మొదటి అడుగు
కథ
‘‘ఈ ప్రపంచంలోని మనుషుల్లో నూటికి తొంభై మంది స్వార్థ్ధపరులే. అసలు మనుషులే కనిపించని ప్రపంచానికి వెళ్లిపోదామనిపిస్తోంది’’ అవంతిక తరచుగా అనే మాటలివి. ‘‘మనుషులు కనపడని ప్రపంచం అంటూ ఉంటుందా?’’ అని నవ్వేవాడిని నేను ఆమె మాటలకి. కానీ ఇప్పుడు చూస్తున్నాను. రోజుల తరబడి వెదికినా ఒక్క మనిషి కూడా కనబడని ప్రపంచాన్ని కళ్ల ఎదుట చూస్తున్నాను. మేము ప్రయాణం చేస్తున్న అంతరిక్ష నౌక భూమిని దాటి దాదాపు రెండు వందల ఎనభై మిలియన్ కిలోమీటర్లకి పైగా అంతరిక్షంలో ప్రయాణం చేసి వచ్చి అప్పుడే అంగారక గ్రహాన్ని చేరుకుంది.
ఏ దేశమూ ఊహించని విధంగా మొట్టమొదటిసారిగా అంగారక గ్రహమ్మీదకి భారతదేశం తన వ్యోమగాములని పంపించింది. అంతరిక్ష పరిశోధనలో ఎంతో ముందుండే అమెరికా సైతం అప్పటిదాకా అంగారక గ్రహమ్మీదకి పరిశోధనా శాటిలైట్లని మాత్రమే పంపగలిగింది కానీ వ్యోమగాములని పంపి అంగారక గ్రహమ్మీద మనిషి చేత మొదటి అడుగు వేయించలేకపోయింది. అలాంటిది భారతదేశం మొట్టమొదటిసారిగా అంగారక గ్రహమ్మీదకి మనుషులని పంపడంతో ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా ఇటే ఉంది. మానవజాతి మనుగడనే మలుపు తిప్పగల పరిశోధన ఇది అని అందరికీ తెలుసు.
మా నలుగురిలోకీ ఎక్కువ ఉద్వేగంగా కనిపిస్తున్నది ప్రణీత్. ఎందుకంటే, మరికొద్దిక్షణాల్లో మా అంతరిక్ష నౌక అంగారక గ్రహమ్మీదకి అడుగుపెట్టగానే, ఆ గ్రహమ్మీద మొట్టమొదటిసారిగా కాలు మోపబోయేది అతడే! మానవజాతి చరిత్రలోనే తన పేరు సుస్థిరంగా నిలిచిపోయే సంఘటన కొద్ది క్షణాల్లో జరగబోతోందని తెలిసిన ఏ మనిషికైనా అలాంటి ఉద్వేగం కలుగడం సహజమే. మిగిలిన ఇద్దరినీ వదిలేసి నేను ప్రత్యేకంగా ప్రణీత్ హావభావాలని గమనించడానికి కారణం ఉంది. అదేమిటంటే, కొన్ని పరిస్థితుల వల్ల, ఈ ప్రయోగంలో అతడు కెప్టెన్ స్థానంలో ఉన్నాడు కానీ, నిజానికి ఆ స్థానంలో ఉండాల్సిన వ్యక్తిని నేను!
వయసులోనూ, హోదాలోనూ నాకంటే చిన్నవాడైన అతడు చేసిన కొన్ని ప్రయత్నాల వల్ల అతడు ఆ అవకాశాన్ని దక్కించుకోగలిగాడు కానీ, నిజానికి ఆ స్థానానికి అన్ని విధాలుగా అర్హుడినైన వ్యక్తిని నేను. పై అధికారుల ముందు ధైర్యం చేసి నా బాధని వెళ్లగక్కినా, ఎన్నో విషయాలని పరిగణనలోకి తీసుకుని పకడ్బందీగా రూపొందించిన ఎంపిక ప్రక్రియ ఇది. అయినా ఇందులో నువ్వు బాధపడే విషయం ఏముంది? ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో నువ్వు కూడా ఉన్నావు కదా? మీ నౌక అంగారక గ్రహం మీద దాదాపు ఆరు గంటలు ఉంటుంది. అక్కడ వాతావరణం అనుకూలంగా ఉంటే, మీరు కూడా ఆ గ్రహమ్మీద కాలు పెడతారు. ఒకరు ముందూ ఒకరు వెనుకా అంతే అన్న సమాధానమే వచ్చింది.
ఒకరు ముందూ, ఒకరు వెనుకా అని ఎంత తేలికగా అనగలిగారు?! రోవర్‌ను ఈ గ్రహమ్మీదకి పంపి ఇక్కడి వాతావరణాన్ని పరిశీలించడం దగ్గర నుంచీ ఈరోజు వరకూ అంగారక గ్రహమ్మీద పరిశోధనలో కీలక పాత్ర వహిస్తూ మొదటినుంచీ ఈ ప్రయోగం మీద ఎంతో శ్రద్ధతో, ప్రేమతో పని చేసిన నాకు దక్కాల్సిన అపురూపమైన అవకాశాన్ని మరొకరు దక్కించుకుంటే, ఆ బాధ ఎలాంటిదో అనుభవించే నాకు తెలుస్తుంది కానీ వాళ్లకేం అర్థమౌతుంది?
నీల్ ఆర్మ్ స్ట్రాంగ్తోపాటు ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకేల్ కొలిన్స్ కూడా అపోలో-11 నౌకలో ప్రయాణించారు. కానీ చంద్రుడిపై అడుగిడిన తొలివ్యక్తిగా నీల్ ఆర్మ్ స్ట్రాంగే ప్రపంచానికి గుర్తుంటాడు కానీ మిగిలినవాళ్ల పేర్లు ఎవరికి తెలుసు?
కొలంబియా అంతరిక్ష నౌకలో కల్పనా చావ్లాతో పాటు మరో ఆరుగురు వ్యోమగాములు కూడా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల పేర్లు ఎంతమందికి తెలుసు?
నేను ఆలోచనల్లో ఉండగానే మా అంతరిక్ష నౌక అంగారక గ్రహమ్మీద ల్యాండ్ అవడం, బయటి వాతావరణం వ్యోమగామి దిగడానికి అనువుగా ఉందన్న సంకేతాన్ని నౌకలో ఉన్న సూపర్ కంప్యూటర్లు నిర్ధారణ చేయడం జరిగిపోయాయి.తను వేసుకున్న స్పేస్ సూట్‌ని మరోసారి సవరించుకుని, ఆక్సిజన్ సిలిండర్‌ని సరి చూసుకుని, మావైపు విజయ సూచకంగా బొటన వేలు ఎత్తి చూపించాడు ప్రణీత్. నేను అప్రయత్నంగా అతడి కళ్లలోకి చూసాను. సరిగ్గా అదే సమయానికి ప్రణీత్ కూడా నావైపు చూసాడు.
బయటి వాతావరణం ముఖానికి తాకకుండా రక్షణ కవచంలా వున్న స్పేస్ సూట్లోని హెల్మెట్ వంటి అమరిక తాలూకు దళసరి అద్దాల వెనుకనుంచి నుంచి కూడా అతడి కళ్లల్లోని భావం స్పష్టంగా కనిపించింది నాకు. ఆ కళ్లలో స్నేహ భావం కానీ, కృతజ్ఞత కానీ లేదు. విజయం సాధించే ముందు యుద్ధంలో ప్రత్యర్ధి వైపు చూసే చూపులా కసిగా, గర్వంగా ఉంది.
ఒక్క క్షణం నా మనస్సు కలుక్కుమంది. ఎవరికి తెలియకపోయినా, ఈ ప్రయోగంలో కెప్టెన్ స్థానాన్ని దక్కించుకోవడానికి మా ఇద్దరి మధ్య ఉన్న పోటీ మాకు తెలుసు! ఆ క్షణంలో అతడి చూపులని తట్టుకోలేక గిలగిలలాడిపోయాను.
మన మౌనాన్ని అవతలివారు చేతకానితనం అనుకుంటే అంతకన్నా పరాజయం మరొకటుండదు. భరింపశక్యం కానటువంటి ఒకానొక భావోద్వేగంలో అనాలోచితంగానే చేసేశాను ఆ పనిని.
అంతరిక్ష నౌకలో నాకున్న అనుభవాన్నంతా ఉపయోగించి మెరుపు వేగంతో మేము ఉన్న ప్రదేశానికి వెనుక వైపుకు కదిలాను. మొదటి నుంచీ ఈ ప్రయోగంలో మమేకమైపోయి పనిచేయడం వల్ల ఆ నౌకలో ఉన్న అంగుళం అంగుళం, అందులోని సాంకేతిక విషయాలతో సహా నాకు పరిచయమే.
ఎక్కడ ఏ మీట నొక్కితే ఏం జరుగుతుందో, దాన్ని ఎలా సరిచేయవచ్చో అన్న విషయాల మీద నాకున్న అవగాహన మా నలుగురిలో మరెవ్వరికీ లేదు. క్షణాల్లోనే నౌకా స్వరూపమంతా కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో సహా నా మెదడులో కదలాడింది. క్షణంలో వెయ్యో వంతు కాలంలో నేను చెయ్యదలుచుకున్న పనికి మెదడులో ఒక క్రమరూపం ఏర్పడిపోయింది.
నా చేతులు వేగంగా కదిలి అక్కడి మీటలని నొక్కాయి. నేను చేసిన ఆ పని వల్ల ఎవ్వరూ ఊహించని విధంగా నాకోసం అంతరిక్ష నౌక వెనుక భాగంలో సన్నని ద్వారం తెరుచుకుంది !
ముందు భాగంలో అంగారక గ్రహమ్మీద అడుగుపెట్టడానికి ప్రణీత్ ఇంకా కౌంట్ డౌన్ చేస్తుండగానే వెనుకవైపు తెరుచుకున్న ద్వారం గుండా నేను బయటకి దూకేసాను. నేను దూకిన మరుక్షణంలోనే తెరుచుకున్న ఆ సన్నని ద్వారం మరలా యధావిధిగా మూసుకుపోయింది. మేము తిరిగి వెళ్లాక ఈ విషయం ఒక చర్చనీయాంశం అవుతుందని నాకు తెలుసు. వెనుక వైపు ద్వారం సాంకేతిక లోపం వల్ల తెరుచుకుందనీ, దానిని మూసే ప్రయత్నంలో నేను అనుకోకుండా బయటికి అడుగు పెట్టాల్సి వచ్చిందని చెప్పచ్చు. నేను చేసిన ఆ పని వల్ల ఆ క్షణంలో నా శరీరంతో పాటు మనసు కూడా గాల్లో తేలిపోతున్నట్టుగా అనిపించింది. అంగారక గ్రహమ్మీద కాలుపెట్టబోతున్న మొట్టమొదటి మానవుడ్ని నే...నే!!
సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ముందుకు దూకడం వల్ల ఒక్కసారిగా నా కాలు నేల (ఈ ప్రయోగం సరైనది కాదేమో, అంగారగ గ్రహ ఉపరితలం అనాలనుకుంటా) మీద ఆనలేదు. కాలు ఒక్కసారి గ్రహ ఉపరితలాన్ని తాకడం వల్ల, నేను రెండు మూడు పల్టీలు కొట్టినట్టుగా గాల్లోకి ఎగిరాను.
భూమికీ అంగారక గ్రహానికీ ఉన్న అతి ముఖ్యమైన తేడాల్లో గ్రావిటీ ఒకటి. భూమి మీద ఉండే గ్రావిటీలో సగానికన్నా తక్కువ అంగారక గ్రహమ్మీద ఉంటుంది. భూమి మీద వంద కేజీల బరువుండే మనిషి అంగారక గ్రహమ్మీద కేవలం ముప్ఫై ఎనిమిది కేజీలు మాత్రమే ఉంటాడు. భూమి మీద అడుగు వేసేంత ఒత్తిడితో అంగారకుడి మీద అడుగు వెయ్యాల్సిన అవసరం ఉండదు. బహుశా నేను పల్టీలు కొట్టడానికి అదే కారణం అయి ఉంటుందనుకుంటూ, నా శరీరం అంగారకుడి మీద దొర్లుతుంటే, ఆ స్పర్శని ఆస్వాదిస్తున్నట్టుగా ఉండిపోయాను కొద్దిసేపు.
భూమికీ అంగారక గ్రహానికీ ఉష్ణోగ్రతలోనూ, వాతావరణ ఒత్తిడిలోనూ కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. నేను వేసుకున్న స్పేస్ సూట్, దానిలో అమర్చి ఉన్న ఆక్సిజన్ మాస్కు నాకు ఆ తేడాని పెద్దగా తెలియనివ్వడం లేదు.
నా శరీరం ఆగకుండా మరిన్ని పల్టీలు కొడుతుంటే, నేను ఆ గ్రహమ్మీద నిలదొక్కుకోలేకపోవడానికి కారణం గ్రావిటీలో ఉన్న తేడా కాదేమోనని, బహుశా నేను దిగిన వెనక వైపు భాగంలో ఏదో చిన్నపాటి లోయ వంటిది ఉందేమో, నేను ఆ లోయలో పడిపోతున్నానేమోనన్న అనుమానం వచ్చింది. ఆ అనుమానం రాగానే నా గుండె దడదడలాడింది. భయంగా చుట్టూ ఉన్న పరిసరాలని గమనించాను.
మొదలేదో చివరేదో తెలియనట్టుగా ఎటు చూసినా నారింజ రంగుతో మెరిసిపోతున్న పరిసరాలు... అప్పటి వరకూ కొన్ని వందలసార్లు సాటిలైటు తీసిన ఛాయాచిత్రాలలో చూసిన వాటిని ఇప్పుడు ప్రత్యక్షంగా కళ్ళతో చూస్తున్నాను. మనసులో ఆ అనుమానమే లేకపోతే దానినంతా ఎంతో బాగా ఆస్వాదించేవాడిని.
పల్టీలు కొట్టిన తరువాత చాలాసేపటికి నేను తిన్నగా నిలబడగలిగాను. శరీరం నా స్వాధీనంలోకి వచ్చిన వెంటనే నేను చేసిన మొట్టమొదటి పని మా అంతరిక్ష నౌక ఎక్కడ ఉందా అని వెతకడం!
కనుచూపు మేరలో ఎక్కడా మా నౌక వున్న జాడలు కనిపించలేదు. నేను ఊహించినది నిజమే. నేను ఏదో లోయలోకి జారి చాలా దూరం వచ్చేసాను. నా గుండెలు దడదడలాడాయి. హెల్ప్... అని గట్టిగా అరవాలనిపించింది. నేను అరిచినా అక్కడ ఎవరికీ వినిపించదని తెలుసు. అసలు నేను వేసుకున్న స్పేస్ సూట్లోంచి ఆ శబ్దం బయటికే రాదు. పరిశోధన చేస్తున్న సమయంలో అంగారక గ్రహమ్మీద కాలు పెట్టగానే ఏవేవో చెయ్యాలనుకున్నాను. అక్కడి శిలాజాలని సేకరించాలనీ, వాతావరణాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలనీ, అంగారకుడి మీద గడిపిన కొద్ది సమయంలో ఒక థీసిస్‌కి సరిపడినంత పరిజ్ఞానాన్ని బుర్రలో నింపుకోవాలనీ, ప్రపంచానికి అంగారకుడ్ని కొత్తగా పరిచయం చెయ్యాలనీ ఎన్నెన్నో అనుకున్నాను. కానీ ప్రస్తుతం నా మనసులో భయం తప్ప మరో ఆలోచన రావడం లేదు.
వచ్చిన దిక్కుకే వేగంగా వెనక్కి పరిగెత్తాలనుకున్నాను. ఉద్రిక్తతతో గట్టిగట్టిగా అడుగులు వేస్తే గ్రావిటీ తేడా వల్ల మళ్లీ శరీరం గాలిలోకి ఎగరవచ్చేమోనన్న అనుమానం వచ్చి నెమ్మదిగానే అడుగులు వేస్తూ వెనుదిరిగాను. వెనుదిరిగాక అప్పుడు మెదిలింది అసలైన ప్రశ్న నా మెదడులో... ఇప్పుడు నేను ఎటు వైపుకు వెళ్లాలి?!
గాల్లో పల్టీలు కొడుతూ రావడం వల్ల అసలు నేను ఎటు వైపు నుంచి వచ్చానో అన్న విషయం కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను ఏ వైపుకు వెళ్లి మా అంతరిక్ష నౌకని వెదకాలి?! నా స్థానంలో ప్రణీత్‌ని మా పరిశోధనకి కెప్టెన్‌గా నియమిస్తున్నామన్న ప్రకటన విన్నప్పుడు కూడా రాని ఏడుపు అప్పుడు నాకు తన్నుకుని వచ్చింది. నన్ను నేను సంభాళించుకున్నాను.
గాలిలో పల్టీలు కొట్టినా గ్రావిటీ తక్కువగా ఉన్న ఆ గ్రహమ్మీద నేను మా నౌకకి ఎక్కువ దూరం వచ్చి ఉండనని నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. కళ్లు మూసుకుని ముందుగా ఏదో ఒక వైపు ప్రయాణం సాగించాలి. ఆ వైపు కొద్ది దూరం వెళ్లాక నౌక కనిపించకపోతే మళ్లీ వెనక్కి వచ్చి మరో దిక్కుకి ప్రయాణం సాగించాలి. అటు కూడా అలాగే చెయ్యాలి. ఏదో ఒక వైపుకే గుడ్డిగా నడుచుకుంటూ వెళ్లడం కన్నా, ఇలా అన్ని వైపులకీ కొద్ది కొద్ది దూరం వెళ్లి ప్రయత్నించడం వల్ల మా వాళ్లని వెదికి పట్టుకోవడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది అనుకుని మనసులోనే లెక్కలు వేసుకుని నడక ప్రారంభించాను.
నేను దొర్లుతూ వచ్చిన సమయాన్ని లెక్కకట్టి, ఆ వేగాన్ని అంచనా వేసి ఒక్కో దిక్కుకీ ఎంత దూరం నడవాలో లెక్కలు కట్టుకుని ఒక్కో దిక్కులో దిక్కులేనివాడిలా ఇనుప ఖనిజాలతో ఎర్రబారిన అంగారక గ్రహం ఉపరితలమ్మీద నడక సాగించాను. ఎంత దూరం నడిచినా మా నౌక జాడ తెలియడం లేదు.
సమయం గడుస్తున్న కొద్దీ నా ప్రాణాలర్పించైనా మావాళ్లని చూడాలన్న తహతహ మొదలైంది నాలో. మా అంతరిక్ష నౌక కేవలం ఆరు గంటలపాటే అంగారక గ్రహమ్మీద గడపగలదు. ఆరుగంటల లోపు అక్కడి నుంచి బయలుదేరకపోతే అది తిరుగు ప్రయాణం చెయ్యడానికి పనికి రాదు. ఆ విషయం నాకు బాగా తెలుసు. అందుకే, నేను వెళ్లినా వెళ్లకపోయినా సరిగ్గా ఆరు గంటలయ్యే సరికి వాళ్లు ముగ్గురూ తిరుగు ప్రయాణం ప్రారంభిస్తారు. అప్పుడు నా పరిస్థితి ఏమిటి?!
అవంతిక అన్న అసలు మనుషులే లేని ప్రపంచంలో నిజంగా గడపాల్సి వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో అర్ధమౌతున్న కొద్దీ నేను చేసిన పనికి నాలో పశ్చాత్తాపం కలుగసాగింది. అంగారక గ్రహం మీద రోజు యొక్క పరిమాణానికీ, భూమికీ పెద్దగా తేడా ఉండదు. దూరంగా అంగారక గ్రహమ్మీద సూర్యాస్తమయం కనిపిస్తోంది. ఆకాశంలో సూర్యుడి గమనాన్ని బట్టి మేము అక్కడ అడుగుపెట్టి ఎంత సమయం అయ్యిందో అంచనా వెయ్యగలిగాను. మా అంతరిక్ష నౌక బయలుదేరడానికి ఇంకా కొద్ది నిమిషాలు మాత్రమే సమయం ఉందన్న విషయం అర్థమైంది నాకు.
అప్పటివరకూ నౌక కనుచూపు మేరలో కూడా కనిపించలేదు. ఇంకా ఎన్ని లోయలు దాటాలో, ఎన్ని పర్వతాలని ఎక్కాలో... అదంతా ఈ కొద్ది నిమిషాల్లో సాధ్యమయ్యే పనేనా? నిస్సత్తువ ఆవరించడంతో కుప్పకూలిపోయాను.
ఆ నౌక వెళ్లిపోయిందంటే, ఇంక భూమితో నా సంబంధాలు శాశ్వతంగా తెగతెంపులైపోతాయి. నేను ఈ గ్రహమ్మీద తప్పిపోయానన్న విషయం తెలిసినా నాకోసం, నన్ను వెదకడం కోసం ఇన్ని కోట్లు ఖర్చుచేసి ప్రభుత్వం మళ్లీ మరొక వ్యోమ నౌకని ఇక్కడికి ఎట్టి పరిస్థితులలోనూ పంపదు. అసలు నేను అప్పటిదాకా జీవించి ఉండగలనన్న నమ్మకం కూడా భూమ్మీద ఎవరికీ ఉండదు. సైంటిస్టుగా ఎంతో ఎత్తుకు ఎదగాలని ఎన్నో కలలు కన్న నా జీవితం ఇలా అనామకంగా ఈ అన్య గ్రహమ్మీద అంతమౌతుందన్న విషయం నేనెన్నడూ ఊహించలేదు.
నా స్థితికి సంతాపం తెలియ చేస్తున్నట్టుగా నేను కిందపడ్డ చోట ఎర్రగా పైకి లేచింది ఒక ధూళి మేఘం. నీరసంతో సోలిపోతున్న నా కళ్లకి ఆ ధూళిలోంచి మసగ్గా కనిపించింది దూరంగా ఒక చిన్న కదలిక. కళ్లు చిట్లించుకుని మళ్లీ చూసాను. అది భ్రమ కాదు... నిజమే. దూరంగా ఒక కదలిక కనిపిస్తూ క్షణాల్లోనే ఆ దృశ్యం క్రమంగా నా కళ్లకి స్పష్టమౌసాగింది.
నా కళ్లు మెరిసాయి. దూరం నుంచి నావైపే నడుచుకుంటూ వస్తున్నది... స్పేస్ సూట్లో ఉన్న ప్రణీత్!!
అతడ్ని గుర్తుపట్టగానే, ఏదో శక్తి నాలోంచి తన్నుకు వస్తున్నట్టుగా నన్ను లేపింది. గ్రావిటీ గురించి కూడా ఆలోచించకుండా శక్తి కొలదీ అడుగులు వేస్తూ పరుగుపెడుతూ వెళ్లి ప్రణీత్‌ని గాఢంగా కౌగిలించుకున్నాను!
ప్రణీత్ కూడా నన్ను ఆలింగనం చేసుకుంటూ నా కళ్లలోకి కళ్లుపెట్టి చూసాడు... అతడి కళ్లలో ప్రేమ... స్నేహం!!
నేను తేరుకునే లోగానే అతడు నా చేతిని పట్టుకుని నన్ను దాదాపుగా లాక్కుని వెడుతున్నట్టుగా పరిగెట్టసాగాడు. ఏమీ ఆలోచించే స్థితిలో లేని నేను ఏదో అపురూపమైన పెన్నిధిని పట్టుకున్నట్టుగా ప్రణీత్ చెయ్యి పట్టుకుని అతడు లాక్కుని వెడుతున్న వైపు కదిలిపోతున్నాను. దాదాపు పది నిమిషాలకి మేము మా అంతరిక్ష నౌక ముందు ఉన్నాము. అలాగే నన్ను లాక్కు వెడుతున్నట్టుగా నౌకలోకి ఎక్కించేసాడు ప్రణీత్. మేము ఎక్కిన వెంటనే, క్షణాల్లోనే నౌక తలుపులు మూసుకోవడం, నౌక గాలిలోకి లేవడం జరిగిపోయాయి.
‘‘అసలు ఏం జరిగింది?’’ మిగిలిన వ్యోమగాములు అన్నారు.
‘‘సాంకేతిక లోపం వల్ల వెనుక తలుపు తెరుచుకుంది. దాన్ని సరిచేసే ప్రయత్నంలో నేను బయటకి జారిపోయాను. అటువైపు లోయ ఉన్నట్టుంది’’ గొంతులోని అపరాధ భావం నాకే తెలిసిపోతోంది.
‘‘ఏది ఏమైనా ప్రణీత్ కన్నా ముందర నువ్వే అంగారక గ్రహమ్మీద అడుగు పెట్టావు. అంగారక గ్రహమ్మీద మొదటి అడుగు పెట్టిన మానవుడిగా నీ పేరు చరిత్రలో స్థిరంగా ఉండిపోతుంది’’ నవ్వుతూ అన్నారు వాళ్లు.
ఒకప్పుడైతే వాళ్ల మాటలకి నాకు గర్వంగా అనిపించేది. కానీ అప్పుడు అలా అనిపించలేదు. ప్రణీత్ వైపు చూసాను. అతడు నా వైపు చూడడం లేదు. ఏదో పనిలో ఉన్నాడు.
నా మనసులో ఒకే ప్రశ్న... ఎన్నడూ లేనిది అంగారక గ్రహమ్మీద నన్ను వెదుక్కుంటూ వచ్చినప్పుడు ప్రణీత్ కళ్లలో నాకు ప్రేమ, స్నేహం ఎందుకు కనపడ్డాయి?! బాగా ఆలోచిస్తే నాకొక విషయం అర్థమైంది. ఆ క్షణంలో ప్రేమ, స్నేహం అన్న భావనలు నిజానికి అతడివి కావు... నావి! అతడి చూపులు ఎప్పుడూ ఒకలాగే ఉంటాయి. తేడా అల్లా నేను ఊహించుకోవడంలోనే.
అంటే, అంతకుముందు శిక్షణలో నేను అతడి కళ్లలో చూసిన స్వార్ధం, అంగారక గ్రహం మీద దిగబోయే ముందు అతడి కళ్లలో చూసిన కసి, శత్రుత్వం... అవి కూడా నావేనా?!
అసూయ బానిసజాతి సహజ లక్షణం. ఈ అసూయే మన జాతీయ శీలానికి దాపురించిన వినాశకారి. సర్వశక్తిమంతుడైన ఆ పరమేశ్వరుడు సైతం మనలోని ఈ అసూయ కారణంగానే, మనకేమీ చెయ్యలేకున్నాడు’ స్వామి వివేకానంద మాటలు గుర్తుకు వచ్చాయి.
మరో ఎనిమిది నెలలు ప్రయాణం చేసి తిరిగి భూమ్మీదకి చేరుకుంది అంతరిక్షనౌక. ఈ ఎనిమిది నెలల కాలం నా ఆలోచనల్లో చాలా మార్పుని తీసుకువచ్చింది.
అంగారక గ్రహమ్మీద మొదటి అడుగుపెట్టిన మానవుడిగా అప్పటికే ప్రపంచం మొత్త్తమ్మీద నా పేరు మార్మోగిపోతోంది.
భూమి మీద విజయవంతంగా ల్యాండ్ అయిన మా అంతరిక్ష నౌకలోంచి మొదటగా ప్రణీత్ దిగాడు. తరువాత మిగిలిన ఇద్దరూ దిగారు. అందరికన్నా చివరగా నేను కిందకి దిగి భూమ్మీద కాలుపెట్టాను. అంగారక గ్రహమ్మిద పెట్టినది కాదు - మారిన మనిషిగా తిరిగి వచ్చి భూమ్మీద పెట్టినదే నేను గర్వించగలిగే నా ‘మొదటి అడుగు’ అనిపించింది నాకు.
- ఆకునూరి మురళీకృష్ణ