Julakanti Rangareddy
-
జల జగడాలతో రెండు రాష్ట్రాలకూ నష్టం
జల వివాదాల పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య ఉభయ పాలకులు ఉద్వేగాలను రెచ్చగొడుతున్నారు. ఇండియా, చైనా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహ రించినట్లుగా సాగర్, శ్రీశైలం, పులి చింతల ప్రాజెక్టుల వద్ద పోలీసు బలగాలు మోహరించి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నారు. ఈ జగడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒక కారణమైతే, రెండవది తెలంగాణ లోనున్న ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరం ఉందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ కేంద్రాలలో నూటికి నూరు శాతం విద్యుత్ ఉత్పాదన చేయాలని నిర్ణయించడం. రెండు రాష్ట్రాలు కయ్యం పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వానికి ఉండే రాజకీయ ప్రయోజనాలు దానికి ఉండి సమస్య పరిష్కారం కాకుండా జాప్యం చేయడం వల్లనే సమస్య మరింత జటిలమౌతోంది. కృష్ణానది పుట్టిన మహారాష్ట్ర, ఆ తర్వాత పరివాహక ప్రాంతమైన కర్ణాటక, చివరి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వాలకు మధ్య జలవివాదాలు రగిలాయి. ఎగువనున్న రెండు రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని విని యోగించుకుంటున్నదనే వివాదాన్ని పై రాష్ట్రాలు రెండు లేవనెత్తాయి. అది పరిష్కరించడం కోసం కేంద్ర ప్రభుత్వం 1969లో ఆర్ఎస్ బచావత్ కమిటీని, జలవివాదాల పరి ష్కారం కోసం ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ట్రిబ్యునల్ వందేళ్ల జల పరివాహకాన్ని పరిగణనలోకి తీసు కొని మూడు రాష్ట్రాల వాటాలను తేల్చింది. బచావత్ ప్రముఖ ఇంజినీర్ కావడంతో, 75 శాతం డిపెండబిలిటీని ఆధారంగా వేసుకొని నికరజలాలను తేల్చారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో 2060 టీఎంసీలు నికరజలాలుగా నిర్ణయించారు. మహా రాష్ట్రకు 560 టీఎంసీలు, కర్ణాటకకు 700 టీఎంసీలు, ఆంధ్ర ప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయింపులు చేస్తూ 1976లో తీర్పునిచ్చారు. బచావత్ కమిటీ తీర్పు 2000 జూన్ 31 నాటికి ముగిసింది. మిగులు వరద జలాలను దిగువన ఉన్న వారు వాడుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిసి వచ్చింది. 1983లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభు త్వంలో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తమిళ తంబీల రుణం తీర్చుకోవడం కోసం ‘తెలుగుగంగ’ పథకాన్ని ప్రారం భించారు. దీనికోసం 15 టీఎంసీల నీటిలో ఎగువ రాష్ట్రాలు చెరో ఐదు టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐదు టీఎంసీలు కేటాయిస్తూ ఆనాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ఆధారంగా శ్రీశైలం ఎగువన పోతిరెడ్డిపాడు వద్ద హెడ్ రెగ్యులేటర్‌ను ప్రారంభించారు. 2004లో ముఖ్యమంత్రిగా వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలుగుగంగ హెడ్ రెగ్యు లేటర్‌ను వెడల్పు చేసి 11 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని తరలించుకుపోయే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రెగ్యులేటర్ గేట్లను పెంచి 44 వేల క్యూసెక్కులకు పైగా జలాలను తరలించే ఏర్పాటు చేశారు. బచావత్ కమిటీ ముగిసిన తర్వాత 2004లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. 65 శాతం డిపెండ బులిటీగా తీసుకొని, 2060గా ఉన్న నికర జలాలను 2,578 టీఎంసీలుగా ట్రిబ్యునల్‌గా గుర్తించింది. దాని ప్రకారం ఎగువన కర్ణాటకకు 700+211=911 టీఎంసీలు, మహారాష్ట్రకు 560+106=666 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి 811+190=1001 టీఎంసీలు కేటా యించింది. ఇప్పుడు అదనంగా కేటాయించిన 190 టీఎంసీల్లో సగం వాటా తెలంగాణా కావాలన్నది ప్రధానాంశంగా మారింది. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత అంతకుముందు 811 టీఎంసీలలో 512 ఆంధ్రప్రదేశ్‌కు, 299 టీఎంసీలు తెలంగాణకు కేటా యించారు. కమిటీ అదనంగా కేటాయించిన నీటిలో తమకు తక్కువ ఇవ్వడం కుదరదని తెలంగాణ వాదిస్తున్నది. అంతేకాదు, మొత్తం కేటాయింపులలో చెరి సగం వాటాను పంచుకోవాలని డిమాండ్ చేస్తున్నది. గత సంవత్సరం పోతిరెడ్డిపాడు ఎగువన సిద్ధేశ్వరం వద్ద కేంద్ర అనుమతులు లేని రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నిధులు కేటాయించారు. దీని ద్వారా మరో నాలుగు టీఎంసీల నీటిని తెలుగుగంగ కాల్వకు లింక్ చేయడం ద్వారా రోజుకు ఎనిమిది టీఎంసీల నీటిని అంటే 80 వేల క్యూసెక్కుల జలాలను తోడుకుపోవచ్చు. దీనికి తెలంగాణ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. వరద సమయంలో రోజుకు 80 వేల క్యూసెక్కులకు పైగా నీటిని తరలిస్తే పాలమూరు రంగారెడ్డి మొదలగు పథకాలకు నీళ్లు మిగలవని తెలంగాణ వాదన. రాయలసీమ పథకంపై గ్రీన్ ట్రిబ్యునల్ అనుమ తులు లేనందున నిలుపుదల చేయాలంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా జూరాల ఎగువన ప్రాజెక్టు నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టులు ఆపకపోతే తాము కూడా కృష్ణానదిపై ప్రాజెక్టులు కట్టుకొని నీటిని తీసుకుపోతామంటోంది. వాస్తవంగా కృష్ణా పరివాహక ప్రాంతం 68 శాతంకు పైగా తెలంగాణలో ఉంది. దీని ప్రకారం జలాల్లో వాటా 548 టీఎంసీలు దక్కాలని తెలం గాణ అంటున్నది. 32 శాతం మాత్రమే ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా పరివాహక ప్రాంతం ఉన్నది. అయినా 512 టీఎంసీలు పొందుతున్నది. ఇది న్యాయమా అని ప్రశ్నిస్తు న్నది. పరివాహక ప్రాంతాన్ని అనుసరించి కేటా యింపులు జరపాలని తెలంగాణ కోరుతున్నది. అయితే, ప్రాజెక్టులు నిండకముందే, 834 అడుగులు శ్రీశైలం జలాలు చేరక ముందే తెలంగాణ అక్రమంగా విద్యుత్తును ఉత్పాదన చేసి రోజుకు 30 వేల క్యూసెక్కులు వాడు కుంటోందని ఆంధ్రప్రదేశ్ వాదన. కేంద్ర అనుమతులు లేకుండా అనేక ఎత్తిపోతల పథకాలను తెలంగాణ చేపట్టిం దని ఆరోపిస్తున్నది. తెలంగాణ విద్యుత్ ఉత్పాదన చేయడం వల్ల రోజుకు ఎనిమిది వేల క్యూసె క్కులకు పైగా నీరు సముద్రంలో వృథాగా పోతోందని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ విన్నవించుకుంది. కేంద్ర ప్రభుత్వం, జల సంఘం, కృష్ణా రివర్ బోర్డు నీటి కేటాయింపులను జరిపినప్పుడే సమస్యకు శాశ్వత పరి ష్కారం లభిస్తుంది. గత సమావేశాల్లో తెలంగాణకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీనిచ్చింది. అందుకు సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించు కోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రం ఇచ్చిన హామీతో కేసును ఉపసంహరించుకుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పరిష్కారం ఉంది. జూలకంటి రంగారెడ్డి వ్యాసకర్త మాజీ శాసనసభ్యులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు -
ఎల్ఆర్ఎస్ పేరుతో నయా దోపిడీ
రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అక్రమ లేఅవుట్లు, అందులోని ప్లాట్ల క్రమబద్ధీకరణ చేయడానికి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రెండు జీవోలను విడుదల చేసింది. జీవో 131, జీవో 135. వీటి ప్రకారం 2020 ఆగస్టు 26 వరకూ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కల్గి ఉన్న యజమానులు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. ప్రస్తుతమున్న అనుమతుల్లేని లేఅవుట్ వెంచర్లన్నీ తప్పనిసరిగా అనుమతి పొందాల్సి ఉంటుంది. గ్రామకంఠం భూములకు ఇది వర్తించదు. వ్యక్తిగత ప్లాట్ యజమాని వెయ్యి ఫీజుతో, లేఅవుట్ వెంచర్ యజమాని రూ.10 వేలు ఆన్లైన్ ద్వారా చెల్లించి అక్టోబర్ 15లోగా దరఖాస్తు నమోదు చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 లక్షల అనధికార ప్లాట్లు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించినట్టు చెబుతున్నారు. ఈ 16 లక్షల మంది అప్లై చేసుకుంటే వచ్చే ఫీజుతోనే సుమారు రూ.160 కోట్ల ఆదాయం వస్తుంది. ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారు 2021 జనవరి 31 వరకూ ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకున్నట్లయితే 16 లక్షల ప్లాట్లకు గాను ఒక్కో దానికి సుమారు రూ.50 వేల చొప్పున వేసుకున్నా, రూ. 8 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశముంది. (చదవండి: ఎల్ఆర్ఎస్: ‘3 లక్షల కోట్లు దండుకోవాలని చూస్తోంది’) ప్రభుత్వం ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడుతోంది. చిన్న చిన్న ప్లాట్లు కల్గిన వారిలో 80 శాతం మంది పేద, మధ్యతరగతి వారే ఉన్నారు. అసలే కరోనా లాక్‌డౌన్‌తో అన్ని వర్గాల ప్రజలు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన దయనీయమైన స్థితిలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి నిరంకుశంగా వ్యవహరించడం సిగ్గుచేటు. లాక్డౌన్ సమయంలో ప్రజలను ఆదుకోవడానికి కొంత నగదు ఇచ్చి బియ్యం పంపిణీ చేయడంతో పాటు, ఇంటి అద్దెలను సైతం కట్టొద్దని చెప్పిన ముఖ్యమంత్రి నేడు వేల కోట్ల రూపాయలు ఎల్ఆర్ఎస్ పేరుతో వసూలు చేయడానికి పూనుకోవడం దుర్మార్గమైన చర్య. ప్రస్తుతమున్న ప్లాట్లు కొనుగోలు చేసి ఎల్ఆర్ఎస్ చేయిం చుకోకపోతే వాటిని అమ్మాలన్నా, వాటిలో నిర్మాణాలు చేపట్టాలన్నా అనుమతి ఉండదని; మంచినీటి కనెక్షన్, డ్రైనేజీ ఏర్పాటు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఏ విధమైన రిజిస్ట్రేషన్ జరగవని చెప్పడం– పరోక్షంగా ప్రజలను ప్రభుత్వం బెదిరించి ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నట్టు స్పష్టంగానే కన్పిస్తోంది. లేఅవుట్లలో ఎక్కువ వరకూ 200–250 గజాల ప్లాట్లు ఉంటాయి. ఇప్పుడు రోడ్లు విస్తరించే క్రమంలో ఆ ప్లాట్ల విస్తీర్ణం తగ్గిపోతోంది. రెండు వైపులా రోడ్ల ప్లాటు అయితే హక్కుదారులకు ఏమీ మిగలడం లేదు. అయినా వారి నుంచి కూడా మొత్తం ప్లాట్ల విస్తీర్ణానికి చార్జీలు వసూలు చేస్తున్నారు. పోయిన విస్తీర్ణానికి నష్టపరిహారం ఇవ్వడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 2015లో ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చింది. అక్రమ లేఅవుట్లు, అనధికార ప్లాట్లు క్రమబద్ధీకరించుకోవాలని సూచించింది. ఆ సమయంలో దరఖాస్తు రూపంలో రూ.10 వేలు చొప్పున వసూలు చేశారు. ఎక్కువ దరఖాస్తులను పరిష్కరించకుండానే మూలన పడేశారు. తిరిగి నేడు మళ్లీ ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలంటూ కొత్త జీవో తేవడంతో గతంలో కట్టిన డీడీల మాటేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. (చదవండి: సారూ.. మాకేది మోక్షం!) కేంద్రం నుంచి జీఎస్టీ రాష్ట్ర పన్నుల వాటాగా రూ.8 వేల కోట్లు రావాలని చెబుతున్నారు. పదే పదే అడిగినా ఇవ్వడం లేదని, కరోనా వైరస్ కట్టడి చేయడానికి కూడా ఆర్థిక సాయమందించడం లేదని గగ్గోలు పెడుతున్నారు. దేవుడితో పోరాడుతానని చెప్పిన ముఖ్యమంత్రి కేంద్రంతో ఎందుకు పోరాడి నిధులు రాబట్టలేకపోతున్నారో ప్రజలకు తెలియజేయాలి. కేంద్రంతో పోరాడే దమ్ము లేకనే పేద, మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారు. వాస్తవంగా రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారం నిషేధాస్తులు తప్ప ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయడం ఏమాత్రం ఆపకూడదు. కానీ ఆగస్టు నెల చివరి నుంచి రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిపివేయడం చట్టవిరుద్ధం. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఆరేళ్లు అవుతున్నా ఇప్పటివరకూ ఎందుకు అనుమతి లేని ప్లాట్లు, లేఅవుట్లకు రిజిస్ట్రేషన్ చేయనిచ్చారు? కొన్ని ప్లాట్లు, వెంచర్లలో భవన నిర్మాణాలు సైతం జరిగాయి. ఇన్ని ఏళ్ల కాలంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ గుర్తు రాలేదా? ప్రజలు అనేక కష్టాల్లో ఉన్నప్పుడు ఏకపక్షంగా ఆర్థికభారం మోపడం తగదు. తక్షణమే జీవో 131, 135లను రద్దుచేయాలి. వ్యాసకర్త: జూలకంటి రంగారెడ్డి, మాజీ శాసనసభ్యులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు -
కరోనాపై కార్యాచరణ ఏది?
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు 1,32,000 దాటిపోయాయి. ఈ మహమ్మారి మీద పోరాడుతున్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మనదేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ పరిణామాలతో దేశ ఆర్థిక వ్యవస్థ పెనుకుదుపులకు లోనయ్యింది. పారి శ్రామిక ఉత్పాదక, సేవా రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, శ్రామిక వర్గాల ప్రజల జీవితాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. దేశ ఆర్థిక వద్ధి రేటు పాతాళానికి పడిపోయింది. పొరుగున ఉన్న చైనా, అమెరికా, ఇటలీ మొదలగు దేశాల దారుణ అనుభవాల నుంచి మన ఏలికలు ఏమి గ్రహించలేకపోయారు. ఇందుకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అమెరికాతో సహా అనేక అభివద్ధి చెందిన దేశాల్లో రోజుల వ్యవధిలోనే కరోనా వైరస్ కేసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతూ పోతుంటే, కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వంలోని వివిధ విభాగాల యంత్రాంగాన్ని సన్నద్ధం చేయలేదు. మూడు వారాల లాక్డౌన్ వ్యవధిలో కూడ కరోనా వైరస్ నిర్ధారణ కిట్లు సమకూర్చుకోకపోవడం, కరోనా కట్టడిలో కీలక భాగస్వాములైన వివిధ విభాగాల ప్రభుత్వ యంత్రాంగానికి ముఖ్యంగా చికిత్సలో తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న వైద్యులకు, సిబ్బంది అందరికీ సరిపడా వ్యక్తిగత రక్షణ సామాగ్రి (పీపీఈల) సమకూర్చడంలో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఏప్రిల్ మొదటి వారం నాటికి చైనా మన దేశానికి విరాళంగా ఇచ్చిన వాటితో కలిపి 2 లక్షలా 10 వేల పీపీఈ కిట్లు మాత్రమే అందుబాటులోనున్నాయి. వేగంగా విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేయడానికి భారీ ఎత్తున పరీక్ష కిట్లు అందుబాటులో ఉంటే కానీ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య ఖచ్చితత్వం తేలదు. మన దేశంలో ఇప్పటివరకూ చేసిన పరీక్షలు ప్రతి 10 లక్షల మందిలో 1610 మందికి మాత్రమే. ఇంత తక్కువ సంఖ్యలో పరీక్షల ద్వారా కరోనా కేసుల వాస్తవ సంఖ్యను బేరీజు వేయడం దుర్లభం. కరోనా వైరస్‌ను సమర్థవంతంగా కట్టడి చేసిన చైనాలో వెయ్యి మంది జనాభాకు 1.8 వైద్యులు ఉంటే మనదేశంలో 0.62 వైద్యులు మాత్రమే ఉన్నారు. ఇక నర్సింగ్ సిబ్బంది కొరత కూడ విపరీతంగా ఉంది. మన దేశంలోని మొత్తం జనాభాలో 40 కోట్ల మంది దాకా రోజు కూలీలు కావడం గమనార్హం. ఇళ్ళలో పని వారు, భవన నిర్మాణ రంగం, ఇటుక బట్టీలు, ఇండ్లలో పని వారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 23 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలోని 25 వేల చిన్న, మధ్యతరహాపారిశ్రామిక యూనిట్లు లాక్డౌన్ కారణంగా మూతపడటం జరిగింది. దీనివల్ల 7.50 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, దాని అనుబంధ కార్మికులు కరోనా భయంతో ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది. మన ప్రధాని మోడీ ప్రపంచ దేశాల్లో పరిణామాలని చూస్తూ కూడా కరోనా వైరస్ విషయంలో ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఒక ప్రణాళిక లేకుండా లాక్డౌన్ ప్రకటించారు. 130 కోట్ల జనాభాలోని 90 శాతం ప్రజల జీవనశైలి, బతుకుతెరువు చిధ్రమైంది. తాజాగా ఏప్రిల్ 20 తేది నుంచి అమలయ్యే సడలింపు వల్ల ఆర్థిక వద్ధి రేటులో అద్భుతాలు సంభవిస్తాయి అనుకోవడం భ్రమే. దేశవ్యాప్తంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తిరిగి ప్రారంభించడానికి, చెల్లాచెదురైన కార్మికులు మళ్లీ తాము పని చేసే చోట్లకు రావడానికి సమయం పడుతోంది. ఇదిలా ఉండగా కొన్ని సేవా రంగాల్లో వారికి కరోనా ‘జంకు’ అడ్డుపడుతోంది. ముఖ్యంగా ఇండ్లలో పని చేసే వాళ్ళకి ఒక పెద్ద అవరోధంగా నిలుస్తుంది. ఈ విధంగా కోట్లాదిమంది కార్మికులకు ఉపాధిపై కరోనా మహమ్మారి నీలి నీడలు వెంటాడుతాయి. ఇప్పటికైనా ఏలికలు మేల్కొని దేశంలో 120 కోట్లకు పైగా ఉన్న పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలను ఆదుకోవడానికి పకడ్బందీ ఆర్థికసహాయ ప్రణాళికను ప్రకటించాలి. భవిష్యత్తులో ప్రభుత్వ వైద్య సేవలను విస్తతం చేయాలి. ఈ సందర్భంగా రాజకీయ అభిప్రాయాలకు తావు లేకుండా అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి కరోనా విపత్తు మీద తక్షణం కార్యాచరణ రూపొందించాలి. జూలకంటి రంగారెడ్డి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మొబైల్ : 94900 98349 -
నల్ల కుబేరుల జాబితా బయటపెట్టాలి: జూలకంటి
హైదరాబాద్: నల్ల కుబేరుల జాబితాను బయటపెట్టాలని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ..బ్యాంక్ రుణాలను ఎగ్గొట్టిన వారే ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్నారన్నారు. నల్లధనం ప్రస్తుతం దేశంలో లేదని, విదేశాలకు తరలి వెళ్లిందన్నారు. 100 రోజుల్లో బ్లాక్‌మనీ తెస్తానన్న మోదీ ఆ విషయంలో విఫలమయ్యారని విమర్శించారు. పెద్ద నోట్లను రద్దు చేసిన మోదీ రూ. 2 వేల నోట్లెందుకు తెచ్చారని అన్నారు. కేంద్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించాలన్నారు. నోట్ల రద్దు తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపించిందని, సర్కార్‌కు రెవెన్యూ తగ్గడంతో కేసీఆర్ నిద్ర పోవడం లేదన్నారు. ప్రజా ప్రతినిధులు జీతాలు తీసుకోవడం మానేసి..ఉద్యోగుల జీతాలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అవినీతి పరులపై మోదీ ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. -
26న భూ నిర్వాసితులతో మహాధర్నా
మిర్యాలగూడ : ప్రాజెక్టులు, పరిశ్రమలకు ప్రభుత్వం సేకరిస్తున్న భూములకు పరిహారం చెల్లిస్తున్న 123 జీఓను రద్దు చేసి 2013 భూసేకకరణ చట్టాన్ని అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యాదర్శి జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మిర్యాలగూడలోని సీపీఎం కార్యాలయంలో ఈ నెల 26వ తేదీన తెలంగాణ భూనిర్వాసితులతో కలిసి హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించే మహాధర్నా వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణానికి వ్యతిరేకం కాదని, కానీ రైతుల నుంచి సేకరిస్తున్న భూమికి నష్ట పరిహారం పూర్తిస్థాయిలో చెల్లించాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులు ధర్నాకు తరలిరావాలని కోరారు. ధర్నాకు సీపీఎం పూర్తి మద్దతు ఇస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో సీపీఎ -
'సభలో గ్రూపులు కట్టడం హైకమాండ్ వ్యూహమే'
హైదరాబాద్ : నలభై రోజులపాటు శాసనసభలో చర్చ జరిగాక విభజన బిల్లును తిప్పిపంపాలన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నోటీసుపై సీపీఎం మండిపడింది. బిల్లుపై..కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు సభలోనే గ్రూపులు కట్టడం హైకమాండ్ వ్యూహమని సీపీఎం ఫ్లోర్ లీడర్ జూలకంటి రంగారెడ్డి మండిపడ్డారు. సభలో గందరగోళ పరిస్థితిని సృష్టించి రాజకీయ లబ్ది పొందేందుకు కాంగ్రెస్ పన్నిన కుట్రలో ఇది భాగమని ఆయన అన్నారు. తక్షణం బీఏసీని ఏర్పాటు చేసి, సభ సజావుగా సాగేలా చూడాలని జూలకంటి డిమాండ్ చేస్తున్నారు. -
హైదరాబాద్, భద్రాచలం తెలంగాణలోనే ఉండాలి
మిర్యాలగూడ: రాష్ట్ర విభజన అనివార్యమైతే హైదరాబాద్, భద్రాచలం తెలంగాణలో అంతర్భాగంగానే ఉండాలనే విషయం జీవోఎం ఎదుట చెప్పినట్లు సీపీఎం శాసనసభ పక్షనేత జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ నిర్ణయం సమైక్యవాదమే అయినప్పటికీ రాష్ట్ర విభజన విషయంలో ఆంటోని అడిగిన ప్రశ్నలకు హైదరాబాద్‌ను ప్రత్యేకంగా గవర్నర్ లేదా కేంద్రం అజమాయిషీలో పెట్టవద్దని కోరినట్లు ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలని, కరువు, వెనుకబడిన ప్రాంతాలలోని ప్రాజెక్టులను పూర్తి చేయాలని, కచ్చితమైన నీటి కేటాయింపులు జరపాలని, ప్రాణహిత -చేవెళ్ల ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించాలని కోరామన్నారు. -
రావణ కాష్టాన్ని ఆర్పండి: సీపీఎం
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘రాష్ట్రం రావణకాష్ఠంలా మారింది. దీన్నిలా తగలబడనివ్వొద్దు. వెంటనే పరిష్కారం చూపాలి. విభజన వల్ల పరిష్కారమయ్యే సమస్యలకన్నా ఉత్పన్నమయ్యేవే చాలా ఎక్కువ. కాబట్టి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలి’’ అని కేంద్ర మంత్రుల బృందాన్ని సీపీఎం కోరింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు, శాసనసభాపక్ష నేత జూలకంటి రంగారెడ్డిలతో కూడిన బృందం బుధవారం ఉదయం జీవోఎం సభ్యులతో భేటీ అయింది. అనంతరం రంగారెడ్డితో కలిసి రాఘవులు విలేకరులతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, మంత్రులు జైరాం రమేశ్, వీరప్ప మొయిలీలకు తమ అభిప్రాయాన్ని రాతపూర్వకంగా ఇవ్వడంతో పాటు వివరించామన్నారు. ‘‘నాలుగేళ్లుగా సమస్యను నానబెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. పాలన స్తంభించింది. మంత్రివర్గం రెండు ముఠాలై యుద్ధ శిబిరాల్లా నడుస్తోంది. ప్రజా సమస్యలు పేరుకుపోయాయి. వాటిని పరిష్కరించే నాథుడు కనబడటం లేదు. అభివృద్ధి కుంటుపడింది. ఇంకా మీరు ఈ సమస్యని సాగదీసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకుంటే ప్రజలు క్షమించరని జీవోఎంకు చెప్పాం. ఏదో ఒక నిర్ణయం చెబుతామని గతంలో చెప్పి కూడా వాయిదాలు వేస్తూ వచ్చారు. ఈసారైనా నాటకాలు కట్టిపెట్టి పరిష్కారం చూపుతారా లేదా అని నిలదీశాం’’ అన్నారు. రెండే అడిగారు... పోలవరం, భద్రాచలం డివిజన్‌ను విడదీయడంపై జీవోఎం తమను అభిప్రాయం కోరిందని రాఘవులు వెల్లడించారు. ‘ప్రస్తుత డిజైన్‌లో పోలవరం ప్రాజెక్టు గిరిజనులను, విలువైన భూముల్ని ముంచేస్తుంది. కాబట్టి డిజైన్ మార్చాలన్నాం. ఇక రాష్ట్రాన్నే విడదీయొద్దని మేమంటున్నప్పుడు ఖమ్మం జిల్లాను విడదీయాలని కోరబోమని చెప్పాం. జీవోఎం ముందు నాలుగు ప్రధాన సమస్యల్ని లేవనెత్తాం. సమైక్యంగా ఉన్నా, విభజించినా వెనకబడిన ప్రాంతాలు, జిల్లాల సమస్య ముఖ్యమైనది. అందుకే సమైక్య రాష్ట్రంలో కూడా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిర్దిష్ట సూచనలు చేశాం. వాటిని జీవోఎం సభ్యులు సావధానంగా విన్నారు’ అని చెప్పారు. " సీపీఎం లేవనెత్తిన నాలుగు అంశాలు... 1. సాగునీటి సౌకర్యాలకు సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టు ప్రాతిపదికగా అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, మహబూబ్‌నగర్, నల్లగొండ, ప్రకాశం జిల్లాలకు వర్తించే ప్రాజెక్టుల పరిపూర్తికి అయ్యే ఖర్చునంతా కేంద్రం భరించాలి. తెలంగాణలోని ప్రాణహిత-చేవెళ్ల, కంతనపల్లిలను కేంద్ర నిధులతో పూర్తి చేయాలి. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులనూ త్వరగా పూర్తి చేయాలి. 2. సామాజిక తరగతులు, దళితులు, ముస్లింలు, గిరిజనుల వెనకబాటే పలు ప్రాంతాల వెనకబాటుతనానికి ముఖ్య కారణం. వారి అభ్యున్నతికి, విద్యాపరంగా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. 3. చిత్తూరు నుంచి ఆదిలాబాద్ దాకా కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకుని ఉన్న పశ్చిమ ప్రాంత మండలాల్లో ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలల్ని అదనంగా ఏర్పాటు చేయాలి. 4. కోస్తా తీరంలో ఓడరేవులకు పనికొచ్చే కేంద్రాలెన్నో ఉన్నా ఇప్పటికీ అభివృద్ధి చెందలేదు. వాటి అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలివ్వాలి. రాయలసీమలో కూడా అన్ని సదుపాయాలతో ఒకట్రెండు ప్రాంతాల్లో పారిశ్రామికంగా, విద్యాపరంగా, సేవాపరంగా అభివృద్ధికి ప్రభుత్వరంగంలో కాంప్లెక్సుల స్థాపనకు చర్యలు తీసుకోవాలి జీవోఎంకు సీపీఎం బృందం సమర్పించిన నాలుగుపేజీల వినతిపత్రంలోని ఇతర ముఖ్యాంశాలివి... * కృష్ణా జలాల పంపిణీపై బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పు రాష్ట్రానికి సరైన న్యాయం చేయలేదు. అందుకే న్యాయమైన పద్ధతిలో రాష్ట్రానికి అదనపు నికర జలాలను కేటాయించేలా ఎగువ రాష్ట్రాలతో కేంద్రం ఒప్పందాలు కుదర్చాలి * అక్షరాస్యతలో బాగా వెనకబడిన ప్రతి మండలంలోనూ కనీసం రెండు రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టాలి. ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో విద్యా కాంప్లెక్సులు ఏర్పాటు చేయాలి * హైదరాబాద్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, పరిశోధనా సంస్థలన్నింటినీ అన్ని ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయాలి * ముస్లిం ప్రాబల్య పట్టణాల్లో వారికోసం ఆధునిక, లౌకిక విద్యనందించే విద్యా కాంప్లెక్సులు నెలకొల్పాలి * అభివృద్ధిని ఉత్తర తెలంగాణ, రాయలసీమల్లోని పలు జిల్లాలకు వికేంద్రీకరించాలి. ఆయా కేంద్రాలను మార్కెట్లతో సంధానిస్తూ ఆధునిక రవాణా మార్గాలు నిర్మించాలి * రాష్ట్రంలోని గ్యాస్, బొగ్గు ఉత్పత్తుల్లో రాష్ట్ర అవసరాలకు ప్రాధాన్యమిస్తూ కేటాయింపులను కేంద్రం తిరిగి నిర్ణయించాలి -
కాంగ్రెస్‌కు ఇవి అంతిమ యాత్రలే
సాక్షి, హైదరాబాద్: ఎవరి పాలన నుంచి విముక్తి పొందారని ఈ జైత్రయాత్రలు నిర్వహిస్తున్నారంటూ సీపీఎం శాసనసభాపక్ష నేత జూలకంటి రంగారెడ్డి కాంగ్రెస్ నేతల్ని నిలదీశారు. ప్రజా సమస్యలను పరిష్కరించని కాంగ్రెస్ పార్టీకి ఈ యాత్రలు అంతిమ యాత్రలే అవుతాయని హెచ్చరించారు. ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలం పాలించి ప్రాం తీయ అసమానతలు సృష్టించిందీ, ఇప్పుడు విడిపోవడానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీయేనని ధ్వజమెత్తారు. ఈమేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన చేశారు. కులం, మతం, ప్రాంతీయం వంటి భేదాలు సృష్టించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు జైత్రయాత్రలు జరుపుకునే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. 50 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అథోగతి పాల్జేసి ఇప్పుడు పునర్నిర్మాణం చేస్తామనడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర విభజనపై ఒక స్పష్టమైన విధానంగానీ, ప్రాతిపదిక గానీ లేని ఫలితమే ఒక చోట జైత్రయాత్రలు, మరోచోట శవయాత్రలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అవకాశవాదంతో ప్రాంతానికో విధానాన్ని అనుసరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రకటన రాకతోనే జైత్రయాత్రల పేరుతో జనంపై దండయాత్రలకు దిగిందని మండిపడ్డారు. రాధాకృష్ణ మృతికి రాఘవులు, నారాయణ సంతాపం సాక్షి, హైదరాబాద్: సీపీఎం నాయకుడు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి (వైఆర్కే) మృతికి ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు బీవీ రాఘవులు, కె.నారాయణ ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచే వైఆర్కే జీవితం ప్రజా ఉద్యమంతో మమేకమైందని వివరించారు. పౌరహక్కులను కాపాడడంలో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు. వైఆర్కే కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..?
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి, మంత్రులు ఒకరిపైనొకరు ఆరోపణలు చేసుకోవడంతో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని, రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..? లేదా..? అనే అనుమానం కలుగుతోందని సీపీఎం శాసనసభాపక్ష నేత జూలకంటి రంగారెడ్డి అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి అవకాశవాద రాజకీయాల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. మంగళవారం పట్టణంలోని సీపీఎం కార్యాలయం ఎదుట కామ్రెడ్ బాసెట్టి మాధవరావు స్మారక కేంద్రం, సీఐటీయూ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కార్మిక నాయకుడిగా, పేదల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాడిన మాధవరావు వ్యక్తి కాదు శక్తి అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. అన్ని రంగాల కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్న సీఐటీయూ నాయకులు మాధవరావును ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ ప్రాంతం వెనుకబడిందని, అందువల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమస్య తలెత్తిందని చెప్పారు. సీడబ్ల్యూసీ తెలంగాణపై నిర్ణయం తీసుకొని 60 రోజులు గడుస్తున్నా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడంతో ఉద్యమాలు ఉధృతం అవుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే తెలంగాణ సమస్య పరిష్కరించాలని అన్నారు. మాధవరావు సేవలను ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గోడం నగేష్, డీసీసీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, ఆల్ఇండియా రైతు సంఘం ఉపాధ్యక్షుడు సారంపెల్లి మల్లారెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబు, సీపీఎం రాష్ట్ర నాయకుడు లంక రాఘవులు, జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముంజం శ్రీనివాస్, డి.మల్లేశ్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పాయల శంకర్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అశోక్, మాధవరావు సతీమణి కమలబాయి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలు పట్టించుకునే నాధుడేడి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అనిశ్చితితో పరిపాలన పూర్తిగా స్తంభించి పోయిందని, ప్రజా సమస్యల్ని పట్టించుకునే నాధుడే లేకుండా పోయారని సీపీఎం శాసనసభాపక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. సచివాలయానికి తాళాలు వేయడం ఒక్కటే మిగిలి ఉందని, ఏ శాఖా కార్యాలయంలోనూ పనలు సాగడం లేదని వాపోయారు. ఆరోగ్య శ్రీ లబ్ధిదారులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నా, కాలువలు, చెరువులకు గండ్లు పడ్డా ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు వారివారి స్వార్థం చూసుకుంటున్నాయే తప్ప ప్రజల్ని పట్టించుకోవడం లేదని తెలిపారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే సచివాలయానికి రాక పోతే ఇంకెవరు వస్తారని ప్రశ్నించారు. -
కాంగ్రెస్, టీడీపీ అవకాశవాదాన్ని వీడాలి: జూలకంటి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీ నేతలు ఇకనైనా అవకాశవాదాన్ని విడనాడాలని సీపీఎం శాసనసభాపక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని నడిపారో తిరిగి అదే పార్టీ వాళ్లు సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడపడం విడ్డూరమని పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్న కాంగ్రెస్ నేతలు, తెలంగాణకు కట్టుబడి ఉంటామని లేఖ ఇచ్చిన టీడీపీ నాయకులే ఇప్పుడు సీమాంధ్రలో ప్రజల్ని రెచ్చగొట్టడం అన్యాయమని సోమవారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. ఏదైనా పార్టీకి ఒకే విధానం, ఒకే జెండా ఉంటాయని, కాంగ్రెస్, టీడీపీలు మాత్రం విభిన్నంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రజల్ని గందరగోళం చేయడం మానాలని హితవు పలికారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి వ్యవహరించాలని కోరారు. అవకాశ ఉద్యమాలకు పాల్పడవద్దని, ఇప్పటికే రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని వివరించారు. వైషమ్యాలు పెంచే వైఖర్ని విడనాడి ఇరు ప్రాంతాల ప్రజల మధ్య సత్సంబంధాల కోసం కృషి చేయాలని సలహా ఇచ్చారు.