బుధవారం గవర్నర్ నరసింహన్‌తో సమావేశమైన తెలంగాణ, ఏపీ విద్యాశాఖ మంత్రులు జగదీశ్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇరు రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి పరీక్షలు జరుగుతాయా? వేర్వేరుగా నిర్వహిస్తారా? అనే అంశం పక్కకుపోయి.. అసలు పరీక్షలను నిర్వహించాల్సిన ఇంటర్మీడియట్ బోర్డుపై అధికారం ఎవరిదన్నది తెరపైకి వచ్చింది. గవర్నర్ నరసింహన్‌తో బుధవారం జరిగిన రెండు రాష్ట్రాల విద్యా మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాసరావుల సమావేశంలో ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఒకే రకమైన ప్రశ్నాపత్రాలతో పరీక్షలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం చెబుతుండగా, ఏపీతో సంబంధం లేకుండా తెలంగాణలో వేరుగానే పరీక్షలు నిర్వహించుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన భేటీలో పరీక్షలు ఎలా నిర్వహిస్తారన్న అంశం కాకుండా ఇంటర్మీడియట్ బోర్డుపై అధికారం ఎవరిదన్నదే ప్రధాన చర్చగా మారడంతో సమావేశం అసంపూర్తిగానే ముగిసింది.
ప్రత్యామ్నాయాలపై గవర్నర్ కార్యాలయం నోట్!
రెండు రాష్ట్రాల మంత్రుల సమావేశం సందర్భంగా గవర్నర్ కార్యాలయం మంత్రులకు ఒక నోట్‌ను అందజేసినట్లు తెలిసింది. బోర్డుకు చైర్మన్‌గా తెలంగాణ విద్యా మంత్రి వ్యవహరిస్తే.. వైస్ చైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్ విద్యా మంత్రిని నియమించాలని లేదా రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో కమిటీ వేసి, ఆ కమిటీ నేతృత్వంలో పరీక్షలను నిర్వహించాలని ఆ నోట్‌లో సూచించారు. అయితే ఇది కుదరదని జగదీశ్‌రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. వైస్ చైర్మన్ పోస్టు ఇంటర్మీడియట్ బోర్డు చట్టంలో లేదని, చట్ట సవరణ ఇపుడు సాధ్యపడదని పేర్కొన్నట్లు సమాచారం.
అధికారం మాదైనా... ఏపీ పెత్తనం చలాయిస్తోంది..
ఇంటర్ బోర్డుపై అధికారం తమదే అయినా ఏపీ ప్రభుత్వమే పెత్తనం చెలాయిస్తోందని జగదీశ్‌రెడ్డి గవర్నర్‌కు వివరించారు. ‘‘పదో షెడ్యూలులోని సంస్థలు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్ర పరిధిలోకే వస్తాయి. అయితే పొరుగు రాష్ట్రానికి ఏడాదిపాటు ఆ సంస్థ సేవలు అందించాలి. రాష్ట్ర విభజనకు ముందు ఎలాంటి సేవలు అందాయో అలాంటి సేవలను కొనసాగించాలి. ఎలాంటి తేడా చూపడానికి వీల్లేదు. మొత్తానికి ఏడాదిలోగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర అంగీకారంతో వాటి సేవలను కొనసాగిస్తారా? వేరుగా ఏర్పాటు చేసుకుంటారా? నిర్ణయించుకొని ఒప్పందం చేసుకోవాలి. లేకపోతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ సంస్థను ఏదో ఒక రాష్ట్రానికి కేటాయిస్తుంది’’ అని సెక్షన్ 75 చెబుతున్నా ఏపీ ప్రభుత్వమే ఇంటర్ బోర్డు విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని తెలియజేశారు. అయినప్పటికీ ‘‘మా పరీక్షలు మేమే నిర్వహించుకుంటామని చెబుతున్నాం తప్ప.. ఏపీ తరహాలో పెత్తనం గురించి పట్టించుకోలేదని.. ఇప్పటికైనా చట్టం నిబంధనల ప్రకారం అధికారాలను మాకు అప్పగించండి.. మా పరీక్షలతోపాటే ఏపీ ప్రభుత్వం కోరితే ఆంధ్రప్రదేశ్‌లోనూ మేమే పరీక్షలను నిర్వహిస్తాం..’’ అని జగదీశ్‌రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. దీనిపై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తమ సీఎంతో చర్చించాక నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా గవర్నర్ కూడా ‘మీ ముఖ్యమంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకోండి.. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టండి..’ అని సమావేశాన్ని ముగించినట్లు తెలిసింది.