* ఏపీ, తెలంగాణ మధ్య సయోధ్యకు కేంద్రం యత్నాలు
* వివాదాల పరిష్కారం దిశగా చర్యలు.. సీఈఏ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు
* విద్యుత్ వివాదాలపై నివేదికకు ఆదేశం.. నీటి తగాదాలను తీర్చేందుకు కేంద్ర జల సంఘం కసరత్తు
* 7 లేదా 8న భేటీకి రావాలని వర్తమానం.. కృష్ణా, గోదావరి బోర్డుల ఏర్పాటే ప్రధానాంశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న విద్యుత్, నీటి వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం రంగంలోకి దిగుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య రేగుతున్న విద్యుత్ సెగలను చల్లార్చేందుకు కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సీఈఏ) ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్రం తాజాగా ఆదేశాలు జారీచేసింది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలకు పరిష్కారాలను చూపుతూ.. నెల రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
మరోవైపు కృష్ణా డెల్టాకు తాగునీటి అవసరాల విషయంలోనూ తలెత్తిన విభేదాలను తొలగించేందుకు కేంద్ర జలసంఘం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఈ నెల 7 లేదా 8న సమావేశమవుదామని రెండు రాష్ట్రాలకు వర్తమానం పంపింది. ఇరు రాష్ట్రాల మధ్య నీటి తగాదాలను తీర్చేందుకు విభజన చట్టంలో పేర్కొన్న మేరకు కృష్ణా యాజమాన్య బోర్డు ఏర్పాటుపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద వివాదాల పరిష్కారంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించనుంది.
ఇదీ నీటి తగాదా!
డెల్టా తాగునీటి అవసరాలకు 10 టీఎంసీల నీరు అవసరం లేదని తెలంగాణ సర్కారు భావిస్తుండగా, ఏపీ ప్రభుత్వం మాత్రం ఆ మేర నీరు కావాల్సిందేనని పట్టుపడుతోంది. దీంతో కేంద్రం ఆదేశాల మేరకు మొదట వారం పాటు నాగార్జునసాగర్ నుంచి రోజుకు 6 వేల క్యూసెక్కుల నీటి విడుదల జరిగింది. ఏపీ కోరిక మేరకు మరోవారం పాటు కొనసాగించాలని తాజాగా బోర్డు ఆదేశించింది. దీనిపై టీ సర్కారు నిరసన తెలిపింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలతో చర్చించి వివాదాలను సాధ్యమైనంత వరకు పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్రం రంగంలోకి దిగుతోంది.
ఇందులో భాగంగానే ఈ నెల 7 లేదా 8న ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వాస్తవానికి నీటి విడుదలకు సం బంధించి గోదావరి, కృష్ణా యాజమాన్య బోర్డులను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ బోర్డులు పూర్తిస్థాయిలో ఏర్పడలేదు. నోటిఫికేషన్ మాత్రమే విడుదలైంది. ఈ నేపథ్యంలో బోర్డులు, వాటి కార్యాలయాల ఏర్పాటు, పరిష్కార మార్గాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
విద్యుత్‌పై కమిటీ ఇదే..
కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సీఈఏ) చైర్‌పర్సన్ నీర్జా మాథుర్ చైర్మన్‌గా ఏర్పాటైన ఈ కమిటీలో విద్యుత్ నిర్వహణ వ్యవస్థ(పోస్కో) సీఈవో ఎస్‌కే సూనీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్(పీజీసీఐఎల్) సీవోవో వైకే సెహగల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇంధన శాఖ కార్యదర్శులు లేదా వారి ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. కేంద్ర విద్యుత్ శాఖ డెరైక్టర్ (ఓ అండ్ ఎం) ఈ కమిటీకి సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు.
అవసరమైతే ఇరు రాష్ట్రాల ఉమ్మడి విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) నుంచి కూడా ఒక ప్రతినిధిని కమిటీలోకి తీసుకోవచ్చునని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రీయ విద్యుత్ వ్యవస్థ నుంచి ఇరు రాష్ట్రాలకు విద్యుత్ కేటాయింపులు, సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్ కేటాయింపులు, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ లైన్ల సరఫరా చార్జీలు, నష్టాల లెక్కింపు, ఇరు రాష్ట్రాలకు ప్రత్యేకంగా విద్యుత్ నియంత్రణ మండళ్ల ఏర్పాటు, పీపీఏల రద్దుపై తలెత్తిన వివాదాన్ని ఈ కమిటీ పరిశీలించనుంది.
సెగ చల్లార్చేందుకు
Published Thu, Jul 3 2014 1:03 AM | Last Updated on Sat, Jun 2 2018 7:19 PM
Advertisement
Advertisement