జల వివాదాల పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య ఉభయ పాలకులు ఉద్వేగాలను రెచ్చగొడుతున్నారు. ఇండియా, చైనా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహ రించినట్లుగా సాగర్, శ్రీశైలం, పులి చింతల ప్రాజెక్టుల వద్ద పోలీసు బలగాలు మోహరించి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నారు. ఈ జగడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒక కారణమైతే, రెండవది తెలంగాణ లోనున్న ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరం ఉందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ కేంద్రాలలో నూటికి నూరు శాతం విద్యుత్ ఉత్పాదన చేయాలని నిర్ణయించడం. రెండు రాష్ట్రాలు కయ్యం పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వానికి ఉండే రాజకీయ ప్రయోజనాలు దానికి ఉండి సమస్య పరిష్కారం కాకుండా జాప్యం చేయడం వల్లనే సమస్య మరింత జటిలమౌతోంది.
కృష్ణానది పుట్టిన మహారాష్ట్ర, ఆ తర్వాత పరివాహక ప్రాంతమైన కర్ణాటక, చివరి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వాలకు మధ్య జలవివాదాలు రగిలాయి. ఎగువనున్న రెండు రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని విని యోగించుకుంటున్నదనే వివాదాన్ని పై రాష్ట్రాలు రెండు లేవనెత్తాయి. అది పరిష్కరించడం కోసం కేంద్ర ప్రభుత్వం 1969లో ఆర్‌ఎస్ బచావత్ కమిటీని, జలవివాదాల పరి ష్కారం కోసం ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ట్రిబ్యునల్ వందేళ్ల జల పరివాహకాన్ని పరిగణనలోకి తీసు కొని మూడు రాష్ట్రాల వాటాలను తేల్చింది. బచావత్ ప్రముఖ ఇంజినీర్ కావడంతో, 75 శాతం డిపెండబిలిటీని ఆధారంగా వేసుకొని నికరజలాలను తేల్చారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో 2060 టీఎంసీలు నికరజలాలుగా నిర్ణయించారు. మహా రాష్ట్రకు 560 టీఎంసీలు, కర్ణాటకకు 700 టీఎంసీలు, ఆంధ్ర ప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయింపులు చేస్తూ 1976లో తీర్పునిచ్చారు. బచావత్ కమిటీ తీర్పు 2000 జూన్ 31 నాటికి ముగిసింది. మిగులు వరద జలాలను దిగువన ఉన్న వారు వాడుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిసి వచ్చింది.
1983లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభు త్వంలో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తమిళ తంబీల రుణం తీర్చుకోవడం కోసం ‘తెలుగుగంగ’ పథకాన్ని ప్రారం భించారు. దీనికోసం 15 టీఎంసీల నీటిలో ఎగువ రాష్ట్రాలు చెరో ఐదు టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐదు టీఎంసీలు కేటాయిస్తూ ఆనాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ఆధారంగా శ్రీశైలం ఎగువన పోతిరెడ్డిపాడు వద్ద హెడ్ రెగ్యులేటర్‌ను ప్రారంభించారు. 2004లో ముఖ్యమంత్రిగా వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలుగుగంగ హెడ్ రెగ్యు లేటర్‌ను వెడల్పు చేసి 11 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని తరలించుకుపోయే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రెగ్యులేటర్ గేట్లను పెంచి 44 వేల క్యూసెక్కులకు పైగా జలాలను తరలించే ఏర్పాటు చేశారు.
బచావత్ కమిటీ ముగిసిన తర్వాత 2004లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. 65 శాతం డిపెండ బులిటీగా తీసుకొని, 2060గా ఉన్న నికర జలాలను 2,578 టీఎంసీలుగా ట్రిబ్యునల్‌గా గుర్తించింది. దాని ప్రకారం ఎగువన కర్ణాటకకు 700+211=911 టీఎంసీలు, మహారాష్ట్రకు 560+106=666 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి 811+190=1001 టీఎంసీలు కేటా యించింది. ఇప్పుడు అదనంగా కేటాయించిన 190 టీఎంసీల్లో సగం వాటా తెలంగాణా కావాలన్నది ప్రధానాంశంగా మారింది. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత అంతకుముందు 811 టీఎంసీలలో 512 ఆంధ్రప్రదేశ్‌కు, 299 టీఎంసీలు తెలంగాణకు కేటా యించారు. కమిటీ అదనంగా కేటాయించిన నీటిలో తమకు తక్కువ ఇవ్వడం కుదరదని తెలంగాణ వాదిస్తున్నది. అంతేకాదు, మొత్తం కేటాయింపులలో చెరి సగం వాటాను పంచుకోవాలని డిమాండ్ చేస్తున్నది.
గత సంవత్సరం పోతిరెడ్డిపాడు ఎగువన సిద్ధేశ్వరం వద్ద కేంద్ర అనుమతులు లేని రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నిధులు కేటాయించారు. దీని ద్వారా మరో నాలుగు టీఎంసీల నీటిని తెలుగుగంగ కాల్వకు లింక్ చేయడం ద్వారా రోజుకు ఎనిమిది టీఎంసీల నీటిని అంటే 80 వేల క్యూసెక్కుల జలాలను తోడుకుపోవచ్చు. దీనికి తెలంగాణ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. వరద సమయంలో రోజుకు 80 వేల క్యూసెక్కులకు పైగా నీటిని తరలిస్తే పాలమూరు రంగారెడ్డి మొదలగు పథకాలకు నీళ్లు మిగలవని తెలంగాణ వాదన. రాయలసీమ పథకంపై గ్రీన్ ట్రిబ్యునల్ అనుమ తులు లేనందున నిలుపుదల చేయాలంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా జూరాల ఎగువన ప్రాజెక్టు నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టులు ఆపకపోతే తాము కూడా కృష్ణానదిపై ప్రాజెక్టులు కట్టుకొని నీటిని తీసుకుపోతామంటోంది. వాస్తవంగా కృష్ణా పరివాహక ప్రాంతం 68 శాతంకు పైగా తెలంగాణలో ఉంది. దీని ప్రకారం జలాల్లో వాటా 548 టీఎంసీలు దక్కాలని తెలం గాణ అంటున్నది. 32 శాతం మాత్రమే ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా పరివాహక ప్రాంతం ఉన్నది. అయినా 512 టీఎంసీలు పొందుతున్నది. ఇది న్యాయమా అని ప్రశ్నిస్తు న్నది. పరివాహక ప్రాంతాన్ని అనుసరించి కేటా యింపులు జరపాలని తెలంగాణ కోరుతున్నది.
అయితే, ప్రాజెక్టులు నిండకముందే, 834 అడుగులు శ్రీశైలం జలాలు చేరక ముందే తెలంగాణ అక్రమంగా విద్యుత్తును ఉత్పాదన చేసి రోజుకు 30 వేల క్యూసెక్కులు వాడు కుంటోందని ఆంధ్రప్రదేశ్ వాదన. కేంద్ర అనుమతులు లేకుండా అనేక ఎత్తిపోతల పథకాలను తెలంగాణ చేపట్టిం దని ఆరోపిస్తున్నది. తెలంగాణ విద్యుత్ ఉత్పాదన చేయడం వల్ల రోజుకు ఎనిమిది వేల క్యూసె క్కులకు పైగా నీరు సముద్రంలో వృథాగా పోతోందని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ విన్నవించుకుంది. కేంద్ర ప్రభుత్వం, జల సంఘం, కృష్ణా రివర్ బోర్డు నీటి కేటాయింపులను జరిపినప్పుడే సమస్యకు శాశ్వత పరి ష్కారం లభిస్తుంది. గత సమావేశాల్లో తెలంగాణకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీనిచ్చింది. అందుకు సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించు కోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రం ఇచ్చిన హామీతో కేసును ఉపసంహరించుకుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పరిష్కారం ఉంది.
జూలకంటి రంగారెడ్డి
వ్యాసకర్త మాజీ శాసనసభ్యులు,
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment