* పరీక్షలపై రెండు ప్రభుత్వాల మధ్యకుదరని ఏకాభిప్రాయం
*ప్రస్తుత నిబంధనల అమలుకే బోర్డు నిర్ణయం
* మార్చిలో పరీక్షల ప్రారంభానికి చర్యలు
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్ ప్రకారమే ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో ప్రస్తుత బోర్డు నిబంధనలను యథాతథంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. షెడ్యూల్ ప్రకారం మార్చి రెండో వారానికల్లా పరీక్షలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని బోర్డు కార్యదర్శి రామశంకర్‌నాయక్ తెలిపారు.
విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా, నష్టపోకుండా ఉండేందుకు సకాలంలోనే పరీక్షల నిర్వహిస్తున్నామన్నారు. ఇంటర్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించాలా లేక వేర్వేరుగానా అనే విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. తెలంగాణలో తామే పరీక్షలు నిర్వహించుకుంటామని చెప్పిన ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇంటర్ బోర్డును కూడా ఏర్పాటు చేసింది. ఎంసెట్, జేఈఈ, జేఈఈ అడ్వాన్సు పరీక్షల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇస్తున్నందున ఉమ్మడిగానే పరీక్షలు జరపాలని ఏపీ వాదిస్తోంది. ఇటీవల దీనిపై ఇరు రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు జరిపిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు.
దీంతో ఆగస్టులోనే మొదలు కావాల్సిన పరీక్షల ఏర్పాట్లు ఆగిపోయాయి. పరీక్షలు జాప్యమయ్యే పరిస్థితి నెలకొంది. దీనిపై ఇరు రాష్ట్రాల్లోని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ఇరు ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోయినా, షెడ్యూల్ ప్రకారం పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఇరు ప్రభుత్వాల మధ్య వివాదానికి మూలమైన ప్రశ్నపత్రాల రూపకల్పన వంటి అంశాలను పక్కనపెట్టి ఇతర ప్రక్రియలను పూర్తిచే యనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఫీజుల చెల్లింపునకు గడువును ప్రకటించారు. ఈ నెల 10వ తేదీతో అపరాధ రుసుముతో ఫీజుల చెల్లింపునకు గడువు ముగుస్తుంది. ఇరు ప్రభుత్వాల నిర్ణయం మేరకు ప్రశ్నపత్రాలు రూపొందించాలని అధికారులు నిర్ణయించారు.
‘‘ఇంటర్ బోర్డుతో సహా 107 సంస్థలను పదో షెడ్యూల్‌లో చేర్చారు. ఈ సంస్థలను ఉమ్మడిగా కొనసాగించాలంటే వాటి నిర్వహణపై రెండు ప్రభుత్వాలు ఏడాదిలోగా ఒప్పందాలు కుదుర్చుకోవాలి. అలా చేయలేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వమే వీటిపై ఓ నిర్ణయం తీసుకోవాలి. అప్పటివరకు ప్రస్తుత నిబంధనల ప్రకారమే పనిచేస్తాయి. ఇంటర్ బోర్డు కార్యకలాపాలు కూడా ఇలాగే సాగుతాయి’’ అని రామశంకర్‌నాయక్ చెప్పారు. బోర్డులో జిల్లాలవారీగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వేర్వేరు సెక్షన్లు పనిచేస్తున్నాయని, ఇరు ప్రాంతాల ఫీజులు, ఇతర మొత్తాలకు సంబంధించి రెండు వేర్వేరు అకౌంట్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. బోర్డులోని ఉద్యోగులందరం సమన్వయంతో, సమష్టిగా పనిచేసి పరీక్షలను షెడ్యూల్‌కు నాలుగైదు రోజులు అటుఇటుగా పూర్తి చేయగలుగుతామన్న నమ్మకం ఉందని చెప్పారు.
షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు!
Published Wed, Nov 5 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM
Advertisement
Advertisement