హైదరాబాద్, భద్రాచలం తెలంగాణలోనే ఉండాలి
మిర్యాలగూడ: రాష్ట్ర విభజన అనివార్యమైతే హైదరాబాద్, భద్రాచలం తెలంగాణలో అంతర్భాగంగానే ఉండాలనే విషయం జీవోఎం ఎదుట చెప్పినట్లు సీపీఎం శాసనసభ పక్షనేత జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
తమ పార్టీ నిర్ణయం సమైక్యవాదమే అయినప్పటికీ రాష్ట్ర విభజన విషయంలో ఆంటోని అడిగిన ప్రశ్నలకు హైదరాబాద్‌ను ప్రత్యేకంగా గవర్నర్ లేదా కేంద్రం అజమాయిషీలో పెట్టవద్దని కోరినట్లు ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలని, కరువు, వెనుకబడిన ప్రాంతాలలోని ప్రాజెక్టులను పూర్తి చేయాలని, కచ్చితమైన నీటి కేటాయింపులు జరపాలని, ప్రాణహిత -చేవెళ్ల ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించాలని కోరామన్నారు.