ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతిలో ఉత్తీర్ణతా శాతం తగ్గిన నేపథ్యంలో రకరకాల చర్చలూ, విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి గత కొన్నేళ్లుగా పదో తరగతిలో పాస్ కాకపోవడం అనేది అలవాటు లేకుండా పోయింది. పరీక్షల సమయంలో చూసీచూడనట్టుగా పోవడమూ ఒక కారణం. ఈసారి కోవిడ్ మహమ్మారితో పాటు కొంత కఠినంగా వ్యవహరించడం వల్ల కూడా ఫలితాలు తగ్గాయి. దీనివల్ల కొంపలేమీ మునగవు. సప్లిమెంటరీ ఉండనే ఉంది. అయితే ఫలితాల వాపెంతో, బలుపెంతో తెలుసుకొని, విద్యార్థులనూ, మొత్తంగా విద్యా వ్యవస్థనూ మున్ముందు దిద్దుకోవడానికి ఈ ఫలితాలు చక్కగా ఉపకరిస్తాయి.
తప్పు పిల్లలదే కాదు...
తెలుగు రాష్ట్రాల్లో ఎస్‌ఎస్‌సీ ఫలితాలు అంటేనే చిట్టీలు రాసి పాస్ కావడం. విద్యా శాఖ అధికారులూ, కలెక్టర్లూ తమ జిల్లాలో తక్కువ మంది పాస్ అయితే ఎక్కడ తమకు చెడ్డ పేరు వస్తుందోనని బోగస్ ఎగ్జామ్స్ నిర్వహించే వారు. కానీ ఈసారి ఎగ్జామ్స్ చాలా కఠినంగా నిర్వహించ డంతో అసలైన పరిస్థితి ఏమిటో బయటపడింది. గత 20, 30 ఏళ్ల నుంచీ విద్యా వ్యవస్థలో అనారోగ్యకరమైన పోటీ ఏర్పడింది. కలెక్లర్లు, అధికార్లు పాఠశాలల ప్రధానో పాధ్యాయులకు టార్గెట్లు నిర్దేశించే పరిస్థితుల్లో పరీక్షలు రాసే సమయంలోనే కొంత మెతక ధోరణిని విద్యార్థుల పట్ల ప్రదర్శించడం ఉండేది.
పరీక్షా పేపర్లు దిద్దే సమయంలో కూడా ఆయా కేంద్రాల్లోని అధిపతులు టీచర్లను ప్రభావితం చేస్తారు. ‘‘బార్డర్‌లో ఉన్న విద్యార్థులను రెండు మూడు మార్కుల కోసం వారిని ఫెయిల్ చేయకండి... పాస్ చేయండి’’ వంటి ఒత్తిళ్లు ఉండేవి. పార్ట్ –ఏ, పార్ట్ –బీలో రెండు మూడు మార్కులు కలిపేవారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి పరీక్షల సమయంలో కొందరు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అరెస్టు అయ్యారు. దీని ప్రభావం వారిపై పడింది. అరెస్టు కావడం అవమానకరంగా భావించి వారంతా పరీక్షల నిర్వహణలో కాపీ జరుగకుండా కఠిన చర్యలు తీసుకున్నారు.
ఇక రెండోది... కోవిడ్ అంశం కూడా చెప్పుకోవాలి. కోవిడ్ సమయంలో విద్యార్థుల పనితీరును అంచనా వేయడానికి వీల్లేకపోవడం, విద్యార్థుల్లో ఉదాసీనత పెరగడంతో సీరియస్‌గా చదువు సాగలేదు. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులు మరిచిపోయారు. ప్రధానంగా 8, 9 తరగతుల విద్యార్థులు ఎక్కువ ప్రభావిత మయ్యారు. దీంతో పదో తరగతి ఫలితాలు తగ్గాయి. దీర్ఘకాలంలో ఈ పరిణామం మంచి ఫలితాలు ఇస్తుంది. ఇలాంటి అవసరమైన షాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనివల్ల విద్యార్థులు, టీచర్లలో సీరియస్‌నెస్ పెరుగుతుంది.
కోవిడ్ వల్ల సరిగా చదవలేక పోయినందువల్ల ఆం్ర«ధప్రదేశ్ ప్రభుత్వం.. నెలరోజులు రెసిడెన్షియల్ తరహాలో సెలవుల సమయంలోనూ పిల్లలకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తోంది. దీంతో త్వరలో నిర్వహించనున్న çసప్లిమెంటరీ పరీక్షల అనంతరం ఉత్తీర్ణత శాతం 95 శాతానికి వెళ్తుంది. విద్యార్థులకు ఎలాంటి భారం లేకుండా ఉండటానికి సప్లిమెంటరీ పరీక్షల ఫీజులను కూడా ప్రభుత్వం రద్దు చేయడం మంచి పరిణామం.
పదవ తరగతిలో ఉత్తీర్ణతను రాజకీయ కోణంలో చూడవద్దు. దానిని విద్యాశాఖ అధికారులకు వదిలిపెట్టాలి. ఏపీలో విద్యా శాఖ అధికారులు కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్నారు. ‘నాడు–నేడు’ ‘జగన్ విద్యా కానుక’ సంస్కరణలు, సాహసోపేత నిర్ణయాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న మద్దతుతో అధికారులు కొనసా గిస్తున్నారు. విద్యా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండగా ముందుకు వెళ్తోంది. ఏ రాజకీయ పార్టీ కూడా దీనిని రాజకీయ కోణంలో చూడవద్దు. అలా చేస్తే విద్యా వ్యవస్థకు నష్టం చేసిన వారవుతారు.
పదో తరగతి ఫలితాలు తగ్గడంలో తప్పు కేవలం పిల్లలదే కాదు... అది ప్రాధమ్యాలని బట్టి వరుసగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం, మేధావులది. టీవీ సీరియళ్ల మీదా, దేవుని పూజల మీదా, అలంకారాల మీదా జీవితం పారేసుకున్న తల్లులూ; నాలుగురాళ్ల సంపాదన మీదా, మందు మీదా, స్నేహాలూ, బాతఖానీల మీదాజీవితం పరిచేసుకున్న తండ్రులూ; పీఆర్సీలూ, అదనపు సంపాదనలూ, సొంత బాదర బందీలూ, బాధ్యతలేని తనాలతో టీచర్లూ; పనికి రాని, అర్థం లేని, కాలానికి నిలబడలేని, ఆకర్షణ లేని పాఠ్యపుస్తకాలూ, టీచర్ల శిక్షణలతో ప్రభుత్వాలూ; సినిమాల గురించీ, దేవుళ్ల గురించీ, మతం గురించీ, దమ్మిడీ పనికిరాని సమాచారం గురించీ ప్రచారం చేస్తూ... సమీప పాఠశాలల్లోని పిల్లలతో ఎన్నడూ మాట్లాడని మేధావులూ... అందరూ బాధ్యత వహించాలి!
ఇంజినీరింగ్ చదివే విదార్థికి కూడా ఒక వాక్యం ఇంగ్లిష్‌లోనో లేదా కనీసం మాతృభాషలోనైనా తప్పులేకుండా రాయలేని దుఃస్థితిలో ఉన్న పరిస్థితి మనది. చదువు విలువని సమర్థ వంతంగా నూరి పోయడంలో విఫలమైన సమాజం మనది. కేవలం చదువుకుంటేనే జీవితం అద్భుతంగా ఉంటుందని నచ్చ జెప్పడంలో విఫలమైన వ్యవస్థ మనది. చదువులో మార్పు గురించో, పుస్తకాలలోని పాఠాల గురించో, సిలబస్ గురించో, చదువుచెప్పే టీచర్ల గురించో చర్చించుకోవడం కూడా రాజకీ యమైపోయిన పరిస్థితుల్లో బతుకుతున్నందుకు ముందు మనం సిగ్గుపడదాం. మార్పు గురించి మాట్లాడితే బూతులు మాత్రమే బదులిచ్చే సంస్కృతిని చూసి చచ్చిపోదాం!
వ్యాసకర్త: ఆకునూరి మురళి, మాజీ ఐఏఎస్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment