుడ్స్, రాష్ట్ర ఆర్ట్స్ గ్యాలరీ, ఎన్‌జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ, వైఎస్‌ఆర్ ఉద్యాన యూనివర్శిటీ, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, దామోదర సంజీవయ్య న్యాయ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ, ఏపీ జ్యుడీషియల్ అకాడమీ, భూమి ఆక్రమణ ప్రత్యేక కోర్టు, ఏపీ దేవాదాయ ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, రాష్ట్ర మైనారిటీ కమిషన్, ఏపీ రాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్, రాష్ట్ర అధికార భాషా కమిషన్, ఏపీ విజిలెన్స్ కమిషన్, లోకాయుక్త, రాష్ట్ర ఎన్నికల సంఘం, సమాచార హక్కు కమిషన్, ఏపీ మానవ హక్కుల కమిషన్, ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్.